పిల్లల్లో నులి పురుగులు
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:35 AM
పిల్లల బలహీనతకు ప్రధాన కారణాల్లో నులి పురుగులు ఒకటి. ఈ పరాన్నజీవులు, పోషకలోపానికి గురిచేసి, పిల్లలను బలహీన పరుస్తాయి. కాబట్టి ఇవి పిల్లల శరీరాల్లోకి...
కిడ్స్ కేర్
పిల్లల బలహీనతకు ప్రధాన కారణాల్లో నులి పురుగులు ఒకటి. ఈ పరాన్నజీవులు, పోషకలోపానికి గురిచేసి, పిల్లలను బలహీన పరుస్తాయి. కాబట్టి ఇవి పిల్లల శరీరాల్లోకి చొరబడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆ మార్గాలకు అడ్డుకట్ట వేస్తూ ఉండాలంటున్నారు వైద్యులు.
పిల్లల్లో నులిపురుగుల సమస్య సర్వసాధారణం. అయితే పిల్లలు కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు, పెద్దలు దాన్ని జీర్ణసమస్యగానే పరిగణిస్తారు తప్ప నులిపురుగుల సమస్యగా అనుమానించరు. కానీ తరచూ కడుపునొప్పి, మలద్వారం దగ్గర తీవ్రమైన దురద, ఆకలి లోపించడం, బరువు కోల్పోతూ ఉండడం, నీళ్ల విరోచనాలు, మలంలో నులిపురుగులు, బలవర్థక ఆహారం తింటున్నప్పటికీ పిల్లలు బలహీనంగా ఉండడం, మలంలో పురుగులు, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలకు నులిపురుగులు సోకినట్టు అనుమానించాలి.
మందులు వయసుకు తగ్గట్టు
ప్రధానంగా పిల్లలకు వ్యాపించే నులిపురుగులన్నీ మట్టి ద్వారానే వ్యాపిస్తాయి. ప్రఽధానంగా మట్టితో ముడిపడి ఉండే కూరగాయల నుంచే ఈ నులిపురుగులు పిల్లల్లోకి ప్రవేశిస్తాయి. నులిపురుగులన్నీ పరాన్న జీవులే! ఇవి శరీరంలోకి చొరబడి, శరీరాన్నే ఆహార వనరుగా వాడుకుంటాయి. శరీరంలోకి చేరుకునే ఆహారంలోని పోషకాలను శోషించుకుంటూ వృద్ధి చెందుతాయి. అయితే ఈ నులిపురుగులకు విరుగుడు కోసం మందులు ఉన్నప్పటికీ, ఏడాది లోపు పిల్లలకు ఎటువంటి మందులూ ఇవ్వకూడదు. ఏడాది వయసు నుంచి 12 - 14 ఏళ్ల వయసు పిల్లలకు ఈ మందులు ఇవ్వొచ్చు. ఒకటి నుంచి రెండేళ్ల పిల్లలకు సిరప్స్, మాత్రలు ఉంటాయి. ఈ వయసు పిల్లలకు 200 మిల్లీగ్రాముల మందు సరిపోతుంది. అంతకంటే పెద్ద వయసు పిల్లలకు 400 మి.గ్రా మాత్రలు ఇవ్వొచ్చు. ఈ మందులను తీవ్రతను బట్టి ఏడాదికోసారి లేదా ఏడాదికి రెండుసార్లు పిల్లలకు అవ్వడం అవసరం. గ్రామీణ వాతావరణంలో పెరిగే పిల్లలకు ఏడాదికి రెండుసార్లు, మట్టికి దూరంగా నగర వాతావరణంలో పెరిగే పిల్లలకు ఏడాదికోసారి ఈ మందు ఇవ్వాలి. ఒకవేళ పిల్లల్లో తరచూ నులిపురుగుల సమస్య తలెత్తుతూ ఉంటే, వ్యాధినిరోధకశక్తిని పరీక్షించుకుని ఆ లోపాన్ని సరిదిద్దుకోవలసి వస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పిల్లలకు నులిపురుగులు సోకకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి
కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడగడం
పిల్లల వేళ్లకున్న గోళ్లు తొలగించడం
పరిశుభ్రత పాటించడం
తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకునే అలవాటు పిల్లలకు నేర్పించడం
పరాన్నజీవులు పలురకాలు
పిల్లల శరీరాల్లోకి ప్రవేశించే పరాన్న జీవుల్లో రకాలుంటాయి. రింగ్ వార్మ్, టేప్ వార్మ్, హుక్ వార్మ్‌లో రింగ్ వార్మ్ మట్టి ద్వారా పిల్లలకు వ్యాపిస్తుంది. టేప్ వార్మ్ మట్టితో పాటు మాంసాహారం నుంచి, మరీ ముఖ్యంగా పోర్క్ నుంచి పిల్లలకు వ్యాపిస్తుంది. కాబట్టి పోర్క్‌ను ఎక్కువ నీళ్లతో శుభ్రం చేయడంతో పాటు తగినంత సమయం ఉడికించాలి. ఈ టేప్ వార్మ్ శరీరంలో వేర్వేరు ప్రదేశాలకు చేరుకునే ప్రమాదం ఉంటుంది. అది చేరుకున్న ప్రదేశం మీదే లక్షణాలు ఆధారపడతాయి. కొన్ని సందర్భాల్లో టేప్ వార్మ్ పిల్లల మెదళ్లలోకి కూడా చేరుకుంటుంది. వీళ్లలో తలనొప్పి, వాంతులు వేధిస్తాయి. కంట్లోకి చేరుకున్నప్పుడు కంటి చూపు క్షీణిస్తుంది.
హుక్ వార్మ్ పేగుల్లో కొక్కెంలా తగులుకుని, గాయపరిచి పోషకాలను శోషించుకుంటుంది. ఫలితంగా మలంలో రక్తం కూడా కనిపించవచ్చు. దాంతో పిల్లల్లో రక్తహీనత తలెత్తుతుంది.ఊరట ఇలా...
పురుగుమందులు వదిలిపోయాయి అని నిర్థారించుకోవడం కోసం పిల్లల్లో కొన్ని లక్షణాలను గమనించవచ్చు. పిల్లలు రాత్రుళ్లు ఏడ్వకుండా నిద్రపోవడం, కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేయకపోవడం, ఆకలి, బరువు పెరగడం లాంటి లక్షణాలను బట్టి పిల్లల్లో నులిపురుగుల సమస్య సమసిపోయిందని నిర్థారించుకోవచ్చు.
డాక్టర్ సత్యన్నారాయణ రెడ్డి బత్తుల
కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్,
రెయిన్‌బో చిల్డ్రన్స్ హస్పిటల్
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్