బంధం బలపడేలా...
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:46 AM
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారితో అనుబంధం బలపడేలా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం..
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారితో అనుబంధం బలపడేలా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం...
పిల్లలు తాము చూసినవి, విన్నవి, తెలుసుకున్నవి... ఇలా ఎన్నింటి గురించో మాట్లాడుతుంటారు. వాటన్నింటినీ ఓపికగా వినాలి. మధ్యలో ఎలాంటి అడ్డు చెప్పకూడదు. అప్పుడే వారిలో ఏ అంశాన్నైనా తల్లిదండ్రులతో పంచుకోవచ్చన్న భావన కలుగుతుంది.
పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని వారి కళ్లలోకి చూస్తూ మృదు స్వరంతో నెమ్మదిగా మాట్లాడాలి. శ్రద్ద, ప్రేమలను వ్యక్తం చేయాలి. కోపాన్ని, విసుగును ప్రదర్శించకూడదు. పిల్లలు తరచూ అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెప్పాలి. ఏవైనా పొరబాట్లు చేస్తే వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలి.
చదువు, ఆటలు, కళలకు సంబంధించి పిల్లలు ఏ చిన్న విజయాన్ని సాధించినా మనస్ఫూర్తిగా అభినందించాలి. తగిన ప్రోత్సాహం అందించాలి. అలాగే వారుచేసే మంచి పనులను గుర్తించి ప్రశంసించాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు క్రమంగా వారితో అనుబంధం పెరుగుతుంది.
చిన్న సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే స్వేచ్ఛను ఇస్తూనే పిల్లలకు సరైన మార్గదర్శకత్వాన్ని అందించాలి. సమయానుసారం నిర్ణయాలు తీసుకోవడాన్నీ నేర్పించాలి.
కోపం, బాధ, భయం లాంటి భావోద్వేగాలను వ్యక్తం చేసినప్పుడు తగు రీతిలో పిల్లలకు సర్దిచెప్పాలి. అలాగే వారి సంతోషాన్నీ పంచుకోవాలి. వారిని తోటి పిల్లలతో పోల్చకూడదు.
పిల్లలకు అతిగా సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. అలాచేస్తే విసుగు చెంది మాట్లాడడం మానేస్తారు. అవసరం మేరకు ఒకట్రెండు మాటలను మాత్రమే స్పష్టంగా చెప్పాలి.
రోజూ పిల్లలతో కొంత సమయాన్ని గడపాలి. కలిసి ఆడడం, భోజనం చేయడం లాంటివి అనుబంధాన్ని పెంచుతాయి.
Also Read:
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు