ఎముకలు గుల్లబారిపోకుండా...
ABN , Publish Date - Aug 18 , 2026 | 05:02 AM
చెద తొలిచిన కొమ్మల్లా ఎముకలు బోలుగా మారిపోయే సమస్య ఆస్టియొపొరొసిస్. చిన్నపాటి తాకిడికే పుటుక్కున విరిగిపోయే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే తినే ఆహారం, గడిపే జీవనశైలుల...
ఆస్టియొపొరొసిస్
చెద తొలిచిన కొమ్మల్లా ఎముకలు బోలుగా మారిపోయే సమస్య ఆస్టియొపొరొసిస్. చిన్నపాటి తాకిడికే పుటుక్కున విరిగిపోయే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే తినే ఆహారం, గడిపే జీవనశైలుల మీద దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా మహిళలు ఎముకల పటుత్వాన్ని రెట్టింపు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసం తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి వైద్యులేమంటున్నారంటే...
ఎముకల నొప్పులను సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఎముకలు బోలుగా మారుతున్నాయని మన శరీరం ముందుగానే ఎముకలు, కండరాల నొప్పులతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఎముకలు బలహీనపడడం వల్ల కీళ్ల మధ్య కార్టిలేజ్ అరిగిపోయి, మోకాళ్ల నొప్పులు, తుంటి నొప్పి, వెన్ను, నడుము నొప్పులు మొదలవుతాయి. ఇది ఆస్టియొపొరొసిస్ ముందరి దశ. దీన్ని ఆస్టియొపీనియా అని అంటారు. ఈ దశలోనే జాగ్రత్తపడితే ఎముకలు పూర్తిగా గుల్లబారిపోయే ఆస్టియొపొరొసిస్ దశకు చేరకుండా నియంత్రించుకోవచ్చు. అయితే ఎముకలను పటిష్ఠంగా ఉంచుకోవాలంటే, ప్రతి ఒక్కరూ అందుకు తోడ్పడే అంశాల గురించి కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి.
కారణాలు కోకొల్లలు
ఎముకల నిర్మాణానికి క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి3 అనే ఖనిజ లవణాలు కీలకం. వీటిలో ఫాస్ఫరస్, క్యాల్షియం ఆహారం నుంచి సమకూరితే, విటమిన్ డి3 సూర్యరశ్మి నుంచి సమకూరుతుంది. ఈ పోషకాలను శరీరానికి చేరవేసే క్యారియర్స్ అయిన హార్మోన్లలో అవకతవకలు తలెత్తినా, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి3లను శుద్ధి చేసే మూత్రపిండాలు, కాలేయాలు సమర్థంగా పని చేయకపోయినా ఎముకలు గుల్లబారిపోతాయి. పేగుల్లో సమస్యలున్నా పోషకాల శోషణ జరగక ఎముకలు బలహీనపడతాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడంతో ఎముకలు గుల్లబారడం మొదలుపెడతాయి. అలాగే చిన్న వయసులోనే గర్భాశయాన్ని తొలగించుకున్నవాళ్లలో అంతకంటే ముందుగానే గుల్లబారిపోతాయి. సాధారణంగా 60 ఏళ్లు దాటిన పెద్దల్లో తొడ లేదా తుంటి ఎముక విరిగినప్పుడు, జారి పడడం వల్లే అలా జరిగిందని అనుకుంటాం. కానీ నిజానికి పెద్దల్లో మొదట తుంటి లేదా తొడ ఎముక విరిగి, అందువల్ల కింద పడిపోతూ ఉంటారు. దీనికంతటికీ ఎముకలు గుల్లబారి, పటుత్వం కోల్పోవడమే కారణం.

ఎముకలకు బలాన్నిచ్చే ఇంజెక్షన్లు
ఆస్టియొపొరొసి్‌సను నిర్థారించుకోవడం కోసం బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, డెక్సా స్కాన్‌తో పాటు ఫాస్ఫరస్, క్యాల్షియం మోతాదులను పరీక్షించుకునే రక్త పరీక్షలు కూడా అవసరమవుతాయి. అలాగే మూత్రపిండాలు, కాలేయం, పేగుల పరీక్షలతో ఆయా అవయవాలన్నీ సమర్థంగా పని చేస్తున్నట్టు నిర్థారించుకోవాలి. వీటిలో ఏ లోపాలూ లేవని నిర్థారించుకున్నప్పుడు వైద్యులు క్యాల్షియం, విటమిన్ డి3 సప్లిమెంట్లను సూచిస్తారు. నెలసరి ఆగిపోయిన మహిళలకు హార్మోన్ రీప్లే్‌సమెంట్ థెరపీ అవసరమవుతుంది. ప్రస్తుతం ఎముకల పటుత్వాన్ని పెంచడం కోసం టెరాపెరటైడ్ అనే ఇంజెక్షన్ వాడుకలోకొచ్చింది. ఇంజెక్షన్ రూపంలో ఉన్న ఈ హార్మోన్ ఎముకల పటుత్వానికి అవసరమైన పోషకాలన్నిటినీ, శరీరంలో బలహీనంగా ఉన్న ఎముకల దగ్గరకు చేర్చి వాటిని మరమ్మత్తు చేస్తుంది. అప్పటికే ఆస్టియొపొరొసి్‌సతో ఎముకలు ఫ్రాక్చర్ అయిన వాళ్లు ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇన్సులిన్ పెన్నును పోలిన ఈ ఇంజెక్షన్‌ను ఎవరికి వారు రోజుకొక షాట్ చొప్పున, 18 నెలల పాటు వాడుకోవడం అవసరం. ఇంత కాలం పాటు తీసుకోలేని వారు, ఏడాదికోసారి లేదా ఆరు నెల్లకోసారి తీసుకునే ఇంజెక్షన్లను ఆశ్రయించవచ్చు. ఈ ఇంజెక్షన్లతో పాటు ముక్కులో స్ర్పే చేసుకునే, క్యాల్సిటోనిన్ స్ర్పేలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ వద్దనుకునేవాళ్ల కోసం నోటి మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే నోటి మాత్రలతో పోల్చితే, ఇంజెక్షన్లు ఎక్కువ సమర్థవంతమైనవి. అలాగే గుల్లబారడం వల్ల ఫ్రాక్చర్ అయ్యే వీలున్న ఎముకలకు సర్జరీ కూడా అవసరమవుతుంది. సర్జరీతో పాటు అదనంగా ఎముకలను బలపరిచే ఇంజెక్షన్లు కూడా తీసుకోవలసి వస్తుంది.
వీరికి ముప్పు ఎక్కువ
మెనోపాజ్ మహిళలు
50 ఏళ్లు దాటిన వారు
మూత్రపిండాలు, కాలేయం, పేగుల సమస్యలున్నవారు
మద్యపానులు, ధూమపానులు
పోషక లోపాలు కలిగినవాళ్లు
పోషకాల శోషణ సమస్యలను పుట్టుకతో వెంట తెచ్చుకున్నవాళ్లు
20 ఏళ్ల నుంచి ఏడాదికోసారి డెక్సా స్కాన్ చేయించుకోవాలి
నియంత్రణ మన చేతుల్లోనే...
ఎముకలు గుల్లబారకుండా నియంత్రించే మార్గాలున్నాయి. అందుకోసం...
పోషకాల శోషణకు ఆటంకం ఏర్పడకుండా ఉండడం కోసం ఆహారం తిన్న వెంటనే టీ, కాఫీలు తాగకూడదు
శీతల పానీయాలు జీర్ఱరసాలను నిర్వీర్యం చేస్తాయి. తద్వారా పోషకాల శోషణ క్షీణిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి
మద్యపానం, ధూమపానం ఎముకలను బలహీనపరుస్తాయి. కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి
సూర్యరశ్మికి బహిర్గతమవుతూ ఉండాలి
మెనోపాజ్ ప్రారంభంలోనే హెచ్‌ఆర్‌టి చికిత్స తీసుకోవాలి
క్యాల్షియం సమృద్ధిగా దొరికే పాల ఉత్పత్తులు తీసుకోవాలి
క్రమం తప్పక వ్యాయామం చేయాలి
యువతలో ఎముకలు గుల్ల
అస్తవ్యస్థ జీవనశైలి, ఆహారపుటలవాట్లు శరీరంలో హార్మోన్ల స్రావాలను హెచ్చుతగ్గులకు లోను చేసి ఎముకలను బలహీనపరుస్తున్నాయి. జీవ గడియారానికి తగ్గట్టు మన దైనందిన జీవితం సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగియాలి. కానీ నేడు మరీముఖ్యంగా రాత్రి ఉద్యోగాలు చేసే వాళ్ల భోజన వేళలు గతి తప్పుతున్నాయి. రాత్రివేళ ఆలస్యంగా భోజనం ముగించడం, సమతులాహారానికి బదులుగా ఎక్కువ కొవ్వులు కలిగిన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల ఎముకల బలహీనత మొదలవుతుంది. అలాగే మద్యపానం, ఽధూమపానాలు కూడా ఈ జీవనశైలికి తోడైనప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాగే నేడు జంక్ ఫుడ్స్ వల్ల, భోజన వేళలు మారిపోవడం వల్ల అసిడిటీ సమస్య పెరుగుతోంది. దాంతో తోచిన యాంటాసిడ్స్ వాడుకోవడం పరిపాటిగా మారింది. వీటితో ఆమ్ల ఉత్పత్తి తగ్గి, పోషకాల శోషణ క్షీణించి ఎముకలు గుల్లబారే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఎంతో అరుదుగా తప్ప వీటిని వాడుకోకూడదు.
మహిళల ఎముకలు గుల్లబారకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ నుంచే జాగ్రత్తపడాలి. గర్భిణిగా ఉన్న సమయంలో వైద్యులు సూచించే సప్లిమెంట్లను వాడుకోవాలి. ప్రసవం తర్వాత బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి శరీరంలోని క్యాల్షియం పాల ద్వారా బిడ్డకు అందుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తల్లి ఎముకలు బలహీనపడిపోయి ఆస్టియొపీనియా, ఆస్టియొపొరొసి్‌సకు గురవకుండా ఉండాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి వైద్యులు సూచించే సప్లిమెంట్లు వాడుకోవాలి. కొందరు మహిళలు సిజేరియన్ సర్జరీ తర్వాత, నడుము నొప్పి వేధించడం సహజమని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి గర్భిణిగా ఉన్నప్పుడు క్యాల్షియం సప్లిమెంట్లు వాడుకోకపోవడం వల్ల, బిడ్డకు పాలివ్వడం ద్వారా శరీరంలోని క్యాల్షియంను కోల్పోవడం వల్ల ఎముకలు గుల్లబారి నడుము నొప్పి వేధిస్తుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో కూడా 3 నుంచి ఆరు నెలల పాటు క్యాల్షియం సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ప్రసవం తర్వాత లేదా సిజేరియన్ తర్వాత ఎక్కువ కాలం విశ్రాంతిలో గడపడం కూడా సరి కాదు. ప్రసవం నుంచి కోలుకున్న వెంటనే కటి, వెన్ను ఎముకలను బలపరిచే వ్యాయామాలు మొదలుపెట్టాలి.
డాక్టర్ జి.వి.ఎస్. రవి బాబు
సీనియర్ కన్సల్టెంట్ ట్రామా జాయింట్ రీకన్‌స్ట్రక్టివ్ అండ్ జాయింట్
రీప్లే్‌సమెంట్ సర్జన్,
కామినేని హాస్పిటల్స్, కర్నూలు.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా