Share News

అందానికి కొత్త నిర్వచనం

ABN , Publish Date - Aug 12 , 2026 | 03:04 AM

మొక్కు కోసమో, అందాన్ని మరింత తీర్చిదిద్దుకోవడం కోసమో ఇష్టపడి పెంచుకున్న పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం అసాధారణమేం కాదు. కానీ గ్లామర్‌ ప్రపంచంలో భాగమైన ఒక మోడల్‌...

అందానికి కొత్త నిర్వచనం

మొక్కు కోసమో, అందాన్ని మరింత తీర్చిదిద్దుకోవడం కోసమో ఇష్టపడి పెంచుకున్న పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం అసాధారణమేం కాదు. కానీ గ్లామర్‌ ప్రపంచంలో భాగమైన ఒక మోడల్‌, నటి కేశాల్ని వదులుకోవడం చాలా అరుదు. క్యాన్సర్‌ రోగుల కోసం ఒడియా నటి స్వప్నా పతి ఆ సాహసం చేశారు. ‘‘నా చర్య ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. కానీ అంతకుమించి అభినందనలూ అందుకుంటున్నాను’’ అంటున్నారు స్వప్న.

తీరిక సమయాల్లో 26 ఏళ్ళ స్వప్నా పతి ఎక్కడుంటారో ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు బాగా తెలుసు. ఇంట్లో లేకపోతే... భువనేశ్వర్‌ శివార్లలోని ఒక అనాథాశ్రమంలో పిల్లలతో ముచ్చట్లాడుతూ ఉంటారు. లేదా నగరానికి మరోవైపున ఉన్న వృద్ధాశ్రమంలో సీనియర్‌ సిటిజన్లను కలిసి వారి ఇబ్బందులు వింటారు. తనకు వీలైనంత సాయం చేస్తారు. తమ కాలనీలో ఉన్న వారితో స్థానిక సమస్యల గురించి చర్చిస్తారు. తను స్వయంగా నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వాలంటీర్లతో ప్రణాళికలు వేస్తారు. కానీ క్యాన్సర్‌ రోగుల కోసం పొడవాటి తన జుట్టును వదులుకోగలదని ఎవరూ ఉహించలేదంటారు స్వప్న.

అనాథల కోసం ...

ఒడిశాలోని చిన్న పట్టణం నుంచి మొదలైన స్వప్న ప్రయాణం... బీటెక్‌, సామాజిక సేవ, మోడలింగ్‌, సినీరంగం... ఇలా అనేక దారుల్లో సాగింది. బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు ‘ఆశ్రయ’ అనే అనాథ శరణాలయాన్ని ఆమె మొదటిసారి సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లల పరిస్థితులు ఆమెను కదిలించాయి. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి విరాళాలు సేకరించి... ఆశ్రయలోని పిల్లలకు అవసరమైనవి సమకూర్చేవారు. కానీ ‘‘పదేపదే అడిగితే ఎవరిస్తారు? అందుకే మోడలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు స్వప్న. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో సినీ అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. నటనలో బిజీగా ఉంటున్నా సమాజం పట్ల తన బాధ్యతను ఆమె ఎన్నడూ మరచిపోలేదు. స్వయంగా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం భువనేశ్వర్‌లో కొన్నేళ్ళ క్రితం మొదటిసారిగా ‘హెర్బల్‌ హోలీ’ని ప్రారంభించారు. హోలీ సందర్భంగా కూరగాయలతో, పండ్లతో తయారు చేసిన రంగులనే వినియోగించాలని, పర్యావరణానికి హాని చేసే రసాయనాలను పూర్తిగా నిషేధించాలని ప్రచారం చేశారు. ‘‘క్యాన్సర్‌ రోగుల కోసం జుట్టును ఇవ్వడం మాత్రం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం’’ అంటున్నారామె. ‘‘తమకు క్యాన్సర్‌ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే రోగులు బాగా కుంగిపోతారు. దానికి తోడు... చికిత్స సమయంలో జుట్టు ఊడిపోవడం వారి ఆత్మస్థైర్యాన్ని ఇంకా దెబ్బ తీస్తుంది. అందవికారంగా కనిపిస్తున్నామనే భావనతో భావోద్వేగానికి గురవుతారు. ఆ ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతుంది. వారు తమను తాము పునర్నిర్వచించుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సాయపడాలనుకున్నాను‘’ అని చెప్పారు.


ఎవరికీ చెప్పలేదు...

ఇటీవల క్యాన్సర్‌పై జరిగిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు... రోగుల కోసం విగ్గుల తయారీకి కేశాలను విరాళంగా ఇవ్వడం గురించి స్వప్నకు తెలిసింది. వారి పట్ల తన సహానుభూతిని జుట్టు ఇవ్వడం ద్వారా ప్రకటించాలనుకున్నారు. అయితే... సినిమా, మోడలింగ్‌ అనేవి గ్లామర్‌కు ప్రాధాన్యాన్నిచ్చే రంగాలు. వాటిలో కొనసాగుతున్న ఆమె ఇలా చేయడం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. ‘‘ముందుగా ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. నాలుగు రోజుల కిందట నా జట్టును విరాళంగా ఇచ్చాను. వారిని అందంగా చూసేందుకు నేను అందంగా భావించే జుట్టు వదులుకోవడం... నా దృష్టిలో అందానికి, గ్లామర్‌కు నిజమైన నిర్వచనం. ఇది మరింతమందికి స్ఫూర్తిగా ఉంటుందనే ఆలోచనతో... ఆ ఫొటోలను సామాజిక మాఽధ్యమాల్లో పోస్ట్‌ చేశాను. చాలా పొడుగ్గా ఉండే నా జుట్టును కత్తిరించుకోవడం చూసి నా స్నేహితులందరూ ఆశ్చర్యపోయారు. మా ఇంట్లో వాళ్ళయితే చాలా బాధపడ్డారు. కానీ దానికి కారణం తెలిసిన తరువాత... వాళ్ళు గర్వంగా ఫీలవుతున్నారు’’ అని చెబుతున్నారు స్వప్న. ‘‘మూడు రోజుల నుంచి నన్ను మెచ్చుకుంటూ అనేకమంది ఫోన్‌ చేస్తున్నారు, మెసేజ్‌లు పంపుతున్నారు. కానీ సమాజానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు గుర్తింపును నేను కోరుకోను. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు అది హృదయం నుంచి రావాలి. దానికి ఎలాంటి ప్రణాళికా అవసరం లేదు. నా జుట్టుతో చేసిన విగ్గును ధరించిన ఒక క్యాన్సర్‌ రోగి మరింత ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం కన్నా నాకు సంతోషం కలిగించే విషయం మరేముంటుంది? ఇది పెద్ద సాయంగా నేను అనుకోవడం లేదు. కానీ చిన్న నీటి బిందువులే సముద్రంగా రూపుదిద్దుకుంటాయి. సమాజంలో మనం చేసే చిన్న చిన్న సాయాలు ఈ ప్రపంచాన్ని మరింత నివాసయోగ్యంగా మారుస్తాయి’’ అంటున్నారు స్వప్న.

ఇవి కూడా చదవండి..

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..

అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..

Updated Date - Aug 12 , 2026 | 03:04 AM