Share News

ల్యాబ్‌ వదిలి లక్ష్యాన్ని సాధించి!

ABN , Publish Date - Aug 17 , 2026 | 03:17 AM

శాస్త్రవేత్తగా ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని.. మాతృత్వ బాధ్యతలను సంతోషంగా నెరవేరుస్తూనే.. చెరగని పట్టుదలతో యూపీఎస్సీని జయించిన ధీర ఆమె. ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

ల్యాబ్‌ వదిలి లక్ష్యాన్ని సాధించి!

స్ఫూర్తి

శాస్త్రవేత్తగా ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని.. మాతృత్వ బాధ్యతలను సంతోషంగా నెరవేరుస్తూనే.. చెరగని పట్టుదలతో యూపీఎస్సీని జయించిన ధీర ఆమె. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి తొలి మహిళా ప్రైవేట్‌ సెక్రటరీగా నియమితురాలై నూతన అధ్యాయాన్ని లిఖించారు ఐఎఫ్‌ఎస్‌ అధికారి నిధి తివారీ. ల్యాబ్‌ సైంటిస్ట్‌ నుంచి దేశ అత్యున్నత దౌత్యవేత్తగా సాగినఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమె మాటల్లోనే..

‘‘ఉత్తరప్రదేశ్‌, వారణాసిలోని మెహమర్‌గంజ్‌లో జన్మించిన నాకు చిన్నతనం నుంచే చదువంటే అపారమైన ప్రేమ. లక్నో యూనివర్సిటీలో బీఎస్సీ (బయోకెమిస్ట్రీ)లో గోల్డ్‌మెడల్‌ సాధించిన తర్వాత, ఉన్నత చదువుల కోసం ప్రతిష్ఠాత్మక ‘బనారస్‌ హిందూ యూనివర్సిటీ’ (బీహెచ్‌యూ)లో అడుగుపెట్టాను. 2005లో బీహెచ్‌యూ ఎంఎస్సీలో చేరి హాస్టల్‌లో ఉంటున్న రోజుల్లో... నా జీవితంలో ఒక మరువలేని అధ్యాయం మొదలైంది. ల్యాబ్‌లో ప్రయోగాలు చేసుకుంటున్న సమయంలో, 1999 నుంచే అక్కడ మెడిసిన్‌ (ఎంబీబీఎస్‌, ఎండీ) చదువుతున్న డాక్టర్‌ సుశీల్‌ జైస్వాల్‌ పరిచయమయ్యారు. ఆ ల్యాబ్‌ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే మా ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమగా మారింది. పెద్దల సమక్షంలో డిసెంబర్‌ 2006లో మా వివాహం జరిగింది.

బీహెచ్‌యూ టు ‘బార్క్‌’ సైంటిస్ట్‌

వివాహానంతరం కూడా నా చదువు ఆగలేదు. 2007లో బీహెచ్‌యూ నుంచి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి మరొక గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాను. అదే సంవత్సరం భారతదేశ అత్యున్నత అణుపరిశోధనా సంస్థ అయిన భాభా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాను. మహారాష్ట్రలో నిర్వహించిన సైంటిస్ట్‌ శిక్షణలో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మరో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకున్నాను. ల్యాబ్‌లో ప్రయోగాలు, చేతిలో గౌరవప్రదమైన ఉద్యోగం... ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి ఇంతకంటే ఇంకేం కావాలి? అందరూ నా కెరీర్‌ స్థిరపడిపోయిందని అనుకున్నారు. కానీ నా మనసు మాత్రం దేశ పాలనా వ్యవస్థలో (బ్యూరోక్రసీ) భాగమై ప్రజలకు సేవ చేయాలనే దిశగా నన్ను ప్రేరేపించింది.


మాతృత్వం, బాధ్యతలు... అసలైన అగ్నిపరీక్ష!

2008లో నాకు బాబు జన్మించాడు. ఒక వైపు పసిపాప, మరోవైపు గృహిణిగా కొత్త సంసార బాధ్యతలు... కానీ నా ఐఎఫ్‌ఎస్‌ కలను చంపుకోలేదు. అదే సంవత్సరం ధైర్యం చేసి బార్క్‌ సైంటిస్ట్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మొదట ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీపీఎస్సీ) పరీక్ష రాసి, తొలి ప్రయత్నంలోనే అసిస్టెంట్‌ కమిషనర్‌ (కమర్షియల్‌ ట్యాక్స్‌) గా ఎంపికయ్యాను. సుమారు రెండేళ్లపాటు ఆ ఉద్యోగం చేస్తూనే మరోవైపు యూపీఎస్సీకి సిద్ధమయ్యాను. ఇంట్లో ఉంటూ యూపీఎస్సీ ప్రిపరేషన్‌ను సమర్థవంతంగా చేయడం కుదరకపోవడంతో బాబును, సంసారాన్ని వారణాసిలోనే వదిలి ఢిల్లీకి షిఫ్ట్‌ అయ్యాను. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించి ఐఆర్‌పీఎస్‌ సాధించినా నా కల ఐఎఫ్‌ఎస్‌ లేదా ఐఏఎస్‌ కావడంతో ఆ ఉద్యోగంలో చేరలేదు. పట్టువదలకుండా 2013లో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షరాసి జనరల్‌ కేటగిరీలో ఆల్‌ ఇండియా 96వ ర్యాంకు సాధించాను. నా డ్రీమ్‌ సర్వీస్‌ అయిన ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)ని ఎంచుకున్నాను. ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) శిక్షణలోనూ టాపర్‌గా నిలిచి ‘అంబాసిడర్‌ విమల్‌ సన్యాల్‌ స్మారక పతకం’ అందుకున్నాను.

విదేశాంగ శాఖ నుంచి వియన్నా దౌత్యవేత్తగా!

2017లో ఢిల్లీలోని కేంద్ర విదేశాంగ శాఖలో డెస్క్‌ పోస్టింగ్‌ పొందాను. ఆ తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని భారత దౌత్య కార్యాలయంలో 2019 వరకు పనిచేశాను. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌)లో భారతదేశ ప్రయోజనాలు, భద్రతా వ్యవహారాలపై పలు దేశాలతో సమన్వయం చేసుకుంటూ దౌత్య సేవలను అందించాను. ఆ తర్వాత విదేశాంగ శాఖలోని డిసార్మమెంట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ అఫైర్స్‌ విభాగంలో అండర్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించాను. ఆ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ బృందంలో పనిచేసే అరుదైన అవకాశం దక్కింది.

ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థానం!

నవంబర్‌ 2022లో ప్రధానమంత్రి కార్యాలయంలో (పీఎంవో) అండర్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాను. కొద్దికాలంలోనే డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందాను. పీఎంవోలో ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ పర్యవేక్షణలో ‘ఫారిన్‌ అండ్‌ సెక్యూరిటీ’ విభాగంలో పనిచేస్తూ విదేశీ వ్యవహారాలు, అణుశక్తి, జాతీయ భద్రత, రాజస్థాన్‌ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించాను. దౌత్యం, దేశ భద్రతా విషయాల్లో నా నైపుణ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, నన్ను ప్రధాని నరేంద్ర మోదీకి ‘ప్రైవేట్‌ సెక్రటరీ’గా నియమించింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ 12 ఏళ్ల కాలంలో ఒక మహిళ ఈ పదవికి ఎంపికవడం ఇదే తొలిసారి.

ల్యాబ్‌లో పరిశోధకురాలిగా, ఒక భార్యగా, బాబుకి తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తూనే... దేశంలోనే అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి నిరంతర శ్రమ, అచంచలమైన పట్టుదల, కుటుంబ ప్రోత్సాహమే కారణం. లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే ప్రతికూల పరిస్థితులను దాటుకుని ఏ స్త్రీ అయినా విజయశిఖరాలను అధిరోహించగలదు’’


7-Navya.jpg

ఓటమన్నదే లేదు

నిధి చదువులో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. ప్రీ స్కూల్‌ నుంచి బార్క్‌ సైంటిస్ట్‌ వరకు, అక్కడి నుంచి ఐఎఫ్‌ఎస్‌ వరకు ప్రతీ దశలోనూ గోల్డ్‌ మెడల్స్‌ తెస్తూనే ఉంది. జీవితంలో ఆమె రాసిన ఏ పరీక్షలోనూ ఇప్పటి వరకు ఓడిపోలేదు.

- ప్రభా తివారీ (నిధి తల్లి)

నిధి విజయాలు అద్భుతం

‘‘తనను ఎంపిక చేసిన అధికారులు, సెలక్షన్‌ ప్యానల్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నిధి ఏకైక లక్ష్యం. బీహెచ్‌యూ ల్యాబ్‌ నుంచి ప్రధాని కార్యాలయం వరకు ఆమె పడిన కష్టం, సాధించిన విజయాలు నిజంగా అద్భుతం’’.

డాక్టర్‌ సుశీల్‌ జైస్వాల్‌ (నిధి భర్త)

వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Updated Date - Aug 17 , 2026 | 03:17 AM