పిల్లల్లో నాటుకునే నాడీ సమస్యలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:47 AM
పిల్లల్లో ప్రధానంగా మూర్ఛ, ఆటిజం, బ్రెయిన్ స్ట్రోక్ మొదలైన నాడీ సమస్యలుంటాయి. ఈ సమస్యలు జన్యుపరంగా సంక్రమించవచ్చు. పోషక లోపాలు, ప్రమాదాలు ఈ సమస్యలకు...
ఛైల్డ్ కేర్
పిల్లలు నాడీ సమస్యలను పుట్టుకతోనే వెంటతెచ్చుకోవచ్చు. ఆ సమస్యలు పలు రూపాల్లోనూ ఉండవచ్చు. అయితే సమస్య ఏదైనా దాన్ని సకాలంలో గుర్తించి, సమర్థమైన చికిత్సను అందించగలిగితే, ఈ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎదగగలుగుతారు అంటున్నారు వైద్యులు.
పిల్లల్లో ప్రధానంగా మూర్ఛ, ఆటిజం, బ్రెయిన్ స్ట్రోక్ మొదలైన నాడీ సమస్యలుంటాయి. ఈ సమస్యలు జన్యుపరంగా సంక్రమించవచ్చు. పోషక లోపాలు, ప్రమాదాలు ఈ సమస్యలకు దారి తీయవచ్చు. కొన్ని సమస్యల తీవ్రత తక్కువగా ఉండొచ్చు ఇంకొన్ని పిల్లల ఎదుగుదలను దెబ్బతీస్తుంది. కాబట్టి పిల్లల్లో చోటుచేసుకునే నాడీ సమస్యల గురించి అవగాహన ఏర్పరచుకోవడం అత్యవసరం.
మూర్ఛల్లో రకాలున్నాయి
పుట్టిన రోజు మొదలు పిల్లల్లో మూర్ఛలు కనిపించవచ్చు. మెదడులో అవసరం లేని ఎలక్ర్టికల్ యాక్టివిటీ చోటు చేసుకున్నప్పుడు మూర్ఛలు మొదలవుతాయి.
నెల లోపు పిల్లల్లో: అప్పుడే పుట్టిన పసికందుల్లో కూడా మూర్ఛలు రావచ్చు. వీటి తీవ్రత క్రమేపీ పెరగవచ్చు. మెదడుకు అందే ఆక్సిజన్‌లో కొరత ఏర్పడడం, చక్కెరల మోతాదు తగ్గడం, క్యాల్షియం, మెగ్నీషియం తగ్గడం వల్ల పసికందుల్లో మూర్ఛలు కనిపిస్తాయి. అలాగే మెదడులో రక్తస్రావం వల్ల కూడా మూర్ఛలు కనిపించవచ్చు.
4 నుంచి 8 నెలలు: ఈ వయసు పిల్లల్లో ఎపిలెప్టిక్ స్పాసమ్స్ సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. నిద్ర నుంచి లేచినప్పుడు అకస్మాత్తుగా ఉలిక్కిపడడం ఈ సమస్య ప్రధాన లక్షణం. ఈ సమస్య రెండు నుంచి మూడేళ్ల వయసొచ్చేవరకూ కొనసాగుతుంది. కొందరు పిల్లల్లో జీవితాంతం కొనసాగుతుంది
నెల నుంచి ఏడాది: మెదడు నిర్మాణంలో లోపాలున్నప్పుడు, జన్యు సమస్యలున్నప్పుడు, పోషకాల లోపం ఉన్నప్పుడు ఈ వయసు పిల్లల్లో మూర్ఛలు కనిపించవచ్చు.
ఒకటి నుంచి ఐదేళ్ల లోపు: ఈ వయసు పిల్లలను బినైన్ ఆక్సిపిటల్ ఎపిలెప్సీ వేధించవచ్చు. నిద్ర నుంచి లేవగానే వాంతి చేసుకుంటారు.
4 నుంచి 8 ఏళ్లు: ఈ వయసు పిల్లల్లో బినైన్ సెంట్రో టెంపొరల్ ఎపిలెప్సీ కనిపించవచ్చు. నిద్రలో ఒక నిమిషం పాటు మూర్ఛలు వేధిస్తాయి. పిల్లలకు 10 నుంచి 12 ఏళ్ల వయసొచ్చేటప్పటికి ఈ మూర్ఛలు వాటంతట అవే తగ్గిపోతాయి
మూర్ఛల చికిత్సలు ఇలా...
పసికందుల్లో పోషక లోపాలను భర్తీ చేయడం ద్వారా మూర్ఛలను అదుపు చేయవచ్చు. పెద్ద పిల్లల్లో తలెత్తే బినైన్ ఆక్సిపిటల్ ఎపిలెప్సీని మందులతో అదుపు చేసుకోవచ్చు. బినైన్ సెంట్రో టెంపొరల్ ఎపిలెప్సీలో ఆరు నెలలకోసారి ఏడాదికోసారి మూర్ఛలు వేధిస్తే, ఇఇజి పరీక్ష ఫలితం ఆధారంగా, మందులతో అదుపు చేసుకోవచ్చు. ఏడు నుంచి పదేళ్ల మధ్య పిల్లలకు ఆక్సిపిటల్ ఎపిలెప్సీలో కళ్లు మసకబారడం, తలనొప్పి లాంటి లక్షణాలతో పాటు స్పృహ కూడా కోల్పోతూ ఉంటే, మందులతో చికిత్స చేయవచ్చు. మూర్ఛలు లేకపోయినప్పటికీ మాట్లాడుతూ అకస్మాత్తుగా కొన్ని క్షణాల పాటు ఆగిపోయి మళ్లీ మాట్లాడడం లాంటి లక్షణాలతో కూడిన ఆబ్సెన్స్ ఎపిలెప్సీలో ఇఇజి ఫలితం ఆధారంగా రెండు రకాల మందులతో చికిత్సను అందించవచ్చు. పసికందుల్లో మూర్ఛలు మందులతో సమర్థంగా అదుపులోకొస్తాయి. ఎక్కువ సందర్భాల్లో మళ్లీ తిరగబెట్టకుండా ఉంటాయి. పిల్లల్లో తలెత్తే మూర్ఛలు అంతకంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలుంటాయి. వేరే రకాల మూర్ఛలకు దారి తీసే ముప్పు కూడా ఉంటుంది. అయితే మందులు సక్రమంగా వాడుకుంటూ, వైద్యుల సూచనలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మందులు ఆపిన తర్వాత కొన్ని మూర్ఛలు తిరగబెట్టే అవకాశాలు పది శాతం మేరకు ఉంటే, ఇంకొన్ని మూర్ఛలు తిరగబెట్టే అవకాశాలు 20 శాతం మేరకు ఉంటాయి. మెదడు నిర్మాణాల్లో లోపాలతో తలెత్తే మూర్ఛలను మందులతో నియంత్రించలేకపోవచ్చు. అలాంటప్పుడు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన కీటోజెనిక్ డైట్‌తో మూర్ఛల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మందులతో మూర్ఛలు అదుపులోకి రానప్పుడు మాత్రమే అంతిమ ప్రయత్నంలో భాగంగా వైద్యులు సర్జరీలను ఎంచుకుంటారు.
ఆటిజం అదుపు
ఇది నాడీ అభివృద్ధి రుగ్మత. ఈ సమస్య ఎమ్మారై స్కాన్, రక్తపరీక్షల్లో బయల్పడదు. పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వయసొచ్చేలోపు పిల్లల మెదడులో 3 లక్షల కోట్ల నాడీ కనెక్షన్లు ఏర్పడతాయి. పిల్లలను ప్రేరేపించేకొద్దీ ఈ కొత్త కనెక్షన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇళ్లలో పిల్లల బాగోగులు చూసే వాళ్లు ఎక్కువ మంది ఉంటే ఈ కనెక్షన్లు ఎక్కువగా ఏర్పడతాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులై ఉండి పిల్లలకు తగినంత సమయం కేటాయించలేప్పుడు పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. అలాగే మూడేళ్ల లోపు పిల్లలకు సెల్‌ఫోన్ లాంటి గ్యాడ్జెట్లను అలవాటు చేయడం వల్ల కూడా ఇవే ఎదుగుదల లోపాలు పెరుగుతాయి. బదులుగా పిల్లలకు మూడేళ్ల వరకూ గ్యాడ్జెట్స్‌ను దూరం చేసి, వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ, ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన మాటలు పిల్లలకు అర్థం కావలసిన అవసరం లేదు. అయినా వీలైనంత ఎక్కువగా, మాటలు, పనుల ద్వారా పిల్లలను ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులైన దంపతులు పిల్లలను ప్లే స్కూల్లో చేర్చించడం మంచిది. బదులుగా పిల్లలకు గ్యాడ్జెట్స్ ఇచ్చినప్పుడు, వాళ్లకు కావలసిన కాలక్షేపం అడగకుండానే చేతికి అందుతోంది కాబట్టి మన మాటలకు, చేతలకూ స్పందించడం మానేస్తారు. గ్యాడ్జెట్స్ వల్ల పిల్లల్లో భాషాపరమైన సమస్యలు, సామాజిక సానుభూతి, ఆత్మీయులతో అనుబంధాల సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో మాటలు ఆలస్యమవుతాయి. తల్లి ఎన్నిసార్లు పిలిచినా పలకరు, స్పందించరు. అకస్మాత్తుగా గట్టిగా అరవడం, ఆడుకుంటున్న తోటి పిల్లలను చూస్తూ ఆ ఆటలో పాల్గొనే ప్రయత్నం చేయరు. ఆగకుండా పరిగెత్తడం, కుదురుగా కూర్చోలేకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆటిజం చికిత్స సంక్లిష్టమైనది. ఆటిజంను పూర్తిగా నయం చేసే చికిత్సలు లేకపోయినప్పటికీ, పిల్లలు సాధ్యమైనంత స్వతంత్రంగా జీవించడమే లక్ష్యంగా చికిత్స సాగుతుంది.

పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్
పుట్టిన పసికందు మొదలు పెద్ద పిల్లల వరకూ ఎవర్లోనైనా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. చికెన్‌పాక్స్, హెర్సిస్, మైకోప్లాస్మా లాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల ప్రభావం ఫలితంగా పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. అలాగే మోయా మోయా సిండ్రోమ్ అనే జన్యుపరమైన సమస్యల్లో మెదడులోని రక్తనాళాలు సన్నబడిపోవడం ద్వారా రక్తప్రవాహంలో అవరోధం ఏర్పడి ఈ ముప్పు పెరగవచ్చు. అలాగే సికెల్ సెల్ అనీమియాలో కూడా రక్తనాళాలు దెబ్బతిని మెదడు స్ట్రోక్ తలెత్తవచ్చు. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే పోషక లోపాల మూలంగా మెదడులోని కొన్ని రక్తనాళాలు గట్టిపడిపోవచ్చు. 6 నుంచి రెండున్నరేళ్ల పిల్లల్లో కూడా పోషకలోపాలు, ఇన్‌ఫెక్షన్లు ఇదే పరిస్థితికి దారితీయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో తలకు తగిలే చిన్న దెబ్బలకు ఆ రక్తనాణాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగి, మెదడు స్ట్రోక్‌కు గురికావచ్చు. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు పిల్లలు, శరీరంలో ఒక వైపు కాలు, చేతిని లేపలేకపోతూ ఉంటారు. దెబ్బ తగిలిన తర్వాత పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపించినా, మూర్ఛలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. 6 నుంచి 24 గంటల్లో మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిచి, రక్తపు గడ్డను తొలగించగలిగితే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా పిల్లలను వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. చికిత్స తర్వాత సాధారణంగా సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. మోయా మోయా సిండ్రోమ్‌లో సమస్య తిరగబెట్టినా, రీవ్యాస్క్యులరైజేషన్ సర్జరీతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ లోకేష్ లింగప్ప, క్లినికల్ డైరెక్టర్,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ,
హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News