Share News

స్వీడన్‌ పార్లమెంట్‌లో భారత నారి

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:53 AM

మహారాష్ట్ర సహకార విప్లవ పితామహుల వారసత్వాన్ని గుండెల్లో పదిలపరుచుకుంటూ.. ఐరోపా గడ్డపై స్వయంకృషితో ఎదిగిన ప్రవాస భారతీయురాలు...

స్వీడన్‌ పార్లమెంట్‌లో భారత నారి

మహారాష్ట్ర సహకార విప్లవ పితామహుల వారసత్వాన్ని గుండెల్లో పదిలపరుచుకుంటూ.. ఐరోపా గడ్డపై స్వయంకృషితో ఎదిగిన ప్రవాస భారతీయురాలు నీలా విఖే పాటిల్‌. స్వీడన్‌ జాతీయ ఎన్నికల్లో సత్తా చాటి, ‘రిక్స్‌డాగ్‌’ చట్టసభలో అడుగుపెట్టిన ఆమె విజయం ప్రవాస భారతీయ చరిత్రలో ఒక నవ శకానికి నాంది.

ప్రపంచ రాజకీయ యవనికపై భారత సంతతికి చెందిన ప్రముఖులు మరోసారి తమ సత్తా చాటారు. స్వీడన్‌లో తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రవాస భారతీయురాలు నీలా విఖే పాటిల్‌ అరుదైన విజయాన్ని నమోదు చేశారు. సెప్టెంబర్‌ 13న జరిగిన ఈ ఎన్నికల్లో స్టాక్‌హోమ్‌ సిటీ నియోజకవర్గం నుంచి గ్రీన్‌పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె.. పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మొత్తం 349 స్థానాలున్న స్వీడన్‌ పార్లమెంట్‌ ‘రిక్స్‌డాగ్‌’ లో వామపక్ష కూటమి 176 సీట్లతో స్వల్ప మెజారిటీ సాధించగా, అందులో భాగస్వామి అయిన గ్రీన్‌పార్టీ విజయంలో నీలా పాత్ర కీలకమైంది. 41 ఏళ్ల వయసులో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆమె, తన గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ దేశాభివృద్ధికి, ఓటు హక్కు లేని వారి శ్రేయస్సుకు కట్టుబడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఇంతటి ఘనమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, నీలా ఐరోపాలో తన సొంత శ్రమతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

అహ్మద్‌నగర్‌ నుంచి నార్డిక్‌ తీరం వరకు

నీలా స్వీడన్‌లోని లిడ్‌కోపింగ్‌లో జన్మించినప్పటికీ, బాల్యంలోని తొలి సంవత్సరాలను మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో గడిపారు. అక్కడ గడిపిన రోజులు తన జీవితంపై, ఆలోచనా సరళిపై తీవ్ర ప్రభావం చూపాయని ఆమె చెబుతుంటారు. ‘భారతదేశంతో నాది విడదీయరాని బంధం. అక్కడి సంస్కృతి, నా చిన్ననాటి స్నేహితులు నాకు ఎంతో ప్రత్యేకం’ అని ఆమె అనేక సందర్భాల్లో తన అనుబంధాన్ని చాటుకున్నారు.

ఆర్థికవేత్తగా..

రాజకీయాలే కాకుండా, నీలా అత్యుత్తమ విద్యార్హతలు కలిగిన ఆర్థికవేత్త కూడా. స్వీడన్‌లోని ప్రసిద్ధ ‘గోథెన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ నుంచి ఎకనామిక్స్‌ అండ్‌ లా లో పట్టాతో పాటు ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం స్పానిష్‌ రాజధాని మాడ్రిడ్‌లోని ప్రఖ్యాత ‘కాంప్లూటెన్సే యూనివర్సిటీ’ నుంచి కూడా ఎంబీఏ పట్టా అందుకున్నారు.

చదువు పూర్తయ్యాక ప్రపంచ ప్రఖ్యాత ఆడిటింగ్‌, కన్సల్టింగ్‌ సంస్థ ‘పైరస్‌వాటర్‌హౌ్‌సకూపర్స్‌’లో వ్యూహాత్మక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 2025 ఏప్రిల్‌లో సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్‌గానూ అర్హత సాధించి, ఆర్థిక రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ప్రధాని సలహాదారు నుంచి పార్లమెంట్‌ వరకు

నీలా రాజకీయ ప్రస్థానం ఒక్కరోజులో సాధ్యమెంది కాదు. స్వీడన్‌ గ్రీన్‌పార్టీలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె వివిధ స్థాయిల్లో సేవలందించారు. గతంలో స్వీడన్‌ మాజీ ప్రధాని స్టీఫెన్‌ లోఫ్‌వెన్‌ హయాంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా పనిచేసి, ఆర్థిక, పన్నుల, గృహనిర్మాణ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత స్టాక్‌హోమ్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిగా స్థానిక పాలనలో ఆకట్టుకుని, ఇప్పుడు జాతీయ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.


తాత నేర్పిన ఆర్థిక పాఠాలు

తన విజయాల వెనుక తాత బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ స్ఫూర్తి ఎంతో ఉందని నీలా గుర్తుచేసుకుంటారు. ‘నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడే తాత నాతో బడ్జెట్‌ ప్రతిపాదనలు చదివించేవారు. ప్రజా జీవితంలో గౌరవంగా బతకడం, ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఆయన నుంచే నేర్చుకున్నాను. చివరి రోజుల్లోనూ నాతో మాట్లాడి ప్రోత్సహించేవారు’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

భవిష్యత్‌ లక్ష్యాలు

రిక్స్‌డాగ్‌లో అడుగుపెట్టిన నీలా తన ప్రాధాన్యతలను స్పష్టంగా ప్రకటించారు. సమాజంలో గళం లేని పిల్లల హక్కులు, శ్రేయస్సు కోసం గొంతుకగా మారడం.. గ్రీన్‌ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాతావరణ మార్పులను అరికట్టేందుకు హరిత విధానాలను ప్రోత్సహించడం.. వంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. తన కుమార్తె సాధించిన ఈ అరుదైన విజయం పట్ల తండ్రి అశోక్‌ విఖే పాటిల్‌ ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తమ కుటుంబానికే కాక భారతీయులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. భారతీయ మూలాలను కాపాడుకుంటూ అంతర్జాతీయ రాజకీయంలో మెరిసిన నీలా విఖే పాటిల్‌ ప్రయాణం భవిష్యత్‌ తరాలకు గొప్ప స్ఫూర్తిదాయకం.

ఘనమైన రాజకీయ వారసత్వం

నీలా విఖే పాటిల్‌ వెనుక దశాబ్దాల సామాజిక, రాజకీయ చరిత్ర ఉంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ కేంద్రంగా సేవలందిస్తున్న ప్రతిష్ఠాత్మక విఖే పాటిల్‌ కుటుంబానికి చెందిన ఆమె, అక్కడ అపారమైన ప్రజాదరణ పొందిన నాయకుల వారసురాలు. ముత్తాత విఠల్‌రావ్‌ విఖే పాటిల్‌ ఆసియాలోనే మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారాన్ని స్థాపించి, భారతదేశంలో సహకార విప్లవానికి నాంది పలికిన అమరజీవి. తాత బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ కేంద్ర మాజీ మంత్రిగా, సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తండ్రి అశోక్‌ విఖే పాటిల్‌ ప్రముఖ విద్యావేత్త. విఖే పాటిల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా విద్యా రంగానికి విశేష సేవలందిస్తున్నారు. బాబాయి రాధాకృష్ణ విఖే పాటిల్‌ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

Updated Date - Sep 21 , 2026 | 05:53 AM