శ్రీదేవీ రమణీయం
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:22 AM
‘స్నేహం’ అనగానే ప్రేక్షకులకు, సాహిత్యాభిమానులకు బాపు-రమణ ఎలా గుర్తుకొస్తారో, దాంపత్యం అంటే వారి సన్నిహితులకు రమణ-శ్రీదేవి గుర్తుకొస్తారు. శ్రీదేవి... శ్రీమతి ముళ్లపూడి వెంకటరమణ....
జ్ఞాపకం :
ముళ్లపూడి శ్రీదేవి
‘స్నేహం’ అనగానే ప్రేక్షకులకు, సాహిత్యాభిమానులకు బాపు-రమణ ఎలా గుర్తుకొస్తారో, దాంపత్యం అంటే వారి సన్నిహితులకు రమణ-శ్రీదేవి గుర్తుకొస్తారు. శ్రీదేవి... శ్రీమతి ముళ్లపూడి వెంకటరమణ. ఆయన రచనలకు తొలి పాఠకురాలు. వాటిని తన దస్తూరితో తిరగరాసిన అభిమాని. అంతేకాదు బాపు-రమణల గురించి ‘నెమరేసిన మెమొరీ్‌స’లో ఆమె వెల్లడించిన విశేషాలతోనూ స్వయంగా రాసిన ‘రమణీయ శ్రీరామాయణం’, ‘రమణీయ శ్రీభాగవతం’లో ప్రదర్శించిన శైలీ విన్యాసంతోనూ రచయిత్రిగానూ ‘రమణగారి అర్థాంగి’ అనిపించారు. ముళ్లపూడివారి 95వ జయంతి సందర్భంగా ఆమె ‘నవ్య’తో పంచుకున్న జ్ఞాపకాలివి.
‘‘మా అన్నయ్య నండూరి రామ్మోహనరావు మద్రాసులో ఆంధ్రపత్రికలో పనిచేస్తూ ఉండేవాడు. ఇంటికి వచ్చినప్పుడు పత్రిక గురించి, రచయితల గురించి కబుర్లు చెబుతూ ఉండేవాడు. ముళ్లపూడి వెంకట రమణ గారివి, ఇతర రచయితలవి పుస్తకాలు పట్టుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు- మా అన్నయ్యల పెళ్లిళ్లు పది రోజుల తేడాలో జరిగాయి. ఆ పెళ్లికి వచ్చిన మా చుట్టం ఒకావిడ- ‘‘ఆంధ్ర పత్రికలో బుడుగు కార్టూన్లు వస్తున్నాయి. చదువుతున్నావా? పేర్లు వేయటం లేదు కానీ రాస్తున్నది మాత్రం ముళ్లపూడి వెంకట రమణే!’’ అంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రచయిత పేరు లేకపోయినా- రాసే తీరును బట్టి ఎవరు రాశారో చెప్పేస్తున్నారంటే- పాఠకుల్లో రమణగారికి ఎంత ఆదరణ ఉందో అర్థమయింది. ఆ తరువాత ఆయన రాసిన కథలన్నీ చదివేదాన్ని. నేను చదవటమే కాదు, మా అమ్మని, బామ్మని, పక్కింటావిడని కూర్చోబెట్టి చదివి వినిపించేదాన్ని. వాళ్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాళ్లు.
దస్తూరి బావుండకే...
రమణగారితో పెళ్లి అయిన తర్వాత మద్రాసు వెళ్లిపోయాను. రమణగారి దస్తూరి అంత బావుండదు. ఒకసారి చదివి అర్ధం చేసుకోవటం కష్టం. ఒకసారి ఆయనో సీన్ రాసి చదివి ఎలా ఉందో చెప్పమన్నారు. ‘‘మీ రైటింగ్ అర్థం కావట్లేదు’’ అన్నాను. ‘‘దాన్ని అర్థం చేసుకుని ఫెయిర్ కాపీ చేసి పెట్టు. రేపు ప్రొడ్యూసర్‌కో, పబ్లిషర్‌కో చూపిస్తే వారికి అర్థం కావాలి కదా’’ అన్నారు. నా ఫెయిర్ కాపీల ప్రస్థానం అలా మొదలయింది. నేను ఫెయిర్ చేయకముందు- బాపుగారు లాంటి మిత్రులు ఫెయిర్ కాపీ చేసేవారు. ఆ తర్వాత మొత్తం బాధ్యతంతా నాదే! రమణగారు రాసింది రాసినట్లు ఫెయిర్ చేసేదాన్ని. పదాలేవైనా అర్ధం కాకపోతే వివరంగా అడిగి తెలుసుకొనేదాన్ని. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. రమణగారు తాను రాసిన వాటిని- కథలైనా, స్ర్కిప్ట్‌లైనా, పాటలైనా ముందు బాపుగారికి చూపించేవారు. ఆయన ‘ఓకే’ అన్న తర్వాతే నా దగ్గరకు వచ్చేవి. అదే విధంగా బాపు గారు ఏదైనా బొమ్మ వేస్తే రమణ గారికే చూపించేవారు. ఆయన ‘ఓకే’ అన్న తర్వాత ఫైనల్ అయ్యేవి. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంత గట్టిది.. గొప్పది! ఇద్దరూ ఒకరికొకరు అన్నట్లు పనిచేసేవారు.. జీవించేవారు. అలాంటి స్నేహితులు చాలా అరుదుగా ఉంటారు.
వంటబట్టలేదు...
నాకు రమణ రచనలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ తర్వాత ఆయన రాసిన ప్రతి వాక్యాన్ని ఫెయిర్ చేశా! అయితే నాకు ఈ చదవటం, ఫెయిర్ చేయటం ద్వారా ఎటువంటి అక్షర జ్ఞానం వంటబట్టలేదు. ఆయన రచనలను బేరీజు వేసేటంత జ్ఞానం కూడా నాకు లేదు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఏదైనా రాస్తానని కూడా అనుకోలేదు. కానీ నేను పుస్తకాలు రాయటమనేది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. తనతో నేను రోజూ మాట్లాడుతూ ఉంటాను. మాటల సందర్భంలో చిన్ననాటి సంగతులు, ఊరి విశేషాలు, మా అన్నయ్యలు, అక్కల గురించి ఏవేవో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినవన్నీ చెబుతుంటాను. ఒక రోజు మా అమ్మాయి- ‘‘అమ్మా నీకిన్ని సంగతులు గుర్తున్నాయి కదా! ఈ కబుర్లన్నింటినీ ఓ పుస్తకంగా రాయొచ్చు కదా’’ అంది. రాయటం నాకు కొత్త కాదు కదా! గుర్తుకొచ్చినవన్నీ రాయటం మొదలుపెట్టా! అలా పుట్టినవే నా పుస్తకాలు. వీటిలో నా జ్ఞాపకాల పుస్తకానికి మా అబ్బాయి వర- ‘నెమరేసిన మెమొరీస్’ అని పేరు పెట్టాడు. ఆ పుస్తకంలో వాక్య నిర్మాణం బాగా కుదిరింది. అది నా స్టయిల్‌లోనే ఉంటుంది తప్ప రమణ గారు రాసినట్లు ఉండదు. రమణగారు క్లుప్తంగా ఎంత వరకూ అవసరమో అంత వరకు మాత్రమే రాస్తారు. నాకు అలా రాయటం రాదు. నాది సాగదీత ధోరణి. అందుకే మా కోడలు- ‘‘మీరు ఎక్కువగా రాస్తారు’’ అంటూ ఉంటుంది.

బాపు సతీమణి భాగ్యవతితో...
ఇద్దరూ సర్దుకుంటేనే...
మాది ఉమ్మడి కుటుంబం. రమణగారికి ఓపిక ఎక్కువ. నేను కూడా ఓర్పుగానే ఉండేదాన్ని. నేను చెప్పింది ఆయన వినేవారు. ఆయన చెప్పింది నేను వినేదాన్ని. గట్టిగా మాటా మాటా అనుకున్న సందర్భాలేవీ లేవు. రమణగారిది స్నేహ స్వభావం. నెమ్మదిగా చక్కగా మాట్లాడతారు. పిల్లలపై కూడా ఎప్పుడూ కోపగించుకున్నది లేదు. పొద్దుటిపూట ఆయన పేపర్ చదువుకొనే సమయంలో కుటుంబ సభ్యులంతా వచ్చి కూర్చుని సరదాగా మాట్లాడుతుండేవాళ్లు. ఆయన అవన్నీ వింటూ, మధ్య మధ్యలో మాటలు కలుపుతూ జోక్స్ వేస్తూ గంటసేపు హాయిగా గడిపేవారు. అలాగే సాయంత్రం పూట ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మా అత్తగారు, బాపు గారి తల్లి, మా ఆడపడుచు, మా పిల్లలు అందరూ చేరి బోలెడు కబుర్లు చెప్పుకునేవారు. ఇంటికి బంధు మిత్రులు ఎవరు వచ్చినా వాళ్లతో గంటలు గంటలు మాట్లాడుతుండేవారు. ఆయనకు స్నేహితులు కూడా ఎక్కువే. చిన్నప్పుడు మద్రాసులో చదువుకునేటప్పుడు, సినిమాల్లోకి వచ్చాక కూడా మంచి స్నేహితులు ఉండేవారు. అందరూ కలిసి సంతోషంగా గడుపుతూ ఉండేవారు.
విడదీయలేని స్నేహం...
మా పెళ్లికి ముందే రమణగారికి బాపుగారితో మంచి స్నేహం ఉండేది. నేను బాపు గారిని మొదటిసారి చూసింది మా పెళ్లిలోనే! మా అన్నయ్య నండూరి రామ్మోహనరావు... ‘ఆంధ్ర పత్రిక’లో పనిచేసేటప్పుడు మద్రాసులో బాపుగారింట్లో అద్దెకు ఉండేవారు. అన్నా వదిన సెలవులకు మా ఊరు వచ్చినప్పుడు... బాపుగారు, ఆయన భార్య భాగ్యవతి.. ఆయన తమ్ముళ్ల గురించి చాలా సంగతులు చెబుతుండేవారు. దీంతో వాళ్లెవరినీ నేను చూడకపోయినా... నాకు బాగా తెలిసిన వ్యక్తుల్లా అనిపించేవారు. ఇక పెళ్లయి మద్రాసుకు వెళ్లిన తర్వాత బాపుగారిది, మాది పక్కపక్క ఇళ్లే. దాంతో బాపుగారి భార్య భాగ్యవతి మా ఇంటికి తరచూ వస్తుండేది. భాగ్యవతి చిన్నప్పటి నుంచీ మద్రాసులోనే పెరిగింది. ఆమెది పెద్ద కుటుంబం. ఆమెకు మద్రాసులో చాలామంది బంధుమిత్రులు ఉండేవారు. నేను పల్లెటూరినుంచి రావటం వల్ల మద్రాసు గురించి నాకు ఏమి తెలీదు. కొద్ది కాలంలోనే తాను నాకు మంచి స్నేహితురాలైంది. మద్రాసును నాకు పరిచయం చేసింది తనే! మా పిల్లల స్కూల్ అడ్మిషన్స్ నుంచి వాళ్ల యూనిఫామ్‌ల దాకా అన్నీ తనే చూసుకొనేది. సాయంత్రంపూట పిల్లలను బీచ్‌కు తీసుకెళ్లి ఆడించేది. సెలవులప్పుడు సర్క్‌సలకు, ఎగ్జిబిషన్లకు, సినిమాలకు తిప్పేది. నేను ఇల్లు కదిలితే... భాగ్యవతితోనే. ఆమె నాకు మంచి గైడ్‌లా ఉండేది. వాళ్లింట్లో పెళ్లిళ్లకు మేము, మా ఇంటి శుభకార్యాలకు ఆమె చుట్టాలతో సహా వెళ్లే వాళ్లం. బాపు, రమణ ఎంత మంచి స్నేహితులో మేమిద్దరం కూడా అలాగే ఒకరికొకరం అండగా ఉండేవాళ్లం. భాగ్యవతికి ఇతరులకు సాయం చేసే గుణం ఎక్కువ! ఏ సమయంలోనైనా, ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నానంటూ చేసిపెట్టేది. అవసరమైతే అర్ధరాత్రి అయినా సరే... కార్ డ్రైవర్‌కు ఫోన్ చేసి మరీ పిలిపించేది. ఆమె ఎంత కలివిడిగా ఉండేదో... బాపు గారికి అంత మొహమాటం! ఆడవాళ్ల దగ్గరైతే మరీను. అవసరం మేరకు మాత్రమే మాట్లాడేవారు. నేను కూడా బాపు గారితో మాట్లాడింది లేదు. మా పిల్లలు బాపుగారి దగ్గర, బాపుగారి పిల్లలు రమణగారి దగ్గర ఎక్కువ చనువుగా ఉండేవారు. ‘‘మామా, మామా’’ అంటూ వాళ్లకు కావాల్సిన పనులు చేయించుకునేవారు.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
వాళ్లు మాత్రమే ఇంటికి వచ్చేవారు
రమణగారు ఎక్కువగా బాపుగారింట్లోనే చర్చలు జరుపుతుండేవాళ్లు. ఇద్దరూ సినిమా సన్నివేశాల గురించి మాట్లాడుకునేవాళ్లు. ఆ సమయంలో పిల్లలతో సహా ఎవరూ వాళ్లని డిస్ట్రబ్ చేసేవాళ్లు కాదు. ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చి పడుకునేవారు. ఏవైనా అభిప్రాయ బేధాలు వస్తే ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకునేవారు. వాళ్ల వర్క్‌కు సంబంధించిన టెన్షన్లను ఇంట్లో చూపించేవారు కాదు. ఇంటికి దగ్గరలోనే మాకు ‘చిత్ర కల్పన’ ప్రొడక్షన్ ఆఫీస్ ఉండేది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, స్నేహితులు అంతా అక్కడికే వచ్చేవారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన శ్రీరమణ, శంకు, ఎమ్వీఎల్, వి.వి.సుబ్బారావు, కొండలరావు లాంటివారు మాత్రం మా ఇంటికి వచ్చేవారు.

నచ్చిన కథ
రమణగారు రాసినవాటిలో ‘కానుక’ కథ అంటే నాకు చాలా ఇష్టం. విచిత్రమేమిటంటే ఆ కథ ఆయన రాశారనే విషయం నాకు చాలాకాలం తెలియదు. ఆయన ఆ కథను పెన్ నేమ్‌తో రాశారు. ఆ కథ నాకు చాలా నచ్చింది. నా పెళ్లి అయిన తర్వాత ఈ కథను ఒక సంకలనంలో ముద్రించారు. అప్పుడు అది రాసింది ఆయనేఅని తెలిసింది.
షూటింగ్‌లు ఇష్టం ఉండేవి కాదు
సినిమా షూటింగ్‌లు చూడడానికి ఎక్కువగా వెళ్లేవాళ్లం కాదు. వాహినీ స్టూడియోలో ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంటే ఒకసారి వెళ్లాం. అలాగే ఒకసారి గిండీకి వెళ్లాం. అప్పట్లో రాజమండ్రిలో గోదావరి చుట్టుపక్కల అవుట్‌డోర్ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతుండేవి. ఆ ఊళ్లో బాపు, రమణల చిన్ననాటి మిత్రుడు బి.వి.ఎస్.రామారావు ఉండేవారు. ఆయన ఇరిగేషన్ ఇంజనీరు. పిల్లలకు స్కూలు సెలవులప్పుడు వారింట్లో ఉండి కొన్ని షూటింగ్‌లు చూసేవాళ్లం. అలాగే ఆయన ఏర్పాటు చేసిన లాంచ్ మీద తిరగడం, భద్రాచలం వెళ్లడం సరదాగా ఉండేది. అంతే తప్ప, షూటింగ్‌కి పిల్లల్ని తీసుకెళ్లడం రమణగారికి ఇష్టముండేది కాదు. పిల్లలు కూడా ఆసక్తి చూపేవారు కాదు.
ముందు ఆలోచించుకొని...
రమణగారు ఉదయాన్నే లేచి గంటసేపు వాకింగ్‌కు వెళ్లేవారు. తరువాత ఇంటికి వచ్చి కాఫీ తాగి పేపర్ చదువుకునేవారు. స్నానం చేసి టిఫిన్ తిన్న తరువాత రాసుకోవడానికి సిద్దమయ్యేవారు. వరండాలోనో, బాల్కనీలోనో, గదిలోనో కూర్చుని ప్యాడ్, పేపర్ పట్టుకుని గంట లేదా గంటన్నర సేపు రాసుకునేవారు. ఇక రోజంతా రాసే పని పెట్టుకునేవారు కాదు. వాకింగ్ చేసేటప్పుడే ఈరోజు ఏమి రాయాలి? ఎలా రాయాలి? అనేవాటిని ఆలోచించుకునేవారు. మధ్యాహ్నం 12 గంటలలోపు గబగబా రాసేసేవారు. తరువాత భోజనం చేసి పడుకొని లేచేసరికి నాలుగయ్యేది. కుటుంబ సభ్యులతో కాసేపు కబుర్లు చెప్పి పుస్తకాలు చదువుకొనేవారు. లేదంటే బాపుగారి దగ్గరకు వెళ్లేవారు.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..
IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..