Share News

మల్బరీ పండ్లతో మజాగా...

ABN , Publish Date - May 02 , 2026 | 02:25 AM

వేసవిలో మల్బరీ పండ్లు విరివిగా లభిస్తుంటాయి. నలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తూ కొంచెం పులుపు, కొంచెం తీపి కలగలిసిన రుచితో ఉంటాయి. ఎన్నో పోషకాలతో నిండిన మల్బరీ...

మల్బరీ పండ్లతో మజాగా...

వంటిల్లు

వేసవిలో మల్బరీ పండ్లు విరివిగా లభిస్తుంటాయి. నలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తూ కొంచెం పులుపు, కొంచెం తీపి కలగలిసిన రుచితో ఉంటాయి. ఎన్నో పోషకాలతో నిండిన మల్బరీ పండ్లతో సులువుగా తయారుచేసుకోదగ్గ విభిన్న రుచులు మీ కోసం...

మల్బరీ కుచెన్‌

కావాల్సిన పదార్థాలు

మల్బరీ పండ్లు- ఒక కప్పు, చక్కెర- ఒకటిన్నర కప్పులు, పాలు- అర కప్పు, కోడిగుడ్లు- రెండు, వెన్న- ముప్పావు కప్పు, మైదా- రెండు కప్పులు, బేకిండ్‌ పౌడర్‌- రెండు చెంచాలు, ఉప్పు- పావు చెంచా

తయారీ విధానం

  • వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు చక్కెర, పాలు, గుడ్లు, రెండు చెంచాల వెన్న, ఒకటిన్నర కప్పుల మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి గరిటెతో ఉండలు లేకుండా మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ బౌల్‌లో వేసి సమంగా పరచాలి. పైన మల్బరీ పండ్లు వేయాలి.

  • మరో గిన్నెలో అర కప్పు వెన్న, అర కప్పు చక్కెర, అర కప్పు మైదా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ బౌల్‌లోని మల్బరీ పండ్లపై పరచాలి.

  • ఈ బేకింగ్‌ బౌల్‌ని ఓవెన్‌లో ఉంచి 190 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద నలభై నిమిషాలపాటు బేక్‌ చేయాలి. తరువాత బయటికి తీసి చల్లార్చి ముక్కలు కోసి పైన మల్బరీ పండ్లు అలంకరించి సర్వ్‌ చేయడమే.

మల్బరీ కుల్ఫీ

కావాల్సిన పదార్థాలు

మల్బరీ పండ్లు- రెండు కప్పులు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- ఒక డబ్బా, ఫ్రెష్‌ క్రీమ్‌- రెండు కప్పులు, నిమ్మరసం- చెంచా, యాలకుల పొడి- చెంచా, పిస్తా పలుకులు- కొన్ని

తయారీ విధానం

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో మల్బరీ పండ్లు వేసి పది నిమిషాలపాటు మెత్తగా ఉడికించాలి. తరువాత స్టయినర్‌ సహాయంతో మరో గిన్నెలోకి రసాన్ని వడబోసి నిమ్మరసం కలపాలి. ఈ గిన్నెను మరల స్టవ్‌మీద ఉంచి అయిదు నిమిషాలు మిశ్రమాన్ని ఉడకనిచ్చి దించాలి.

  • వెడల్పాటి గిన్నెలో క్రీమ్‌ వేసి బాగా బీట్‌ చేయాలి. తరువాత కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మరోసారి బీట్‌ చేయాలి. తరువాత మల్బరీ మిశ్రమం, పిస్తా పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ అచ్చుల్లో లేదా పెద్ద బౌల్‌లో పోసి ఎనిమిది గంటలపాటు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత బయటికి తీసి గాజు బౌల్స్‌లో సర్వ్‌ చేయడమే.


మల్బరీ మొజిటో

కావాల్సిన పదార్థాలు

మల్బరీ పండ్లు- అర కప్పు, పుదీనా ఆకులు- ఆరు, ఐస్‌ క్యూబ్స్‌- నాలుగు, లెమన్‌ స్లయిసెస్‌- రెండు, సోడా వాటర్‌- ఒక గ్లాసు

తయారీ విధానం

పొడవాటి గాజు గ్లాసులో మల్బరీ పండ్లు, పుదీనా ఆకులు వేసి చెంచాతో క్రష్‌ చేయాలి. తరువాత ఐస్‌ క్యూబ్స్‌, లెమన్‌ స్లయిసెస్‌ వేయాలి. ఆపైన సోడా వాటర్‌ పోయాలి. అంతే రుచికరమైన మల్బరీ మొజిటో డ్రింక్‌ రెడీ.

క్రీమీ మల్బరీ డిలైట్‌

కావాల్సిన పదార్థాలు

మల్బరీ పండ్లు- రెండు కప్పులు, ఫ్రెష్‌ క్రీమ్‌- ఒక కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- అర కప్పు, చక్కెర- రెండు చెంచాలు, నిమ్మరసం- చెంచా, బాదం పలుకులు- కొన్ని, పిస్తా పలుకులు- కొన్ని

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో మల్బరీ పండ్లు, చక్కెర వేసి చిన్న మంట మీద అయిదు నిమిషాలపాటు మెత్తగా ఉడికించాలి. తరువాత నిమ్మరసం కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి. వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో ఫ్రెష్‌ క్రీమ్‌ వేసి నురుగులా వచ్చేవరకూ బీట్‌ చేయాలి. ఆపైన కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలిపి మరోసారి బీట్‌ చేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మల్బరీ పండ్ల మిశ్రమం వేసి కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి. తరువాత గాజు గ్లాసుల్లోకి తీసి పైన బాదం పలుకులు, పిస్తా పలుకులు చల్లి చల్లగా సర్వ్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 02:25 AM