Share News

ఈ పెద్దలు... ఎదిగిన పిల్లలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:48 AM

పిల్లలు పెరిగే క్రమంలో తల్లి వాళ్ల వెన్నంటి ఉండడం అవసరమే! అయితే ఒకానొక సమయానికి తల్లి, పిల్లల జీవితంలో అదృశ్య రూపానికే పరిమితం కావాలి. లేదంటే ఆ పిల్లలు, ఎప్పటికీ....

ఈ పెద్దలు... ఎదిగిన పిల్లలు

పేరెంటింగ్‌

పిల్లలు పెరిగే క్రమంలో తల్లి వాళ్ల వెన్నంటి ఉండడం అవసరమే! అయితే ఒకానొక సమయానికి తల్లి, పిల్లల జీవితంలో అదృశ్య రూపానికే పరిమితం కావాలి. లేదంటే ఆ పిల్లలు, ఎప్పటికీ పెద్దల రూపంలోని పిల్లల్లాగే మిగిలిపోతారు. అదృశ్యమైపోవడమంటే...

భౌతికంగా అదృశ్యమవడం కానే కాదు. కురిపించే ప్రేమలో కోత విధించడం అంతకన్నా కాదు. అదృశ్యమైపోవడమంటే, పిల్లల జీవితంలో ప్రధాన మహిళ పాత్ర నుంచి తప్పుకోవడం. పిల్లలు స్వతంత్రంగా వాళ్లకు నచ్చినదాన్ని ఎంచుకునే ఖాళీని ఏర్పరచడం తల్లి బాధ్యత. పిల్లల ప్రతి చిన్న ఆలోచన, అంతిమంగా తల్లి ఇవ్వబోయే సలహా లేదా సూచన వైపు మళ్లకుండా జాగ్రత్త పడాలి. తమంతట తాముగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగే వెసులుబాటును కల్పించి, ఫలితాలను బట్టి పిల్లలకు దిశానిర్దేశం చేయాలి. స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాల ఫలితాలను పిల్లలే భరించవలసి వస్తుంది. కాబట్టి ఆ క్రమంలో నేర్చుకునే అనుభవాలు, జీవిత పాఠాలుగా మారి మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయనే విషయం ప్రతి తల్లీ గుర్తుపెట్టుకోవాలి. ఎదిగిన తర్వాత కూడా తల్లి వేలు పట్టుకుని నడిచే పిల్లలు, కొన్ని దశాబ్దాలకు తల్లికి సైకలాజికల్‌ ఎక్స్‌టెన్షన్స్‌గా మారిపోతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మాతృత్వంలో మూడు దశలు...

ఫ్యూజన్‌: పుట్టింది మొదలు ఏడేళ్ల వయసొచ్చే వరకూ తల్లీ, బిడ్డ వేర్వేరు కాదు. ఒక ప్రాణాన్ని పంచుకునే రెండు శరీరాలు వాళ్లవి. ఆరోగ్యకరమైన ఇలాంటి ఫ్యూజన్‌ అవసరం కూడా!

సెపరేషన్‌: ఏడేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు, తల్లి బిడ్డ మీద తనకున్న పట్టును నెమ్మదిగా వదులు చేయాలి. ఈ వయసు పిల్లలకు వాళ్లకు నచ్చిన దుస్తులు, స్నేహితులు, అభిరుచులను ఎంచుకునే స్వతంత్రం ఇవ్వాలి.

రిట్రీట్‌: 18 నుంచి 21 ఏళ్ల వయసు పిల్లల జీవితంలో తల్లి పాత్ర కీలకం. అయితే తల్లి తీసుకునే చొరవ, ప్రమేయాలు, పిల్లల మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి. మరీముఖ్యంగా పిల్లల మీద చలాయించే ఆజమాయిషీ, విధించే నియంత్రణలు సృతి మించితే, అవి బెడిసికొట్టే ప్రమాదం ఉందనే విషయాన్ని ఈ ఈడు పిల్లల తల్లులు గ్రహించాలి. తల్లి ప్రేమను పంచుతూనే, పిల్లల స్నేహితుల పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి.


మదర్‌ కాంప్లెక్స్‌

45 ఏళ్ల వ్యక్తి తన భార్యను మించి, తల్లి సలహాకే ప్రాధాన్యమివ్వడం, 35 ఏళ్ల మహిళ, తల్లి ఒప్పుకోలేదని పెళ్లికి వెనకడుగు వేయడం లాంటి సంఘటనలు చూస్తూ ఉంటాం! నిజానికి ఈ రెండు సందర్భాల్లో పిల్లలు కనబరిచే సదరు ప్రవర్తనకు సహేతుకమైన కారణాలున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. కానీ అదే జీవితంగా బ్రతుకుతున్నప్పుడు కచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజానికి ఇలా నడుచుకునే పిల్లలు చెడ్డ పిల్లలు కాదు. వయసు పెరుగుతున్నా, 14 ఏళ్ల ఈడు దగ్గరే ఆగిపోయిన, పెరగడానికి ఒప్పుకోని తల్లుల నీడలో పెరిగిన పెద్దలు వీళ్లు.

తల్లుల్లో ప్రమాదకర సంకేతాలు

  • వృత్తిపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో తమతో పూర్తి పారదర్శకంగా ఉండమని పిల్లలను ఒత్తిడి చేయడం

  • పిల్లలు స్వతంత్ర నిర్ణయం తీసుకున్నప్పుడు నొచ్చుకోవడం, ఆ బాధను పిల్లల ముందు వ్యక్తం చేయడం

  • 40 ఏళ్ల బిడ్డతో వాదనకు దిగినప్పుడు... ‘నీ గురించి ఆలోచిస్తూ, రాత్రుళ్లు నాకు నిద్ర కరవవుతోంది’ అనే ఆయుధాన్ని ఉపయోగించడం

  • అతి చొరవ తీసుకుని తరచూ ఉచిత సలహాలివ్వడం

  • పిల్లల నిర్ణయాలను విమర్శించడం, తప్పులు ఎత్తి చూపడం

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 03:48 AM