Share News

వానల్లో చర్మం క్షేమం

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:09 AM

ఎండలు తగ్గి వానలు విజృంభిస్తున్న ఈ సమయంలో చర్మ రక్షణ మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఈ కాలంలో చర్మ సమస్యలు వేధించకుండా ఉండడం కోసం...

వానల్లో చర్మం క్షేమం

స్కిన్‌ కేర్‌

ఎండలు తగ్గి వానలు విజృంభిస్తున్న ఈ సమయంలో చర్మ రక్షణ మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఈ కాలంలో చర్మ సమస్యలు వేధించకుండా ఉండడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చర్మ వైద్యులు.

ఈ కాలంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది. దాంతో చర్మంలో నూనె గ్రంథులు కూడా చురుగ్గా మారిపోయి, నూనె ఉత్పత్తిని పెంచేస్తాయి. దాంతో చర్మ రంథ్రాలు పూడుకుపోయి, మొటిమలు వేధించడం మొదలుపెడతాయి. అలాగే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, వేసుకునే దుస్తులు మొదలు, కాళ్లకు వేసుకునే పాదరక్షలు, ఎంచుకునే సౌందర్య సాధనాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు

తడిచిన దుస్తులు, చెప్పులు, బూట్ల వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. చర్మం, గోళ్లకు ఈ ఇన్‌ఫ్షెన్లు సోకుతాయి. అందుకు తోడ్పడే అలవాట్లు మానుకోవాలి. అవేంటంటే...

  • వానకు తడిచిన దుస్తుల్లోనే ఎక్కువ సమయం గడిపేయడం

  • ఉతికిన దుస్తులు పూర్తిగా ఆరకుండా ధరించడం

  • తడిచిన బూట్లు, సాక్సులు చెప్పులు ఎక్కువ సమయం ధరించి ఉండడం

  • పూర్తిగా ఆరని సాక్సులు వేసి పిల్లలను బడికి పంపించడం

  • తడిచిన రెయిన కోట్‌, హెల్మెట్‌లను ఆరబెట్టకుండా ఉపయోగించడం

  • రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఒంటి మీద చిందిపడిన మురికి నీళ్లను శుభ్రం చేసుకోకపోవడం

  • వానలో తడిచిన తర్వాత స్నానం చేయకపోవడం

  • శుభ్రత పాటించకపోవడం

వానలో తడిచిన తర్వాత...

వాన నీళ్లలో... వాతావరణంలోని ప్రమాదకర రసాయనాలు కూడా కలిసి ఉంటాయి. అలాగే వానల వల్ల డ్రైనేజీలు ఉప్పొంగి, రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో మురికి నీళ్లు ఒంటి మీద చింది పడే ముప్పు ఎక్కువ. కాబట్టి వానలో తడిచినా, రోడ్డు మీద మురికినీళ్లు ఒంటి మీద చిందిపడినా వెంటనే స్నానం చేయాలి. దుస్తులను కూడా ఉతుక్కోవాలి. పూర్తిగా ఆరిన దుస్తులను ఇస్త్రీ చేయడం వల్ల, వాటిలో మిగిలి ఉన్న తేమ కూడా పూర్తిగా వదిలిపోతుంది. తడిచిన దుస్తుల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల తామర, ఇతరత్రా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వేధించవచ్చు. కాళ్లు, చేతి వేళ్ల మధ్య ఇన్‌ఫెక్షన్‌తో పాటు, గోరు చుట్టు సమస్య కూడా ఈ కాలంలో వేధిస్తుంది. కాబట్టి కాళ్లకు వేసుకునే బూట్లు, చెప్పులు కూడా పూర్తిగా ఆరిన తర్వాతే ధరించాలి. తలకు పెట్టుకునే హెల్మెట్‌ లోపలి భాగం కూడా పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి. వానలో తడిచిన రెయిన్‌కోట్‌ను నీళ్లలో నానబెట్టి, శుభ్రం చేసుకోవాలి.


ఈ మేజోళ్లు మేలు

నీళ్లు పీల్చుకోని, గాలి చొరబడే, త్వరగా ఆరిపోయే చెప్పులు, బూట్లు ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఈ కాలంలో బూట్లకు బదులు చెప్పులను ఎంచుకోవడం ఉత్తమం. మనకు మార్కెట్లో ప్రత్యేకించి వానాకాలం కోసం ఉద్దేశించిన రబ్బరు చెప్పులు దొరుకుతూ ఉంటాయి. అయితే ఆ చెప్పులు ఇవిఎ (ఎథిలీన్‌ వినైల్‌ అసిటేట్‌) కోవకు చెందినవై ఉండాలి. సాధారణంగా ‘క్రాక్స్‌’ ఈ పదార్థంతోనే తయారవుతూ ఉంటాయి. ఈ కాలంలో ఫంగస్‌ పెరుగుదలకు తోడ్పడే తోలు, స్యూడ్‌, కాటన్‌ లేదా కాన్వాస్‌ చెప్పులకు దూరంగా ఉండాలి. ఇవి నీటిని పీల్చుకుని, ఎక్కువ సమయం తడిగా ఉంటాయి కాబట్టి వీటితో అథ్లెట్స్‌ ఫుట్‌, గోరు చుట్టు, ఎగ్జీమా సమస్యలు మొదలవుతాయి. కాబట్టి చక్కని గ్రిప్‌, ట్రెడ్‌, గ్రూవ్స్‌ కలిగిన మెత్తని చెప్పులు వేసుకోవాలి. మందపాటి ఇవిఎ, లేదా రబ్బరు చెప్పులు ఎంచుకోవాలి. కొత్త చెప్పుల నుంచి ఘాటు వాసన వెలువడకూడదు. చెప్పుల్లో ఎలాంటి పగుళ్లు, బుడగలు లేకుండా, నున్నని ఫినిష్‌ కలిగి ఉండాలి. బూట్లు వాడడం తప్పనిసరి అయితే రెండు జతల బూట్లు, రెండు జతల సాక్సులు వాడుకోవాలి.

సొంత చికిత్స మానుకుని...

దురద, ఎర్రని మచ్చలు, మచ్చలు విస్తరించడం, నల్లబారడం, చర్మపు పైపొర ఊడిపోవడం, వేళ్ల మధ్య పాచిపోవడం, గోరు చుట్టు మొదలైన చర్మ సమస్యలు ఈ కాలంలో తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు సాధారణంగా మెడికల్‌ షాపులో మందులు కొనుక్కుని, వాడేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా వాడుకునేవాళ్లకు ఆ మందులు ఎంత కాలం పాటు వాడుకోవాలో తెలియదు. పైగా ఫార్మసిస్టులు ఇలాంటి ఇన్‌ఫెక్షన్లకు కాంబినేషన్‌ డ్రగ్స్‌ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా ఏ మందు, ఎంత కాలం పాటు వాడుకోవాలో తెలుసుకోకుండా వాడుకోవడం వల్ల, సమస్య తాత్కాలికంగా అదుపులోకొచ్చినా మళ్లీ తిరగబెడుతుంది. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్లు కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందకుండా చర్మ వైద్యులను సంప్రతించి కచ్చితమైన వైద్యాన్ని తీసుకోవడం అవసరం.

సన్‌స్ర్కీన్‌ తప్పనిసరి

ఎండ తగ్గింది కాబట్టి సన్‌స్ర్కీన్‌ వాడకం మానేయకూడదు. అలాగే లైట్‌ జెల్‌ ఆధారిత మాయిశ్చరైజర్లు, లైటర్‌ ఫౌండేషన్లు వాడుకోవాలి. ఈ కాలంలో చర్మ రంథ్రాలు పూడుకుపోయే ముప్పు ఎక్కువ కాబట్టి లూజ్‌ పౌడర్‌ రూపంలోని మేకప్‌ ఉత్పత్తులను ఎంచుకోవాలి. జిడ్డు చర్మం కలిగిన వారు చర్మానికి నప్పే సన్‌స్ర్కీన్‌, మాయిశ్చరైజర్‌, మేకప్‌ ఉత్పత్తుల గురించి చర్మ వైద్యులను అడిగి తెలుసుకుని, సూచించిన ఉత్పత్తులనే వాడుకోవాలి.

డాక్టర్‌ స్వప్న ప్రియ

డెర్మటాలజిస్ట్‌,కాస్మోస్యూర్‌,

హైటెక్‌సిటీ, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు

16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల

Read AP News Latest, Telangana News  And National News

Updated Date - Jun 09 , 2026 | 02:09 AM