తాగునీటి విషయంలో రాజీ వద్దు
ABN , Publish Date - Jun 15 , 2026 | 02:36 AM
వర్షాకాలంలో వచ్చే జబ్బుల్లో దాదాపు 80 శాతం కలుషిత నీటిని తాగడం వల్లే వస్తాయి. పైప్‌లైన్ల లీకేజీలు, మురుగునీరు కలవడం వల్ల ఈ సీజన్‌లో నీరు త్వరగా కలుషితం అవుతుంది....
వర్షాకాలంలో వచ్చే జబ్బుల్లో దాదాపు 80 శాతం కలుషిత నీటిని తాగడం వల్లే వస్తాయి. పైప్‌లైన్ల లీకేజీలు, మురుగునీరు కలవడం వల్ల ఈ సీజన్‌లో నీరు త్వరగా కలుషితం అవుతుంది. అందుకే ఈ వానాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాగునీటి విషయంలో పాటించాల్సిన సులువైన చిట్కాలు ఇవిగో..
రోలింగ్ బాయిలింగ్: నీటిని వేడి చేయడం మాత్రమే సరిపోదు. నీరు మరగడం ప్రారంభమైన తర్వాత కూడా కనీసం 10 నుంచి 15 నిమిషాలపాటు బాగా తెర్లకాగనివ్వాలి (రోలింగ్ బాయిలింగ్). దీనివల్ల నీటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు పూర్తిగా నశిస్తాయి.
ఫిల్టర్ నీరైనా సరే: ఇంట్లో ఆధునిక వాటర్ ఫిల్టర్ ఉన్నప్పటికీ వర్షాకాలంలో ఆ నీటిని కూడా కాచి, చల్లార్చి తాగడమే సురక్షితం.
రాగి, స్టీల్ పాత్రలు: కాచిన నీటిని నిల్వచేయడానికి ప్లాస్టిక్ బాటిళ్లను వాడొద్దు. రాగి లేదా స్టెయిన్‌లె్‌స స్టీల్ పాత్రలనే వినియోగించాలి.
చేతులు ముంచొద్దు: పాత్రల నుంచి నీటిని తీసుకునేటప్పుడు నేరుగా గ్లాసును ముంచకూడదు. చేతివేళ్ల ద్వారా క్రిములు నీటిలో చేరే ప్రమాదం ఉంది. పొడవైన హ్యాండిల్ ఉన్న గరిటెలను మాత్రమే ఉపయోగించాలి.
రోజూ కొత్త నీరే: రెండుమూడు రోజులకు సరిపడా నీటిని ఒకేసారి కాచి పెట్టుకోవద్దు. వాతావరణంలో తేమ వల్ల నిల్వ నీటిలో బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి రోజువారీగా కొత్తగా నీటిని మరిగించుకోవాలి.
దాహం వేయకపోయినా: వానాకాలంలో చల్లదనం వల్ల దాహం తక్కువగా వేస్తుంది. అయినా సరే డీహైడ్రేషన్ బారినపడకుండా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల కాచి చల్లార్చిన నీటిని క్రమం తప్పకుండా తాగాలి.
ఇంటి నీరే మేలు: ఆఫీసులకు, ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే వాటర్ బాటిల్ తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. బయట కొనాల్సి వస్తే సీల్ పక్కాగా ఉన్న బ్రాండెడ్ వాటర్‌ను మాత్రమే తీసుకోండి.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..
మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..