లగ్జరీ లైఫ్ వదిలి లామాగా!
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:08 AM
గ్లామర్ ప్రపంచం.. కళ్లు మిరుమిట్లు గొలిపే విలాసాలు.. ఖరీదైన వస్త్రాలు, విదేశీ ప్రయాణాలు.. అడిగితే అందే భోగభాగ్యాలు. సగటు మనిషి కలలుగనే...
గ్లామర్ ప్రపంచం.. కళ్లు మిరుమిట్లు గొలిపే విలాసాలు.. ఖరీదైన వస్త్రాలు, విదేశీ ప్రయాణాలు.. అడిగితే అందే భోగభాగ్యాలు. సగటు మనిషి కలలుగనే ఈ లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఆమె మనసులో ఏదో వెలితి. ఆ శూన్యాన్ని భర్తీ చేసే క్రమంలో ఆమె కనుగొన్న శాంతి మార్గమే బౌద్ధం. మోడలింగ్ నుంచి మౌనమునిగా మారిన లామా ఆర్య డ్రోల్మా అసాధారణ ప్రయాణం ఇది.
జీవితంలో మనం దేనికోసం పాకులాడతాం? ఆర్థిక స్వేచ్ఛ, నచ్చిన చోటికి తిరిగే వెసులుబాటు, సమాజంలో గుర్తింపు.. ఇవే కదా! ఆర్య డ్రోల్మాకు ఇవన్నీ పుట్టుకతోనే లేదా అతిచిన్న వయసులోనే దక్కాయి. ముంబైలో పుట్టి పెరిగిన ఆమె 18 ఏళ్లకే ఇంటర్ కాలేజీ అందాల పోటీలో విజేతగా నిలిచి మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. అదే సమయంలో ‘కాథే పసిఫిక్’ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా చేరారు. ఉదయం పారిస్‌లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం రోమ్‌లోని వాటికన్ సిటీ సందర్శన, సాయంత్రం లండన్‌లో షాపింగ్.. ఇదీ ఆమె నిత్య దినచర్య. గ్లామర్ ప్రపంచపు అంచులను తాకిన ఆమె.. ఒకానొక దశలో ఇవేవీ తన ఆత్మకు శాంతిని ఇవ్వలేవని గ్రహించారు.
మెరుపుల వెనుక మసకబారిన నిజం
‘‘ఆ దశ నాకు చాలా నేర్పింది. నక్షత్రాలను సైతం అందుకోగలననే నమ్మకాన్ని ఇచ్చింది. ప్రపంచ సంస్కృతులను, అద్భుతమైన వంటకాలను రుచి చూశాను. కానీ, అదంతా అందమైన భ్రమలా అనిపించేది’’ అని ఆర్య గుర్తుచేసుకున్నారు. న్యూయార్క్ నగరపు ధగధగలు, విజయ శిఖరాల మీద ఉన్న వ్యక్తుల మధ్య తిరుగుతున్నా, లోలోపల ఒక ఒంటరితనం ఆమెను వెంటాడేది. బౌద్ధంలో చెప్పే ‘శూన్యత’ అనేది తన జీవితంలో ఒక బహుమతిలా మారిందని ఆమె అంటారు. ఆ శూన్యమే ఆమెను బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖం వైపు నడిపించింది.
మైండ్‌ఫుల్‌నెస్ అవసరం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఒత్తిడితో సతమతమవుతున్నారు. దీనికి పరిష్కారం లగ్జరీ జీవితాన్ని వదిలేయడం కాదు, దానిపట్ల ఉన్న అవగాహన పెంచుకోవడం అని ఆర్య డ్రోల్మా చెబుతారు. ‘‘మనకు ఏం కావాలి? అనే ప్రశ్న కంటే, మనకు ఏది చాలు? అనే స్పష్టత అవసరం’’ అంటారు. రోజూ కొన్ని నిమిషాల ధ్యానం మన మెదడును, ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుతుంది. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ‘మైండ్‌ఫుల్‌నెస్’ (మెలకువగా ఉండటం) చాలా కీలకం. ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో, ఎరుకతో చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఉత్పాదకత పెరుగుతుందంటారు ఆర్య.
మహిళా సాధికారత
టిబెటిన్ బౌద్ధమతంలో జ్ఞానానికి, కరుణకు అందరూ సమానమే అయినా, సంస్థాగతంగా పురుషాధిక్యత ఉందనే నిజాన్ని ఆమె నిర్భయంగా అంగీకరిస్తారు. పునర్జన్మ పొందే మాస్టర్లను గుర్తించే ‘తుల్కు’ వ్యవస్థలో పురుషులకే ప్రాధాన్యం ఉంటుందని, మహిళలు ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా వారికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఆధ్యాత్మికతలో లింగభేదం ఉండకూడదు. మహిళలకూ సమాన అవకాశాలు, గౌరవం దక్కాలి’’ అని ఆమె కోరుకుంటారు. ఇప్పుడు పరిస్థితులు మెల్లమెల్లగా మారుతున్నాయని, మహిళా లామాలు తమ గళాన్ని వినిపిస్తూ పీఠాలను అధిరోహిస్తున్నారని ఆమె చెప్పారు.

నాయకత్వంలోనే మార్పు రావాలి
భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదుగుతున్న తరుణంలో, కేవలం లాభాల కోసమే కాకుండా ‘నైతిక నాయకత్వం’ వైపు దృష్టి పెట్టాలని లామా ఆర్య సూచిస్తున్నారు. సగటు నాయకుడు కేవలం తన ప్రయోజనం చూసుకుంటాడు, కానీ స్పృహ కలిగిన నాయకుడు సమాజ హితం కోరుతాడు. తన నిర్ణయాలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించే వారే అసలైన లీడర్లని ఆమె అంటారు. గ్లామర్ ప్రపంచపు కిరీటాన్ని వదిలి, మనశ్శాంతి అనే అక్షయ పాత్రను అందుకున్న ఆర్య డ్రోల్మా ప్రయాణం.. వెలుగుల కోసం బయట వెతకడం కంటే మనసు లోపల వెతకడమే మిన్న అని నిరూపిస్తోంది. ఆమె ఇప్పుడు సన్యాసిని మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై వేలమందికి మార్గనిర్దేశనం చేసే ప్రసంగీకురాలు. ‘‘మనం సాధించే విజయం మనల్ని గర్విష్టులుగా చేయకూడదు, సమాజానికి ఉపయోగ పడేలా చేయాలి’’ అన్నదే ఆమె సందేశం.
విషాదం మిగిల్చిన పాఠం
ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది కేవలం వైరాగ్యం మాత్రమే కాదు, ఒక పెను విషాదం కూడా. ఇరవై ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పోవడం ఆమెను కుదిపేసింది. ఆ దుఃఖం నుంచి పుట్టిన ఆలోచనే ‘అనిత్యం’. మనం ప్రేమించే వ్యక్తులైనా, వస్తువులైనా ఎప్పటికీ శాశ్వతం కావనే నిజాన్ని ఆమె బౌద్ధ బోధనల్లో కనుగొన్నారు. ఆ బాధే ఆమెలో కరుణను నింపింది. అప్పటి వరకు ఉన్న మెరుపుల ప్రపంచం నుంచి ఆమె నెమ్మదిగా బౌద్ధ సన్యాసిని (లామా)గా మారిపోయారు. గత జన్మల కర్మ సంస్కారాలే తనను ఈ బాటలో నడిపించాయని ఆమె నమ్ముతారు. బౌద్ధం కేవలం మతం కాదు, అదొక జీవన విధానమని ఆమె బలంగా చెబుతారు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు