Share News

విరిసిన అందం

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:38 AM

సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ నుంచి ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకింగ్‌ వరకు... ఆన్‌లైన్‌ కథల నుంచి న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ ర్యాంప్‌ వరకు ఆమె అడుగులు...

విరిసిన అందం

సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ నుంచి ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకింగ్‌ వరకు... ఆన్‌లైన్‌ కథల నుంచి న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ ర్యాంప్‌ వరకు ఆమె అడుగులు వేయని రంగంలేదు. కరీంనగర్‌లో పుట్టి, అమెరికా గడ్డపై ‘మిస్‌ తెలుగు యూఎ్‌సఏ 2026’ కిరీటాన్ని ముద్దాడింది మన అమూల్య బల్మూరి.

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో స్థిరపడిన బి.శ్రీనివాసరావు (రిటైర్డ్‌ ఐ అండ్‌ సీఏడీ అధికారి), రమ దంపతుల గారాలపట్టి అమూల్య. ఆమె మూలాలు కరీంనగర్‌ జిల్లాలోని చిట్యాలపల్లి గ్రామంలో ఉన్నాయి. భోజరెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఐటీ విద్యార్థినిగా మొదలైన అమూల్య ప్రస్థానం.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు చేరింది. మాస్టర్స్‌ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘గోల్డ్‌మన్‌ సాక్స్‌’లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

అలుపెరగని పోరాటం

అమెరికా వ్యాప్తంగా నిర్వహించిన ఈ ‘మిస్‌ తెలుగు యూఎ్‌సఏ’ పోటీలు ఏడు నెలలపాటు సాగాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వందమందికిపైగా యువతులు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. వారిలో అత్యంత ప్రతిభ కనబరిచిన 25 మందిని మాత్రమే ఫైనల్‌కు ఎంపిక చేశారు. టెక్సా్‌సలోని డల్లాస్‌ వేదికగా ఏప్రిల్‌ 4న జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో అమూల్య తన పట్టుదల, అంకితభావంతో అందరినీ వెనక్కినెట్టి విజేతగా నిలిచింది. టాలీవుడ్‌ నటి లయ చేతుల మీదుగా కిరీటాన్ని అందుకోవడం నిజంగా గొప్ప అనుభూతిని మిగిల్చిందని అమూల్య చెప్పింది.


సాహిత్యం నుంచి ర్యాంప్‌ వాక్‌ వరకు

అమూల్య కేవలం అందాల సుందరి మాత్రమే కాదు, అక్షర ప్రేమికురాలు కూడా. ఆమె రాసిన కథలకు ఆన్‌లైన్‌లో 90 వేల మందికిపైగా పాఠకులు ఉన్నారు. వృత్తిరీత్యా బ్యాంకింగ్‌ రంగంలో ఉంటూనే, ప్రవృత్తిగా ఫ్యాషన్‌ను ఎంచుకుని ‘న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌’లో ర్యాంప్‌ వాక్‌ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

బహుముఖ ప్రజ్ఞ

26 ఏళ్ల అమూల్య తన పట్టుదల, ప్రతిభతో అసాధ్యమనే పదమే లేదని నిరూపిస్తోంది. ఒకవైపు కార్పొరేట్‌ ఉద్యోగం, మరోవైపు సాహిత్య వ్యాపకం, ఇంకోవైపు గ్లామర్‌ రంగం.. ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్న అమూల్య ప్రయాణం నేటి యువతకు గొప్ప స్ఫూర్తి.

ఈ వార్తలూ చదవండి:

200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

Updated Date - Apr 11 , 2026 | 04:38 AM