Share News

గర్భస్రావాలకు అడ్డుకట్ట

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:15 AM

వేర్వేరు త్రైమాసికాల్లో జరిగే గర్భస్రావాలకు వేర్వేరు కారణాలుంటాయి. ఆరోగ్య సమస్యలు, జన్యు సమస్యలు మొదలు గర్భాశయ నిర్మాణంలో లోపాల వరకూ అనేక కారణాలు...

గర్భస్రావాలకు అడ్డుకట్ట

ప్రెగ్నెన్సీ

వేర్వేరు త్రైమాసికాల్లో జరిగే గర్భస్రావాలకు వేర్వేరు కారణాలుంటాయి. ఆరోగ్య సమస్యలు, జన్యు సమస్యలు మొదలు గర్భాశయ నిర్మాణంలో లోపాల వరకూ అనేక కారణాలు గర్భస్రావాలకు దారి తీస్తాయి.

కాబట్టి కారణాన్ని కనిపెట్టి తదనుగుణమైన చికిత్సలను ఆశ్రయించాలంటున్నారు వైద్యులుగర్భధారణను మూడు త్రైమాసికాల్లో విభజిస్తే, మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మొదటి త్రైమాసికం: గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో జరిగే గర్భస్రావాలకు క్రోమోజోమ్స్‌లో లోపాలు ప్రధాన కారణం. అండం, వీర్యం ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, అవి రెండూ కలిసి పిండం తయారైనప్పుడు, దాన్లో క్రోమోజోమల్‌ మల్టిప్లికేషన్‌ సక్రమంగా జరగని సందర్భాల్లో, లోపాలతో కూడిన పిండం ఏర్పడుతుంది. ఈ పిండానికి పెరిగే స్వభావం ఉండదు కాబట్టి దానంతట అదే గర్భస్రావం ద్వారా బయటకు వచ్చేస్తుంది. భార్యాభర్తల కుటుంబాల్లో క్రోమోజోమ్‌ సంబంధిత సమస్యలున్నప్పుడు కూడా గర్భాశయంలో అసాధారణ పిండాలు ఏర్పడి, గర్భస్రావానికి దారి తీస్తాయి

రెండో త్రైమాసికం: మూడో నెల దాటిన తర్వాత గర్భస్రావానికి ప్రధాన కారణం... ‘సర్వైకల్‌ ఇన్‌కాంపిటెన్స్‌’. ప్రసవ సమయంలో తెరుచుకుని, మూసుకుపోవలసిన గర్భసంచి ద్వారమైన సర్విక్స్‌, కొందరికి వదులుగా ఉంటుంది. నెలలు నిండేకొద్దీ శరీరంలో చోటుచేసుకునే హార్మోన్ల మార్పుల వల్ల, పెరిగే బరువు వల్ల పిండం సర్విక్స్‌ గుండా బయటకొచ్చేస్తుంది. అలాగే కొందరికి గర్భసంచి నిర్మాణంలో లోపాలుంటాయి. ఇలా పుట్టుకతోనే గర్భాశయ సమస్యలను వెంట తెచ్చుకున్న గర్భిణులు రెండో త్రైమాసికంలో గర్భస్రావ సమస్యను ఎదుర్కోవచ్చు. కొందరికి గర్భాశయ నిర్మాణ లోపాలతో పాటు, సర్వైకల్‌ ఇన్‌కాంపిటెన్స్‌ కూడా ఉండొచ్చు


మూడో త్రైమాసికం: 24 వారాలు దాటిన తర్వాత జరిగే గర్భస్రావాన్ని ప్రి టర్మ్‌ లేబర్‌గా పరిగణించాలి. ఈ పరిస్థితి 25 వారాల నుంచి 35 వారాల్లోపు తలెత్తవచ్చు. సాధారణంగా గర్భంలో పెరిగే బిడ్డ 37 వారాలకు పూర్తి పరిణతి పొంది, 40 వారాలకు ప్రసవం ద్వారా బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి 37 వారాల్లోపు జరిగే ప్రసవాలన్నిటినీ ప్రి మెచ్యూర్‌గానే పరిగణించాలి. 34 నుంచి 37 వారాల్లోపు ప్రసవమైతే ప్రి మెచ్యూర్‌గా, 34 వారాల్లోపు జరిగే ప్రసవాన్ని వెరీ ప్రి మెచ్యూర్‌గా వైద్యులు పరిగణిస్తారు. గర్భాశయ నిర్మాణంలో లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఏడు, ఎనిమిది నెలల్లో జరిగే ప్రసవాలన్నీ ఈ కోవకు చెందినవే! అలాగే మధుమేహం ఉన్న మహిళలు, వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లు గర్భసంచికి వ్యాపించిన మహిళల్లో, ఉమ్మసంచిలోని మెంబ్రేన్స్‌కు ఇన్‌ఫెక్షన్‌ సోకి, అది త్వరగా బ్రేక్‌ అయిపోయి, ప్రసవమైపోతుంది.

4-Navya.jpg

ప్రిమెచ్యూర్‌ లేబర్‌

అధిక బరువు, పిసిఒడి, మధుమేహ కుటుంబ చరిత్ర, కదలకుండా గంటల తరబడి పని చేయడం, అస్తవ్యస్థ జీవనశైలి, ఆహారశైలి వల్ల మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు పెరుగుతున్నాయి. గర్భధారణ వయసు ఎంత ఆలస్యమైతే, మధుమేహం, అధిక రక్తపోటు ముప్పు అంత ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో 6 నుంచి 8 నెలల్లో మధుమేహం, అధిక రక్తపోటు పెరగడం, ఫలితంగా బిడ్డకు రక్తప్రసరణలో లోపం తలెత్తి, ఆక్సిజన్‌, పోషణ అందక కడుపులోనే బిడ్డ చనిపోయే అవకాశాలు ఉండడం వల్ల అంతకంటే ముందే వైద్యులు, గర్భిణులను ప్రి మెచ్యూర్‌ లేబర్‌కు గురి చేయక తప్పడం లేదు. ఇలాంటి సందర్భాల్లో గర్భిణి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా సాధారణ ప్రసవం చేయవచ్చా, లేదంటే సర్జరీని ఆశ్రయించాలా? అన్నది వైద్యులు నిర్ణయిస్తారు. కొందరు గర్భిణుల్లో అధిక రక్తపోటు వల్ల మెదడులో నీరు చేరి, మూర్ఛలొచ్చే అవకాశాలుంటాయి. వైద్యులు, ముందస్తు లక్షణాల ద్వారా ఈ పరిస్థితిని అంచనా వేసి, వెంటనే సిజేరియన్‌ చేసేస్తూ ఉంటారు.


ఆరోగ్యాన్ని గాడిలో పెట్టుకుని...

గర్భస్రావాలకు ఆస్కారం లేకుండా నెలలు నిండి పండంటి బిడ్డను ప్రసవించాలనుకునే ప్రతి మహిళా, గర్భధారణకు ముందే ఆరోగ్య సమస్యలను సరిదిద్దుకుని, పరిపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలి. ప్రి డయాబెటిక్‌ దశలో ఉన్న మహిళలు, ఆ సమస్యను ఆహార నియమాలు, వ్యాయామంతో నియంత్రించుకుని, ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్రయత్నించడం ఉత్తమం. ప్రి డయాబెటి్‌సతో గర్భం దాల్చినప్పుడు, గర్భంతో పెరిగే హార్మోన్ల వల్ల ప్రి డయాబెటిస్‌, డయాబెటి్‌సగా మారిపోతుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. మధుమేహానికి మందులున్నప్పటికీ, గర్భంతో ఉన్నప్పుడు మధుమేహాన్ని అదుపు చేయడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. బిడ్డకు పోషణ అందాలి కాబట్టి ఆహార నియమాలు సాధ్యపడవు. అన్ని మందులూ వాడుకునే వీలుండదు. కాబట్టి ముందు నుంచే ఆరోగ్యాన్ని గర్భధారణకు అనువుగా ఉంచుకోవాలి. విటమిన్‌ లోపాలు, ఇన్‌ఫెక్షన్లు ఇతరత్రా ఆరోగ్య సమస్యలన్నిటినీ సరిదిద్దుకోవాలి.

నెల తప్పిన వెంటనే...

సాధారణంగా మూడో నెల వరకూ గర్భిణులు వైద్యులను కలవవలసిన అవసరం లేదనుకుంటారు. కానీ మొదటి ఐదు నెలలే అత్యంత కీలకం. కాబట్టి నెల తప్పిన వెంటనే వైద్యులను కలవడం అవసరం. ముందు ఎలాంటి పరీక్షలూ చేయించుకోని గర్భిణులకు వైద్యులు అవసరమైన పరీక్షలు సూచిస్తారు. ఆహార నియమాలతో పాటు వ్యాయామాలనూ సూచిస్తారు. గర్భధారణకు ముందే వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. దీంతో శరీర పటుత్వం పెరుగుతుంది. అలాగే గర్భం దాల్చిన తర్వాత మొదటి ఐదు నెలలూ ఎక్కువ బరువు పెరగకూడదు. ఇద్దరు మనుషులకు సరిపడా తినాలని ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగితే, ఐదో నెలకే అధిక రక్తపోటు, మధుమేహం వచ్చేస్తాయి. కాబట్టి గర్భిణులు ప్రతి నెలా వైద్యులను కలుస్తూ, బరువును అదుపులో ఉంచుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.

ముందస్తు చికిత్సలతో...

గర్భస్రావాలకు కారణమైన ఫైబ్రాయిడ్స్‌ను సర్జరీతో తీయించుకోవాలి. గర్భాశయ నిర్మాణంలో లోపాలుంటే వాటిని సరిచేయించుకోవాలి. మూడో నెలలో సర్విక్స్‌ వదులుగా ఉందని తేలితే, కుట్టుతో సరిచేసుకోవచ్చు. క్రోమోజోమ్‌ సమస్యలను చికిత్సతో సరిదిద్దే వీలుండదు. కాబట్టి సహజసిద్ధంగా గర్భధారణ జరిగే వరకూ ఎదురుచూడక తప్పదు.

అపోహలు - వాస్తవాలు

  • బొప్పాయి తింటే గర్భస్రావం అయిపోతుందన్నది అపోహ మాత్రమే! బొప్పాయి, పైనాపిల్‌ వల్ల గర్భిణులకు ఎలాంటి ముప్పు ఉండదు. పండిన బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి గర్భిణి ఈ పండును తినడం అవసరం. పచ్చి బొప్పాయిలో లేటెక్స్‌ అనే పదార్థం, గర్భాశయ సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. కాబట్టి బొప్పాయి గురించి ఒక అపోహ పాతుకుపోయింది. అయితే పండిన బొప్పాయిని గర్భిణులు నిస్సందేహంగా తినొచ్చు.


  • పైనాపిల్‌ తినడం వల్ల, కొబ్బరినీళ్లు తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు వెంట్రుకలు పెరగవు అన్నది కూడా అపోహే! జన్యుపరమైన కారణాల వల్లే, పసికందులకు వెంట్రుకలు తక్కువగా ఉంటూ ఉంటాయి.

  • గర్భిణులు వ్యాయామం చేయకూడదనీ, గర్భస్రావం ముప్పు ఉంటుందనీ అనుకోవడం కూడా అపోహే! పొట్ట మీద ఒత్తిడి పడని కోర్‌, యాబ్స్‌ వ్యాయామాలు చేయకూడదు. అలాగే జారిపడే వీలున్న జుంబా, ఏరోబిక్స్‌కు దూరంగా ఉండాలి. సాధారణ యోగా, ఈత, జిమ్‌ వ్యాయామాలు, చేతులతో బరువులెత్తే వ్యాయామాలు ఎలాంటి భయం లేకుండా చేయొచ్చు.

ప్రి కన్‌సెప్షనల్‌ చెకప్‌ కీలకంగర్భధారణకు ముందు ప్రి కన్‌సెప్షనల్‌ చెకప్‌ చేయించుకోవడం అత్యవసరం. ఈ చెక్‌పలో భాగంగా రక్తపరీక్షల ద్వారా హిమోగ్లోబిన్‌, థైరాయిడ్‌ మోతాదులను పరీక్షించుకుని, లోపాలను సరిదిద్దుకోవాలి. విటమిన్‌ డి, విటమిన్‌ బి12 మోతాదులు సరిపడా ఉండడం కడుపులో పెరిగే బిడ్డ మెదడు, ఎముకల ఎదుగుదలకు అత్యంత ముఖ్యం. ఈమధ్య కాలంలో పోషకాహార లోపాలు సర్వసాధారణమైపోతున్నాయి. ఈ లోపాలను మల్టీ విటమిన్‌ సప్లిమెంట్లు, ఆహారంతో సరిచేసుకోవాలి. రుబెల్లా, చికెన్‌ పాక్స్‌ మొదలైన వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ముందే సోకి ఉంటే, శరీరంలో సరిపడా యాంటిబాడీస్‌ ఉంటాయి. లేదంటే ఈ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా టీకాలు వేయించుకోవాలి. అధిక బరువు ఉన్న వాళ్లలో గర్భధారణను తట్టుకునే శక్తి గుండెకు ఉందో లేదో ముందే పరీక్షించుకోవాలి. గర్భాశయంతో పాటు ఓవరీస్‌, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ ఆరోగ్యాన్ని కూడా ముందే పరీక్షించుకోవడం మంచిది. ఫైబ్రాయిడ్స్‌తో గర్భస్రావం లేదా ప్రి టర్మ్‌ లేబర్‌ ముప్పులు పొంచి ఉంటాయి. కాబట్టి గర్భధారణకు ముందే ఫైబ్రాయిడ్స్‌ తొలగించుకోవడం మంచిది. దంతాలకు చేసే రూట్‌ కెనాల్‌ చికిత్స కూడా ప్రిటర్మ్‌ లేబర్‌ను ప్రేరేపిస్తుంది. కాబట్టి గర్భధారణకు ముందే దంత సమస్యలను కూడా సరిదిద్దుకోవాలి.

డాక్టర్‌ మానస బద్వేలి

కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌, గైనకాలజిస్ట్‌ అండ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌,

నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు

16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల

Read AP News Latest, Telangana News  And National News

Updated Date - Jun 09 , 2026 | 02:16 AM