Share News

డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:45 AM

మిర్నా మేనన్‌... తెలుగులో సినిమాలు చేసినా ‘జైలర్‌’లో శ్వేతగానే ప్రేక్షకుల్లో గుర్తింపు.నటి కావాలని దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసిన మిర్నా...

డబుల్‌ ధమాకా

మిర్నా మేనన్‌... తెలుగులో సినిమాలు చేసినా ‘జైలర్‌’లో శ్వేతగానే ప్రేక్షకుల్లో గుర్తింపు.నటి కావాలని దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసిన మిర్నా... తన ఆరాధ్య హీరో రజనీకాంత్‌తో నటించి చిరకాల కల నెరవేర్చుకుంది. తాజాగా ‘జైలర్‌-2’ ఘనవిజయం తనకు ‘డబుల్‌ ధమాకా’ అని చెబుతున్న ఆమె... త్వరలోనే ‘డాన్‌ బాస్కో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి పలకరించబోతోంది.

తొలి సినిమాతోనే ఎన్నో చేదు అనుభవాలు చవిచూసినా... చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వెండి తెరపై తన ప్రతిభను నిరూపించుకుంది మిర్నా మేనన్‌. నాలుగు స్ర్కీన్‌ నేమ్స్‌తో నటించిన తార కూడా బహుశా మిర్నాయే కావచ్చు. సినిమాలంటే తనకున్న ఇష్టమే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే శక్తిని అందిస్తోందని అంటోంది ఈ మలయాళీ కుట్టి.

దర్శకుడి వేధింపులతో...

కేరళలోని ఎడుక్కిలో పుట్టి పెరిగిన మిర్నా అసలు పేరు శరణ్యా సంతోష్‌. చదువు పూర్తయ్యాక దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నా... అభినయం పట్ల ఉన్న ఆసక్తి ఆమెను అక్కడ నిలవనివ్వలేదు. 2014లో స్వస్థలానికి తిరిగి వచ్చి తన సొంత పేరుతోనే ఒక మలయాళ టీవీ సీరియల్‌లో నటించింది. అప్పుడే ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ‘అథిరా సంతోష్‌’ పేరుతో ఆమె తెరంగేట్రానికి రంగం సిద్ధమయింది. కానీ చిత్రీకరణ సమయంలో మిర్నా ఆత్మహత్యాయత్నం చేసింది. దర్శకుడి వేధింపులు భరించలేక ప్రాణం తీసుకోవాలనుకున్నాననీ, పోలీసుల నుంచి కానీ, చిత్రం యూనిట్‌ నుంచి కానీ తనకు ఎలాంటి మద్దతు లభించలేదని ఆమె ఆరోపించింది. ఆ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగిన తరువాత... ‘పట్టత్తారి’ తమిళ చిత్రంలో హీరోయిన్‌గా ‘అదితి మేనన్‌’ పేరుతో తొలిసారి తెరపై కనిపించింది. ఆ తరువాత మరో తమిళ చిత్రం చేసినా... బ్రేక్‌ కోసం నాలుగేళ్ళు ఎదురు చూసింది. మలయాళీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ సరసన ‘బిగ్‌ బ్రదర్‌’ చిత్రం ఆమెకు ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చింది. అప్పటి నుంచి మిర్నా మేనన్‌గా కెరీర్‌ కొనసాగిస్తోంది.


ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌

ఆది సాయికుమార్‌ ‘క్రేజీ ఫెలో’తో తెలుగులో అరంగేట్రం చేసిన మిర్నా... ఆ తరువాత అల్లరి నరేష్‌ సరసన ‘ఉగ్రం’, ‘నా సామి రంగా’ చిత్రాల్లోనూ తళుక్కుమంది. ఆమె ప్రధానపాత్రలో 2023లో వచ్చిన ‘బుర్ఖా’ తమిళ సినిమా ‘న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శితమయింది. ఆ చిత్రంలో మిర్నా నటన ప్రశంసలందుకోవడంతో పాటు ఉత్తమనటి పాత్రకు ఆమె నామినేట్‌ కూడా అయింది. అదే ఏడాది విడుదలైన ‘జైలర్‌’ సినిమా మిర్నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసింది. అది తనకు ‘ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌’ అంటోందామె. ‘‘జైలర్‌’లో నేను నటించిన మొదటి సన్నివేశం రజనీ సార్‌తోనే. ‘‘మిర్నా తెలుగు, తమిళ సినిమాలు చేసింది. కానీ ఆమె మలయాళ పరిశ్రమకు చెందిన నటి’’ అంటూ దర్శకుడు నెల్సన్‌ నన్ను ఆయనకు పరిచయం చేశారు. ‘‘మలయాళంలో ఏ సినిమా చేశారు?’’ అని అడిగారు రజనీ సార్‌. ‘‘మోహన్‌లాల్‌ సార్‌తో బిగ్‌ బ్రదర్‌ చేశాను సర్‌!’’ అన్నాను. ఆయన వెంటనే నన్ను గుర్తు పట్టారు. తను ఆ సినిమా చూశానన్నారు. మేమిద్దరం కలిసి దాదాపు 35 రోజులపాటు పని చేశాం. అదే మరచిపోలేని అనుభవం అనుకుంటే... సీక్వెల్స్‌ చెయ్యని రజనీ సార్‌ ‘జైలర్‌-2’కి అంగీకరించడం, మరోసారి ఆయనతో కలిసి నటించడం... అది మరింత విజయం సాధించడం నాకు డబుల్‌ ధమాకా’’ అంటోంది మిర్నా.

ఆ డైలాగ్‌ గుర్తొచ్చింది...

హీరోయిన్‌ పాత్రలే కావాలనే పట్టింపు తనకు ఎప్పుడూ లేదంటుంది మిర్నా. ‘‘సవాలు విసిరే పాత్రల్ని నేను ఇష్టపడతాను. ‘బుర్ఖా’ సినిమాలో చేసిన పాత్ర అలాంటిదే. మొత్తం కథంతా ఇద్దరి మీదే నడుస్తుంది. అలాగే... ‘జైలర్‌’లో ఒక బిడ్డకు తల్లిగా నటించాను. ఫలానా పాత్రయితేనే నటిస్తానని భీష్మించుకుంటే... రజనీసార్‌, మోహన్‌లాల్‌సార్‌, నాగార్జునసార్‌ (‘నా నామి రంగా’లో), రమ్యకృష్ణ మేడమ్‌ లాంటి సీనియర్లతో పని చేసే అదృష్టం దొరికేది కాదు. వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ‘పడయప్ప’లో ‘‘వయసు అతని స్టైల్‌నీ, అందాన్నీ ఏమాత్రం తగ్గించలేదు’’ అనే డైలాగ్‌ ఉంది. రజనీసార్‌ను చూడగానే ఆ డైలాగ్‌ గుర్తొచ్చింది. అదే స్టైల్‌, ఎనర్జీ ఈ రోజుకీ ఉంది. అన్నిటికన్నా ఆయన నిరాడంబరతను చూసి నేర్చుకోవాలి. సెట్‌లోకి వచ్చాక... లంచ్‌ కోసం మాత్రమే బ్రేక్‌ తీసుకుంటారు. కార్‌వాన్‌లో లంచ్‌ చేసి... మళ్లీ సెట్‌లోకి వచ్చేస్తారు. షాట్‌ బ్రేక్‌లో కూడా అక్కడే ఉంటారు. ‘‘ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు నేనొక్కడ్నే కార్‌వాన్‌లో ఒంటరిగా ఎందుకు కూర్చోవాలి?’’ అంటారు అని గుర్తు చేసుకుంటుంది మిర్నా. ఆమెకు ఇద్దరు సిస్టర్స్‌. వాళ్ళు దుబాయ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. షూటింగ్‌ లేనప్పుడు మిర్నా అక్కడికి వెళ్ళి గడుపుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో ‘డాన్‌ బాస్కో’ అనే చిత్రం చేస్తోంది. నేను అన్ని భాషల సినిమాలు చూస్తాను. తోటి నటీనటుల నుంచి, సాంకేతిక నిపుణుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ ప్రక్రియను నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను. తుది శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని నా కోరిక’’ అంటోంది మిర్నా.


నా చిన్నప్పుడు రజనీసార్‌ నటించిన ‘పడయప్ప’ (తెలుగులో నరసింహ) సినిమా ఎన్నో సార్లు చూశాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. రజనీ సార్‌తో ‘జైలర్‌’, ‘జైలర్‌-2’ల్లో ఆయన కోడలుగా నటించడం, రెండు చిత్రాలూ భారీ విజయం సాధించడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు

వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..

Updated Date - Oct 25 , 2026 | 06:45 AM