మైక్రో స్ట్రెసింగ్.. సైలెంట్ కిల్లర్
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:22 AM
మనం పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే ఒత్తిడికి గురవుతామని అనుకుంటాం. కానీ ఆఫీసులో లేదా ఇంట్లో రోజంతా ఎదురయ్యే అతి చిన్న అసౌకర్యాలు, చిరాకులు మనకు...
మనం పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే ఒత్తిడికి గురవుతామని అనుకుంటాం. కానీ ఆఫీసులో లేదా ఇంట్లో రోజంతా ఎదురయ్యే అతి చిన్న అసౌకర్యాలు, చిరాకులు మనకు తెలియకుండానే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ప్రక్రియనే సైకాలజీలో ‘మైక్రో స్ట్రెసింగ్’ అంటారు.
చిన్న సమస్యలే.. కానీ ఎక్కువ: ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడటం, వర్క్ ఈమెయిల్ ఆలస్యంగా రావడం, పని మధ్యలో ఫోన్ నోటిఫికేషన్లు లేదా సహోద్యోగితో చిన్న అభిప్రాయ భేదం.. ఇవన్నీ మైక్రో స్ట్రెసర్స్ కిందకే వస్తాయి.
శరీరం గ్రహించదు: పెద్ద సమస్య వచ్చినప్పుడు మన శరీరం వెంటనే స్పందిస్తుంది. కానీ మైక్రో స్ట్రెసింగ్ విషయంలో సంఘటనలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల శరీరం దానిని గుర్తించలేదు. దీనివల్ల ఒత్తిడి కొద్ది కొద్దిగా రక్తంలో పేరుకుపోతుంది.
కార్టిసాల్ హార్మోన్ హెచ్చుతగ్గులు: ఈ చిన్న చిన్న ఒత్తిళ్ల వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ నిరంతరం స్వల్ప పరిమాణంలో విడుదలవుతూనే ఉంటుంది. ఇది జీర్ణక్రియను మందగించేలా చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని క్రమంగా బలహీనపరుస్తుంది.
సంబంధాలపై ప్రతికూల ప్రభావం: మైక్రో స్ట్రెసింగ్‌కు గురైన వ్యక్తులు తమకు తెలియకుండానే ఇంట్లో భాగస్వామిపై లేదా సహోద్యోగులపై సహనం కోల్పోతుంటారు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా ప్రతిస్పందిస్తారు.
తీవ్ర అలసట: తీవ్రమైన పనేదీ చేయకపోయినా సాయంత్రానికి విపరీతమైన నీరసం, తలనొప్పి, చిరాకు రావడం మైక్రో స్ట్రెసింగ్ సంకేతమే. ఇది దీర్ఘకాలంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
డిజిటల్ ఓవర్‌లోడ్: రోజులో పదే పదే సోషల్ మీడియా నోటిఫికేషన్లు చెక్ చేయడం, వాట్సాప్ మెసేజ్‌లకు వెంటనే రిప్లై ఇవ్వాలనే ఆరాటం కూడా మెదడుపై చిన్నపాటి ఒత్తిడిని నిరంతరం పెంచుతుంది.
చిన్న చిన్న ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి దాటవేయడం అలవాటు చేసుకుంటేనే దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది!
అధిగమించే మార్గాలు
రోజులో ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందించడం ఆపాలి.
సోషల్ మీడియా, పనికిరాని మెసేజ్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసి ఉంచాలి.
‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలి. సామర్థ్యానికి మించిన చిన్న చిన్న పనులను నెత్తిన వేసుకోకూడదు.
సాయంత్రం పని ముగిశాక కనీసం 15 నిమిషాలు ప్రకృతిలో లేదా ప్రశాంతంగా గడపాలి.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే