Share News

నెలసరి పరిశుభ్రంగా...

ABN , Publish Date - May 26 , 2026 | 03:31 AM

నెలసరి సమయంలో శుభ్రతను పాటించడం కీలకం. సంక్లిష్టమైన జననాంగ వ్యవస్థ పలు ఇన్‌ఫెక్షన్లకు నెలవుగా మారే అవకాశాలు ఎక్కువ కాబట్టి...

నెలసరి పరిశుభ్రంగా...

మే 28, రుతుస్రావ పరిశుభ్రతా దినోత్సవం

నెలసరి సమయంలో శుభ్రతను పాటించడం కీలకం. సంక్లిష్టమైన జననాంగ వ్యవస్థ పలు ఇన్‌ఫెక్షన్లకు నెలవుగా మారే అవకాశాలు ఎక్కువ కాబట్టి, మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో రెట్టింపు శుభ్రత పాటించాలి.

మహిళల జీవితంలో నెలసరి ఒక భాగం. ఈ సమయంలో పాటించే జాగ్రత్తలే మహిళల పునరుత్పత్తి వ్యవస్థనూ, సమూల ఆరోగ్యాన్నీ శాసిస్తూ ఉంటాయి. నెలసరి శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే, ఆడపిల్లలు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల ముప్పు నుంచి తప్పించుకోగలుగుతారు.

నెలసరి అంటే?

మహిళల శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్లలో మార్పుల ఫలితంగా గర్భాశయ లోపలి పొర మందంగా మారి, గర్భాశయం నుంచి విడిపోతుంది. ఈ క్రమంలో, విచ్ఛిన్నమైన రక్తనాళాల నుంచి వెలువడిన రక్తంతో కలిసి రుతుస్రావం అయిపోతుంది. సాధారణంగా 21 నుంచి 35 రోజుల మధ్య జరిగే ఈ ప్రక్రియ యవ్వనం నుంచి మెనోపాజ్‌ వరకూ కొనసాగుతుంది.

శుభ్రత ఇందుకే!

నెలసరి సమయంలో పరిశుభ్రతా లోపం అనేక ఇన్‌ఫెక్షన్ల ముప్పును పెంచుతుంది. అవేంటంటే....

  • జననేంద్రియ ఇన్‌ఫెక్షన్లు

  • మూత్ర వ్యవస్థ ఇన్‌ఫెక్షన్లు

  • చర్మ అలర్జీలు

  • పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌

  • పునరుత్పత్తి సమస్యలు

  • జననాంగ క్యాన్సర్‌

సురక్షితమైన సాధనాలు

  • శానిటరీ ప్యాడ్స్‌

  • టాంపూన్స్‌

  • మెన్‌స్ట్రువల్‌ కప్స్‌

ప్యాడ్స్‌ ప్రతి నాలుగు గంటలకోసారి మార్చుకుంటూ ఉండాలి. మార్చే ముందు, తర్వాత ప్రతిసారీ చేతులు శుభ్రపరుచుకోవాలి. జననేంద్రియాలను శుభ్రం చేసుకోడానికి శుభ్రమైన నీళ్లు వాడుకోవాలి. ఉపయోగించిన సాధనాలను పర్యావరణానికి హాని కలగని మార్గంలో వదిలించుకోవాలి.


అవగాహన ముఖ్యం

ఆడపిల్లలకు నెలసరి పట్ల అవగాహన ఇంటి నుంచే మొదలవ్వాలి. మొదటి నెలసరికి ముందే అవగాహన కల్పించాలి. అర్థం లేని భయాలు, అపోహలను తొలగించి, శరీర నిర్మాణం, నెలసరి అవసరాలు, ప్రయోజనాల గురించి వివరించాలి.

మే 28 విశేషం

సగటు రుతుక్రమ నిడివి 28 రోజులు. సగటు రుతుస్రావ వ్యవధి ఐదు రోజులు. కాబట్టి ఐదవ నెలలో 29వ తేదీని రుతుక్రమ పరిశుభ్రతా దినోత్సవంగా ఎంచుకోవడం జరిగింది. నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రంగానికి చెందిన ‘వాష్‌’ అనే ఒక జర్మనీ సంస్థ 2014లో ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతల పట్ల అవగాహనను పెంచి అపోహలను తొలగించడమే రుతుక్రమ పరిశుభ్రతా దినోత్సవం ప్రధాన ఉద్దేశం.

డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి,

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు

చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..

Updated Date - May 26 , 2026 | 03:36 AM