Share News

మెడిసిన్‌ బ్యాంక్‌...

ABN , Publish Date - May 25 , 2026 | 05:14 AM

ఖరీదైన మందులు కొనడానికి డబ్బు లేక సతమతమయ్యే రోగులు చాలామంది. అదే సమయంలో... మిగిలిపోయిన మందుల్ని చెత్తకుప్పలపాలు చేస్తున్నవారూ ఎంతోమంది....

మెడిసిన్‌ బ్యాంక్‌...

ఖరీదైన మందులు కొనడానికి డబ్బు లేక సతమతమయ్యే రోగులు చాలామంది. అదే సమయంలో... మిగిలిపోయిన మందుల్ని చెత్తకుప్పలపాలు చేస్తున్నవారూ ఎంతోమంది. ఇది తరచుగా అన్ని చోట్లా కనిపించే దృశ్యమే. కానీ మీనూ గోయల్‌ సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు. ఆరేళ్ళ క్రితం తన మిత్రులతో కలిసి ఆమె ఆరంభించిన మెడిసిన్‌ బ్యాంక్‌ వేలమందికి ప్రాణదాతగా నిలుస్తోంది. ఆ కథేమిటంటే...

అది ఫరీదాబాద్‌ (హరియాణా) సెక్టార్‌-35లోని ఒక భవనం. జనం క్యూలో నిలబడి, తమ వంతు వచ్చాక ప్రిస్ర్కిప్షన్‌ను అక్కడున్న వాలంటీర్ల చేతుల్లో పెడుతున్నారు. వారు వాటిని పరిశీలించి... అరల్లో ఉన్న మందుల్ని సంచుల్లో ఉంచి... రోగులకో, వారి తరఫువారికో అప్పగిస్తున్నారు. ఆ కేంద్రాన్ని స్థానికులు ‘మెడిసిన్‌ బ్యాంక్‌’ అని పిలుచుకుంటారు. ‘మెడిసిన్‌ బాబా ఫౌండేషన్‌’ ద్వారా నడుస్తున్న ఈ కేంద్రం వ్యవస్థాపకురాలు మీనూ గోయల్‌. ‘‘సాధారణంగా బ్యాంకుల్లో మనం డిపాజిట్‌ చేసిన డబ్బు మళ్ళీ మనమే తీసుకుంటాం. మా మెడిసిన్‌ బ్యాంకులో... మనం డిపాజిట్‌ చేస్తే, అవసరం ఉన్నవారు వాటిని విత్‌ డ్రా చేసుకుంటారు. అదే రెండిటికీ తేడా’’ అంటారామె.

అపార్థాలు, అనుమానాలు...

మెడిసిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆవేదనలోనుంచి వచ్చిందంటారు మీనూ. ‘‘మన దేశంలో రొట్టె ముక్క కొనుక్కొనే స్థోమత లేనివారు కోట్ల మంది ఉన్నారు. వారికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్‌ ఫీజులకూ, మందులు కొనుక్కోవడానికి డబ్బెక్కడినుంచి వస్తుంది? చాలా వైద్య కేంద్రాల్లో మందులుండవు. వాటిని కొనలేక, వైద్యాన్ని కొనసాగించలేక ఎంతోమంది కుంగిపోతున్నారు. వ్యాధులు ముదిరి మరణిస్తున్నారు. ఇది మన కళ్ళముందు కనిపిస్తున్న ఒక వాస్తవం. అలాగే... వ్యాధి నయమయ్యాకో, వైద్యులు వేరేవి వేసుకోమనడంవల్లో, లేదా రోగులు మరణించాకో... మిగిలిపోయిన మందుల్ని చెత్తకుప్పల మీద పారేస్తున్నారనేది కూడా మరో వాస్తవం. వాటిని అవసరమైనవారికి అందిస్తే... ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చనిపించింది. దాన్ని నా మిత్రులతో చర్చించాను. అలా... ఆరేళ్ళ క్రితం ‘మెడిసిన్‌ బ్యాంక్‌’కు అంకురార్పణ జరిగింది’’ అని వివరించారు మీనూ. ఏ కొత్త ప్రయత్నానికైనా ముందు తలెత్తే బాలారిష్టాలు దీనికీ వచ్చాయి. ‘‘మా కాన్సె్‌ప్టను కొందరు అపార్థం చేసుకున్నారు. మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ మా నిబద్ధతను గమనించిన తరువాత మద్దతుగా నిలబడ్డారు. ఆ విషయంలో మా బృందానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి’’ అంటున్నారు మీనూ.


సేకరణ కోసం బాక్స్‌లు

పన్నెండు మంది సభ్యుల ఆమె బృందంలో కార్పొరేట్‌ నిపుణులు, న్యాయవాదులు, బ్యూటీషియన్లు... ఇలా వివిధ వృత్తులవారు ఉన్నారు. మొదట్లో ఇంటింటికీ వెళ్ళి మందులు సేకరించడం ప్రారంభించారు. తరువాత సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. కొద్దిరోజుల్లోనే మంచి స్పందన వచ్చింది. మందుల్ని స్వయంగా తెచ్చి ఇచ్చేవారు కొందరైతే... కొరియర్‌ ద్వారా మరికొందరు అందిస్తున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి కూడా పంపిస్తున్నారు. ‘మిగిలిన మందుల్ని ఏం చేయాలా?’ అని ఆలోచించేవారికి కూడా ఇప్పుడు గుర్తుకు వచ్చేది ఆ సంస్థే. దీనితోపాటు... ఫరీదాబాద్‌లోని బహిరంగ ప్రదేశాలు, ఆలయాలు, హౌసింగ్‌ సొసైటీల్లో దాదాపు 30 మెడిసిన్‌ బాక్సుల్ని ఏర్పాటు చేశారు. మిగిలిన మందుల్ని జనం ఆ బాక్సుల్లో వేస్తే... మీనా బృందం వాటిని సేకరిస్తుంది. అలా అందిన మందుల్లో గడువు చెల్లిన వాటిని తొలగిస్తారు. మిగిలినవాటిని కేటగిరీల వారీగా మెడిసిన్‌ బ్యాంక్‌లో భద్రపరుస్తారు. రోగులు ప్రిస్ర్కిప్షన్‌ను తీసుకొస్తే... దాని ప్రకారం మందులు అందజేస్తారు.

2-Navya.jpg

ఆ ఘనత వారిదే...

‘‘నగరంలో చాలామంది వైద్యులు మాతో కలిసి పని చేస్తున్నారు. పేద రోగులను ఉచితంగా పరీక్షించి, ప్రిస్ర్కిప్షన్లు రాసి, మా దగ్గరకు పంపుతున్నారు. ఇప్పుడు సాధారణ ఇబ్బందుల నుంచి తీవ్రమైన వ్యాధుల వరకూ... దాదాపు అన్ని సమస్యలకూ మా దగ్గర మందులు ఉన్నాయి. వాటి వివరాలు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరైనా వచ్చి వాటిని తీసుకువెళ్ళొచ్చు. ఎవరి దగ్గరైనా మందులున్నాయని చెబితే వాటిని మేము కలెక్ట్‌ చేసుకుంటాం. ఇప్పటివరకూ కొన్ని వేలమంది మా సంస్థ ద్వారా లబ్ధి పొందారు. వైకల్యాలు ఉన్న వృద్ధులకోసం వీల్‌ఛైర్లు తదితరాలు కూడా సమకూర్చుతున్నాం. మేము చేసేదంతా పూర్తిగా ఉచితమే. ఎవరి నుంచీ విరాళాలుకానీ, వేరే సాయం కానీ మేము తీసుకోవడం లేదు. మా వృత్తుల ద్వారా వచ్చేది మాకు సరిపోతుంది. వేరే ఖర్చులేవైనా ఉంటే అందరం కలిసి పంచుకుంటున్నాం’’ అని చెబుతున్నారు మీనూ.

అబ్బాయిల్లాంటి హెయిర్‌కట్‌, ఫ్యాంట్‌, షర్ట్‌తో కనిపించే మీనూ తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం రెండు గంటల సమయాన్ని ఈ కేంద్రం కోసం కేటాయిస్తారు. అత్యవసరమైతే అన్ని వేళలా ఆమె బృందం అందుబాటులో ఉంటుంది. ‘‘ఇదంతా మా ఘనత అని అనుకోవడం లేదు. పౌరులు తమ సామాజిక బాధ్యతగా భావించడం వల్లే మెడిసిన్‌ బ్యాంక్‌ను నడపగలుగుతున్నాం. ప్రజల భాగస్వామ్యం, సహానుభూతి ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది’’ అని అంటారు మీనూ వినయంగా.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

Updated Date - May 25 , 2026 | 05:14 AM