సంకల్పమే ఆమె శక్తి
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:04 AM
పోలియో చిన్నప్పుడే ఒక చేతిని నిర్జీవంగా మార్చినా కుంగిపోలేదు. ఉద్యోగంలో చేరిన ఐదో రోజే రోడ్డు ప్రమాదం రూపంలో విధి మరో చేతిని విరగ్గొట్టి మృత్యుముఖంలోకి నెట్టినా లొంగిపోలేదు...
పోలియో చిన్నప్పుడే ఒక చేతిని నిర్జీవంగా మార్చినా కుంగిపోలేదు. ఉద్యోగంలో చేరిన ఐదో రోజే రోడ్డు ప్రమాదం రూపంలో విధి మరో చేతిని విరగ్గొట్టి మృత్యుముఖంలోకి నెట్టినా లొంగిపోలేదు. ఆ కఠిన పరీక్షలన్నింటినీ ఎదుర్కొని నిలబడటమే కాదు.. నేడు వందలాదిమంది విద్యార్థుల జీవితాల్లో నైపుణ్యాల వెలుగులు నింపుతున్నారు హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని ప్రభుత్వ బాలిక ఐటీఐ ప్రిన్సిపాల్ మన్నె సుజన. విధిని ఎదిరించి కార్పొరేట్ సంస్థలకే సవాలు విసిరేలా ప్రభుత్వ కాలేజీని తీర్చిదిద్దిన ఆమెను నవ్య పలకరించింది. సుజన స్ఫూర్తిదాయక ప్రస్థానం ఆమె మాటల్లోనే..
‘‘చిన్నప్పుడు పోలియో కారణంగా నా కుడిచేయి పూర్తిగా పడిపోయింది. సమాజం నుంచి ఎదురయ్యే రకరకాల చూపులను తట్టుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో నాకు చిన్నతనంలోనే అర్థమైంది. కుడిచేయి పనిచేయకపోయినా పట్టుదలగా ఎడమచేత్తో రాయడం అలవాటు చేసుకున్నాను. రాత్రింబవళ్లు శ్రమించి చదువుకున్నాను. ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఆ సంతోషం తీరకముందే విధి నన్ను మళ్లీ కఠినంగా పరీక్షించింది. ఉద్యోగంలో చేరిన ఐదో రోజే రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. ఎడమ చేయి భుజం కింద ఎముక రెండు ముక్కలుగా విరిగిపోయింది. తల పగిలి రక్తం ధారగా కారిపోయింది. బతకడం అసాధ్యమనుకున్న స్థితిలో మేజర్ సర్జరీ చేశారు. నేను బతుకుతానని వైద్యులు కూడా నమ్మలేదు. మృత్యుముఖం నుంచి తప్పించుకుని నేను మళ్లీ ఊపిరి పీల్చుకున్నానంటే.. ఈ సమాజానికి నేను చేయాల్సింది ఏదో ఉందనే నమ్మకం నాలో బలంగా నాటుకుంది. ఆ ఆశే నన్ను నడిపించింది, అదే ఈ రోజు నన్ను ఐటీఐ ప్రిన్సిపాల్ స్థాయికి చేర్చింది.
ప్రభుత్వ కాలేజీకి కార్పొరేట్ హంగులు
నాలాగే పేదరికం వల్ల, శారీరక ఇబ్బందుల వల్ల ఏ ఆడపిల్లా సమాజంలో ఆత్మన్యూనతా భావంతో కుంగిపోకూడదనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాను. నేను ప్రిన్సిపాల్‌గా చేస్తున్న కులీకుతుబ్‌షా ఐటీఐ రాష్ట్రంలోనే ప్రత్యేకమైనది. ఇక్కడ చదువుకునేది అమ్మాయిలే కాదు.. దానిని నడిపిస్తున్నది కూడా పూర్తిగా మహిళలే. నేను బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఈ భవనం చుట్టూ పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగి, రంగులు వెలిసిపోయి ఒక పాడుబడిన పాత భవనంలా ఉండేది. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే సమయం వృథా అయిపోతుందని నాకు అనిపించింది. అందుకే స్వయంగా నేనే చొరవ తీసుకుని దాతలను సంప్రదించడం ప్రారంభించాను. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులను కలిసి వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) నిధుల నుంచి మా కాలేజీ అభివృద్ధి కోసం కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరాను. నిధులు దుర్వినియోగం అయ్యాయన్న అపవాదు రాకూడదని బ్యాంకు అధికారుల పర్యవేక్షణలోనే ప్రతి రూపాయి ఖర్చయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాను. నా శ్రమ వృథా కాలేదు. ఈ రోజు మా ఐటీఐ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భవనం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ఆహ్లాదకరమైన పచ్చని తోటలు పెంచాం. విద్యార్థులు, సందర్శకులు కూర్చోవడానికి చెట్ల కింద బెంచీలు ఏర్పాటు చేశాం. క్లాస్‌రూమ్‌లో ఏసీలు, ల్యాబ్‌లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి కార్పొరేట్ కాలేజీలను తలపించేలా తీర్చిదిద్దాం.

సమష్టి కృషి
ఈ ప్రయాణంలో మా శాఖ ఉన్నతాధికారులైన ప్రభుత్వ కార్యదర్శి దాసరి హరిచందన, కమిషనర్ కాంతి వెస్లీ మార్గదర్శనం, నిరంతర ప్రోత్సాహం మాకు కొండంత అండగా నిలిచాయి. మా ఆఫీస్ సూపరింటెండెంట్, శిక్షణ అధికారులు అంతా కలిసి ఒకే బృందంగా, ఒక కుటుంబంలా ఏర్పడి అంకితభావంతో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అందుకే ఈ రోజు ఒక ప్రభుత్వ సంస్థ కార్పొరేట్ స్థాయికి ఎదిగింది. నేను విద్యార్థులకు ఎప్పుడూ ఒకటే చెబుతుంటాను. జీవితంలో ఎంతటి కష్టం ఎదురైనా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా అధైర్యపడకుండా పోరాడటమే ఒక మహిళకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. శారీరక లోపాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ మన ఎదుగుదలను ఆపలేవు. ‘మహిళలు ఏం చేయగలరు?.. ఏం సాధిస్తారు?’ అని తక్కువచేసి మాట్లాడే ఈ సమాజం ముందు మనం సాధించి చూపించాలి. ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఆత్మన్యూనతతో వెనకడుగు వేయకూడదు. మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో సమాజంలో మనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవాలి. అదే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’
దండా రామకృష్ణ
రెడీ టు జాబ్
ప్రస్తుతం మా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా), టైలరింగ్, డ్రెస్ మేకింగ్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ అనే నాలుగు రకాల ఉపాధి ఆధారిత కోర్సులు ఉన్నాయి. 120 మంది అమ్మాయిలు రూపాయి ఖర్చులేకుండా శిక్షణ పొందుతున్నారు. ఇక్కడికి వచ్చే పిల్లల కుటుంబ పరిస్థితులు ఆవేదనాభరితంగా ఉంటాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లలు ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు. కొందరు రాలేని పరిస్థితిలో ఉంటారు. మేము వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తాం. చదువు వారి జీవితాలను ఎలా మారుస్తుందో వివరించి పిల్లలు క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తాం. విద్యార్థులను ‘రెడీ టు జాబ్’ అనేలా మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడ చదువు పూర్తిచేసుకున్న వారికి మంచి వేతనంతో ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగం చేయడం ఇష్టంలేని వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపిస్తున్నాం. మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా వ్యాపార నైపుణ్యాలు నేర్పిస్తున్నాం. చదువు మాత్రమే కాదు.. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించినప్పుడే వారికి నిజమైన గౌరవం దక్కుతుందని నేను నమ్ముతాను.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన
యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి