మామిడి తొక్కలతో ఇలా
ABN , Publish Date - May 21 , 2026 | 04:28 AM
మామిడి పండ్ల తొక్కలను పడేయ కుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...
మామిడి పండ్ల తొక్కలను పడేయ కుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...
ముందుగా మామిడి పండ్లను ఉప్పు, పసుపు కలిపిన నీటిలో అరగంటకు పైగా నానబెట్టి ఆపైన మంచినీటితో కడిగి శుభ్రం చేయాలి. తరువాత వాటికి తొక్కతీయాలి. ఈ మామిడి తొక్కలను మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి తగినంత చక్కెర, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి మరికొంతసేపు దగ్గరకు వచ్చేలా ఉడికిస్తే రుచికరమైన జామ్ తయారవుతుంది. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు.
మామిడి తొక్కలను చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి. దీన్ని జల్లించి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడిని పచ్చళ్లు, కూరలు, సూప్‌లు, స్మూతీల్లో కలుపుకోవచ్చు. రకరకాల స్నాక్స్‌పైన చల్లుకోవచ్చు. దీనివల్ల ఆహార పదార్థాలకు అదనపు రుచి చేకూరుతుంది.
చిన్న గిన్నెలోకి కొద్దిగా మామిడి తొక్కల పొడిని తీసుకుని అందులో కొద్దిగా తేనె, తగినంత పెరుగు వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలుగుతుంది. అలాగే ట్యాన్ కూడా తగ్గుతుంది.
మందపాటి గిన్నెలో మామిడి తొక్కలు వేసి అవి మునిగేవరకూ నీటిని పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. తరువాత
ఈ నీటిని చిన్న గిన్నెలోకి వడబోసి చల్లార్చి ముఖానికి టోనర్‌లా ఉపయోగించవచ్చు. దీనివల్ల చర్మంపై పేరుకున్న మురికి, మృతకణాలు తొలగి ముఖం మృదువుగా మెరుస్తుంది. మొటిమల బాధ తగ్గుతుంది.
ఈ నీటిని మాడుకు పట్టిస్తే చుండ్రు, శిరోజాలు రాలడం లాంటి సమస్యలు తగ్గుతాయి.
మామిడి తొక్కలను నీటిలో మరిగించి వడబోసి కొద్దిగా తేనె, చెంచా నిమ్మరసం, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా అల్లం తురుం, రెండు పుదీనా ఆకులు వేసి టీలా తయారుచేసుకుని తాగవచ్చు. దీనిలో ఆరోగ్యానికి ఉపకరించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో మామిడి తొక్కలు వేసి నిండా నీళ్లు పోసి వారంపాటు నానబెట్టాలి. ఆపైన ఈ నీటిని మొక్కలకు అందిస్తే అవి ఏపుగా పెరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి
శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..