అల మంగళూరులో... అలలపై వేట
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:44 AM
అలలకు ఎదురెళ్లి... సముద్రం మధ్యలో వల వేసి... చేపలు పట్టడమంటే అదో పెద్ద సాహసం. బోటు ఎక్కింది మొదలు... తిరిగి వచ్చేవరకు... ప్రతి క్షణం ప్రాణాలతో చెలగాటం. అంతటి సాహసోపేతమైన..
స్ఫూర్తి
అలలకు ఎదురెళ్లి... సముద్రం మధ్యలో వల వేసి... చేపలు పట్టడమంటే అదో పెద్ద సాహసం. బోటు ఎక్కింది మొదలు... తిరిగి వచ్చేవరకు... ప్రతి క్షణం ప్రాణాలతో చెలగాటం. అంతటి సాహసోపేతమైన... ప్రమాదాలతో ముడిపడిన వృత్తిలో రాణిస్తోంది ఓ మహిళ. మగవారికి మాత్రమే సాధ్యమనుకున్న వేటను కోరి మరీ ఎంచుకున్న మంగళూరు వనిత... ప్రాప్తి మెండన్ కథ ఇది.
‘‘సాహసం... ఈ పదం వినడానికే ఎంతో బాగుంటుంది కదూ. మరి ఆ సాహసమే నేనైతే! ఆ ఊహే ఇవాళ నన్ను ఈ వృత్తిని ఎంచుకోవడానికి ప్రేరణనిచ్చింది. మంగళూరులోని మత్స్యకారుల కుటుంబం కావడంతో... చిన్నప్పటి నుంచీ తీర ప్రాంతాలతో అనుబంధంగా సాగుతోంది నా జీవితం. నాన్నతో కలిసి బోటులో తరచూ సముద్రంలోకి వెళ్లేదాన్ని. వల విసరడం... చేపలను పట్టడం... వాటిని తీసుకువచ్చి విక్రయించడం... అన్నీ ఆసక్తిగా గమనించేదాన్ని. కాలక్రమంలో నాకు తెలియకుండానే చేపల వేటపై ఆసక్తి పెరిగింది. అదే అభిరుచిగా మారింది. మొదట్లో మా కుటుంబం ఉడుపిలో ఉండేది. పదహారేళ్ల కిందట మా నివాసం మంగళూరుకు మారింది.
వారాంతాల్లో నాన్నతో కలిసి...
చదువుకొంటూనే... వారాంతాల్లో నాన్నతో కలిసి డీప్ సీ ఫిషింగ్‌కు వెళ్లేదాన్ని. నాన్న కూడా నా అభిరుచిని ఏనాడూ కాదనలేదు. ‘ఆడపిల్లవు... నీకెందుకు’ అని అనలేదు. మేము మంగళూరుకు రావడానికి ముందు నైజీరియాలోని ఒక ఫిషింగ్ నౌకలో కెప్టెన్‌గా నాన్న పదిహేను సంవత్సరాలు పని చేశారు. ఇక్కడికి వచ్చాక బోట్లు కొని, సొంతంగా చేపల వేట మొదలుపెట్టారు. సముద్రం మధ్యలోకి వెళ్లి, చేపలు పట్టడం అంత సులువు కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురువుతుంటాయి. బలమైన గాలులు, ఉధృతమైన అలలు, భారీ వర్షాల మధ్య సముద్రంలో గంటలకు గంటలు పని చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ప్రతిక్షణం అప్రమత్తంగా, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అలాంటి కష్టతరమైన వృత్తిలో ఆడవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
డిమాండ్ ఎక్కువ...
బాల్యం నుంచే అలలతో విడదీయరాని అనుబంధం నాది. అందుకే కెరీర్ ఏంటన్నదానిపై మొదటి నుంచీ స్పష్టత ఉంది. పాఠశాల విద్యాభ్యాసం తరువాత స్థానిక పిషరీస్ కాలేజీలో ఫిషరీస్ సైన్స్‌లో డిగ్రీ చదివాను. మరింత లోతైన అవగాహన కోసం ఫిషరీస్ ఇంజినీరింగ్, టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. అదేసమయంలో ‘ఇండో షిషరీ్‌స’లో ఇంటర్న్‌షిప్ చేశాను. 2024లో మాస్టర్స్ అవ్వగానే చేపల వేట మొదలుపెట్టాను. ఇది అత్యంత డిమాండ్ ఉన్న వృత్తుల్లో ఒకటి.

సవాళ్లు సహజం...
పదో తరగతి తరువాత చేపల వేటకు సంబంధించిన సబ్జెక్టు చదువుతానంటే మా అమ్మ కవిత... వద్దంటే వద్దన్నది. ఆడపిల్లను అంతటి క్లిష్టమైన, ప్రమాదకరమైన వృత్తిలోకి పంపేందుకు తను అస్సలు ఇష్టపడలేదు. కానీ నా పట్టుదల చూసి కాదనలేకపోయింది. నాటి నుంచి ప్రతి విషయంలో నాకు మద్దతునిచ్చింది. ఇతర వృత్తులతో పోలిస్తే ఇందులో రిస్క్ ఎక్కువ. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుంటాయి. చూడటానికి ఎంతో సరదాగా, అద్భుతంగా అనిపించవచ్చు. కానీ దిగితే కానీ లోతు తెలియదంటారు కదా... అలానే ఇది కూడా. తుపానుల వంటివి సంభవించినప్పుడు ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో చెప్పలేం. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అప్పుడు చేపలు పట్టడమే కాదు, బోటును రక్షించుకోవడం కూడా కష్టమవుతుంది. కానీ వాటన్నిటికీ భయపడితే ఇందులో రాణించలేం. ఇక్కడ సాహసమే ఊపిరి. నైపుణ్యంతో పాటు సమయస్ఫూర్తి కూడా కీలకం.
పదిహేనేళ్లుగా...
పదిహేనేళ్లుగా నేను సముద్రంలోకి వెళ్లి వస్తున్నాను. ఆరేళ్లుగా చేపల వేటను వృత్తిగా కొనసాగిస్తున్నాను. వలలు వేయడం, వాటిని లాగడం, చేపలను ఒడిసి పట్టుకోవడం... ఇతర సిబ్బంది మాదిరిగానే ఫిషింగ్‌లో అన్ని పనులూ చేస్తున్నాను. మా బృందంలో నేనొక్కదాన్నే మహిళను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను సముద్రంలోకి వెళ్లడం మానలేదు. అందరూ మగ సిబ్బంది మధ్య పని చేయడం అంటే, అదీ సముద్రం మధ్యలో ఎంతో ధైర్యసాహసాలు కావాలి. అవి నాకు మా నాన్న నుంచి చిన్నప్పుడే అలవడ్డాయు. నా అనుభవాలే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. పురుషాధిక్య రంగంలో నాదైన ముద్ర వేయడానికి దోహపడ్డాయి.’’

సరైన సౌకర్యాలు లేక...
ఇప్పుడిప్పుడే ఈ రంగంలో మహిళలు అరుదుగానైనా కనిపిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే మహిళా మత్స్యకారులు ఇప్పటికీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అనేక నౌకల్లో మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు లేవు. దీనివల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గంటలతరబడి సముద్రంలో గడపడం శారీరక శ్రమకు గురి చేస్తోంది. ఈ సమస్యలన్నిటితో పాటు ఈ రంగంలోకి రావాలనుకొంటున్న అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాను. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తున్నాను. ఓ మత్స్య కళాశాలలో కాంటాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నాను.
ఇవి కూడా చదవండి..
నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు