అమ్మ బాటలో...
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:01 AM
లోకంలో ఏ బిడ్డా ప్రేమ, ఆప్యాయతలకు దూరంగా జీవించకూడదు... ఇది సింధుతాయి దృఢ సంకల్పం. జీవితంలో ఎన్నో కష్టాలను...
లోకంలో ఏ బిడ్డా ప్రేమ, ఆప్యాయతలకు దూరంగా జీవించకూడదు... ఇది సింధుతాయి దృఢ సంకల్పం. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆమె వేలాదిమందికి అమ్మగా మారారు. ‘పద్మశ్రీ’ సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆమె అడుగుజాడల్లో పయనిస్తూ... ‘సింధూతాయ్ సప్కాల్ ఫౌండేషన్’ను సమర్ధవంతంగా నడిపిస్తున్నారు సింధుతాయి కుమార్తె మమతా సప్కాల్.
‘‘కిందటి వారం ‘ఆదిష్ జైన్ ఫౌండేషన్’ నుంచి ‘కార్యగౌరవ్ అవార్డు-2006’ను అందుకున్న సందర్భంలో... ఒక సామాజిక కార్యకర్త అడిగారు: ‘‘మీరు చేస్తున్న పనిని వారసత్వం అనుకుంటున్నారా? బాధ్యతగా భావిస్తున్నారా?’’ అని. ‘‘అవి వేర్వేరు విషయాలు కాదు. రెండూ ఒకటే’’ అని బదులిచ్చాను. ఎందుకంటే... సమాజం పట్ల బాధ్యత నాకు వారసత్వంగా వచ్చింది. ‘అనాథల అమ’్మగా ఖ్యాతి పొందిన మా అమ్మ సింధుతాయి ప్రేమకు ప్రతిరూపం. చిన్న వయసు నుంచి అనేక కష్టాలను, అవమానాలను భరించింది. ఎన్నోసార్లు చావుకు దగ్గరగా వెళ్ళింది. నాలుగేళ్ళ క్రితం మరణించిన అమ్మ జ్ఞాపకాలు వేలాదిమందిలో సజీవంగా ఉన్నాయి. వాటిని పదిలపరచుకొని, ఆమె వేసిన బాటలో నడవడం నా బాధ్యత... కర్తవ్యం కూడా.
రైళ్ళలో బిచ్చమెత్తి...
మహారాష్ట్రలోని పిప్కీ మేఘే అనే చిన్న పల్లెటూరిలో అమ్మ పుట్టింది. ఆమె తండ్రి పశువుల కాపరి. మగబిడ్డ కాదనే భావనతో చిన్నప్పుడు అమ్మను అందరూ చిన్నచూపు చూసేవారు. పన్నెండేళ్ళు రాగానే... తనకన్నా ఇరవయ్యేళ్ళ పెద్ద వ్యక్తితో వివాహం చేశారు. నాలుగో తరగతితోనే అమ్మ చదువు ముగిసిపోయింది. నవర్‌గ్రామ్‌లో అత్తింటికి వెళ్ళింది. రెండు మూడేళ్ళలోనే ముగ్గురు పిల్లలకు తల్లి అయింది. అప్పట్లో ఆవు పేడను సేకరించి, పిడకలు తయారు చేసేవారికి అందిస్తే... వాళ్ళు డబ్బు ఇచ్చేవారు. మరికొందరు మహిళలతో పాటు ఆ పనిలోకి వెళ్ళిన అమ్మ... కొందరు వ్యక్తులు చేసే అఘాయిత్యాలను చూసి ఎదురుతిరిగింది. దాంతో ఆమె మీద నిందలు వేశారు. ఆమె గర్భంలో ఉన్న నాలుగో బిడ్డకు తండ్రి ఎవరంటూ ఎగతాళి చేశారు. దాంతో... తొమ్మిదోనెల గర్భంతో ఉన్న ఆమెను అత్తింటివారు ఇంట్లోంచీ బయటకు గెంటారు. ఎక్కడా పని దొరక్క, పుట్టింటివారు ఆదరించకపోవడంతో... అనాథలా మిగిలింది. పశువుల పాకలో నాకు జన్మనిచ్చింది. నన్ను వీపున మోస్తూ... రైళ్ళలో బిచ్చం ఎత్తుకుంటున్న అమ్మ మనసు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో అనాథ పిల్లల్ని చూసి తల్లడిల్లిపోయింది. వారిలో నలుగురిని మా పూరిగుడిసెకు తీసుకువచ్చి పెంచింది. ఆ తరువాత గ్రామస్తులు, దాతల సహకారంతో... నలభయ్యేళ్ళ క్రితం అనాథ శరణాలయాన్ని స్థాపించి... మరింతమంది పిల్లలకు ఆశ్రయం కల్పించింది.
అమ్మ అలవాటు పాటిస్తున్నా...
పుణేలో అమ్మ స్థాపించిన ‘మదర్ గ్లోబల్ ఫౌండేషన్’, అలాగే ‘సింఽధుతాయి సప్కాల్ ఫౌండేషన్’ల ఆధ్వర్యంలో బాల సదన్‌లు, బాలికల హాస్టల్, విద్యాలయాలు, వైద్యశాలలు, గోరక్షణ కేంద్రాలు... ఇలా ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి. ఇప్పటివరకూ 2100 మందికి పైగా అనాథలను ఈ సంస్థలు చేరదీసి, విద్యావంతుల్ని చేసి, బతికే దారిని చూపించాయి. ప్రస్తుతం దాదాపు మరో 260 మంది ఆశ్రయం పొందుతున్నారు. అమ్మ దత్తత తీసుకున్న దీపక్ గైక్వాడ్, వినయ్ సప్కాల్ లాంటి ఎందరో ఈ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇంజనీర్లు, వైద్యులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు... ఇలా పలు రంగాల్లో స్థిరపడినవారు చాలామంది ఉన్నారు. కొందరు ప్రజాప్రతినిధులుగానూ సేవలందిస్తున్నారు. వీరంతా ఒక కుటుంబంలా ఉంటారు. మా సంస్థలకు తమకు వీలైన సాయం అందిస్తూ ఉంటారు. అందుకే... ‘మేము నడిపేవి అనాథాశ్రమాలు కావు, ఇక్కడ మమతానురాగాలు పెనవేసుకుంటాయి. అవి శాశ్వతంగా ఉంటాయి’ అని చెబుతూ ఉంటాను. ఎన్ని పనులు ఉన్నా... రోజూ రెండు పూటలా పిల్లలను స్వయంగా పలకరించి, అన్నం తినిపించడం అమ్మకు అలవాటు. అదే నేనూ పాటిస్తున్నాను. మొదట్లో ‘ఇన్ని బాధ్యతలు మోయగలనా?’ అని సందేహపడ్డాను. కానీ అందరి సహకారంతో ఈ కార్యకలాపాలు మరింత విస్తరించగలుగుతున్నాను. ఏ పని చేసినా అమ్మ, ఆమె స్ఫూర్తి నా వెనుకే ఉన్నాయనే నమ్మకం నన్ను నడిపిస్తున్నాయి.’’

అది దైవ నిర్ణయం
ఈ విషయాల గురించి నేను ఎప్పుడు ఆలోచించినా భావోద్వేగానికి గురై... కన్నీరు పెట్టుకుంటాను. నేను కాస్త పెద్దయ్యేసరికి... శరణాలయం పనుల్లో అమ్మ తీరికలేకుండా ఉండేది. నా చదువులో ఎక్కువ భాగం హాస్టళ్ళలోనే గడిచింది. ఇంటికి వచ్చినప్పుడు... అందరూ మా అమ్మను ‘అమ్మా!’ అని పిలవడం వినేదాన్ని. అదంతా దైవ నిర్ణయమనీ, ఎందరికో ‘అమ్మ’ పాత్ర పోషించడానికే ఆమె పుట్టిందని నా నమ్మకం. ‘‘పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డాను. ఎవరికీ అలాంటివి ఎదురుకాకూడదు. ఈ పిల్లలు సమాజంలో గౌరవంగా, హుందాగా బతకడం కోసం జీవితాంతం పాటుపడతాను’’ అని అమ్మ చెప్పేది. మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ తను ఎంతో చురుగ్గా ఉంండేది. కొన్నేళ్ళ క్రితం పులుల పరిరక్షణ ప్రాజెక్ట్ పేరుతో 84 గిరిజన గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. బాధితుల తరఫున అమ్మ తీవ్రంగా పోరాడి, వారి పునరావాసానికి దోహదం చేసింది. ‘నారీశకి’్త, ‘పద్మశ్రీ’ సహా కొన్ని వందల అవార్డులను అందుకుంది. వాటి ద్వారా వచ్చిన ప్రతి రూపాయినీ అనాథ పిల్లల కోసమే ఖర్చు పెట్టింది. నాలుగేళ్ళ క్రితం అమ్మ మరణించిన తరువాత... ఫౌండేషన్ నిర్వహణలో ఉన్న సంస్థల బాధ్యతల్ని నేను చేపట్టాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు