అది లవ్ బాంబింగ్ కావచ్చు
ABN , Publish Date - May 04 , 2026 | 05:50 AM
పరిచయమైంది మొదలు అనుక్షణం పలకరిస్తూ, ప్రశంసలు కురిపిస్తూ, అదే పనిగా శ్రద్ధ కనబరుస్తూ, ఉక్కిరిబిక్కిరి చేయడం... స్వచ్ఛమైన ప్రేమ కాకపోవచ్చు...
పరిచయమైంది మొదలు అనుక్షణం పలకరిస్తూ, ప్రశంసలు కురిపిస్తూ, అదే పనిగా శ్రద్ధ కనబరుస్తూ, ఉక్కిరిబిక్కిరి చేయడం... స్వచ్ఛమైన ప్రేమ కాకపోవచ్చు. ఈ తరహా ప్రవర్తనకు ‘లవ్ బాంబింగ్’ అనే పేరు కూడా ఉంది. దీనికీ, స్వచ్ఛమైన ప్రేమకూ తేడా తెలుసుకోవడం అవసరం.
‘కన్నా... ఏదైనా తిన్నావా, లేదా?’... ‘అయ్యో, తలనొప్పిగా ఉందా, వచ్చి తల పట్టనా?’... ఈ తరహా మాటలు ఎంతటి వాళ్లనైనా బోల్తా కొట్టిస్తాయి. అకస్మాత్తుగా అందే ఆపేక్షల ఒరవడిలో కొట్టుకుపోయేలా చేస్తాయి. అయితే ఈ అప్యాయతలు, అనురాగాల వెనకున్న అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా పరిచయమైన కొద్ది రోజుల వ్యవధిలోనే అంతు లేని ప్రేమను కురిపించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. నమ్మశక్యం కాని పనులతో, పొగడ్తలతో దగ్గరయ్యే ప్రయత్నం చేయడం, బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయడం, ఆప్యాయత ముసుగులో మోసపూరితమైన ప్రేమను కనబరచడం ‘లవ్ బాంబింగ్’ ప్రధాన లక్షణం. కాబట్టి లవ్ బాంబింగ్‌కూ, స్వచ్ఛమైన ప్రేమకూ వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని, ఆరోగ్యకరమైన, సంతులనమైన అనుబంధానికి ప్రాధాన్యమివ్వాలి.
అసలైన ప్రేమ అది కాదు
స్వచ్ఛమైన ప్రేమను కోరుకోని వారుండరు. అలాంటి ప్రేమ కోసం కలలు కనే క్రమంలో లవ్ బాంబింగ్‌నే స్వచ్ఛమైన ప్రేమగా భ్రమపడే ప్రమాదం లేకపోలేదు. కొన్ని రోజుల క్రితమే పరిచయమైన ఒక అపరిచిత వ్యక్తి, మెసేజీలు, బహుమతులు, ప్రమాణాలతో ఊపిరాడనివ్వకుండా చేస్తున్నప్పుడు, విచక్షణ మరిచి, ఆ ఒరవడిలో కొట్టుకుపోవడం సహజమే! అయితే ఈ తరహా లవ్ బాంబింగ్ ప్రేమకు కాదు, నియంత్రణకు సంకేతం. ఇలాంటి విపరీతమైన ఆప్యాయత లక్ష్యం, ఎదుటి వ్యక్తి భావోద్వేగాల మీద ఆధిపత్యం సాధించడమే! మన మీద ఆ భావోద్వేగ నియంత్రణ సాధించిన తర్వాత, సదరు వ్యక్తి తన పూర్వ ప్రవర్తనను మార్చుకోవచ్చు. శ్రద్ధను తగ్గించేయవచ్చు. ఫలితంగా ఆ బంధం అయోమయానికి లోను చేయవచ్చు, కుంగుబాటుకు కూడా గురి చేయొచ్చు. కాబట్టి అసలైన ప్రేమకూ, లవ్ బాంబింగ్‌కూ తేడాను తెలుసుకోవాలి. అసలైన ప్రేమలో దూకుడుతనం ఉండదు. కాలంతో పాటు క్రమేపీ పెరుగుతుంది. పరస్పర గౌరవం, హద్దుల ఆధారంగా స్థిరంగా, బలపడుతుంది. మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు, మనల్ని భయాలకూ, అనుమానాలు, ఆందోళనలకు గురి కానివ్వరు. బదులుగా మనకు అవసరమైనంత, తగినంత దూరం పాటిస్తూ, తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ వింటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాలం గడిచేకొద్దీ వాళ్ల మాటలు, చేతలు సరిపోలడం మొదలుపెడతాయి. నిజానికి అసలైన ప్రేమ, భేదాలను, ప్రత్యేకతలను స్వాగతిస్తుంది. ప్రేమంటే నిరంతర శ్రద్ధ కాదు. హద్దులు విధించినంత మాత్రాన మనల్ని అపరాధ భావానికి లోను చేయదు.
అసలు ఉద్దేశం కనిపెట్టి...
లవ్ బాంబింగ్, అసలైన ప్రేమకు మధ్య తేడాను కనిపెట్టడం కోసం, అసలు ఉద్దేశాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. లవ్ బాంబింగ్‌కు పాల్పడే వ్యక్తులు తరచూ అనవసరపు పొగడ్తలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. మన ప్రమేయంతో, అభిప్రాయంతో సంబంధం లేకుండా దూకుడుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పరిచయమైన తొలినాళ్లలోనే ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసేస్తూ ఉంటారు. మనదైన ఏకాంత సమయం గడపడాన్ని ఇష్టపడరు. అలా ఎందుకని ఎదురు ప్రశ్నించడాన్ని కూడా ఇష్టపడరు. కానీ అసలైన ప్రేమ మన సమయాన్ని ఆక్రమించదు. స్వేచ్ఛను హరించదు. మనస్పూర్తిగా మనల్ని ప్రేమించే వ్యక్తులు, మన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు కానీ, మనల్ని తన సొత్తు చేసుకోవాలనుకోరు. పరస్థితులు ప్రతికూలించినా వాళ్ల ప్రేమ దృఢంగానే ఉంటుంది. మనల్ని శిక్షించడం కోసం కనబరిచే ఆప్యాయతలో కోత విధించరు. కాబట్టి కొత్తగా పొందే ఆదరణ, ఆప్యాయతలు లవ్ బాంబింగ్ కాదని నిర్థారించుకోవడం కోసం కొన్ని సంకేతాల మీద దృష్టి పెట్టాలి. ఒకరి ఆప్యాయత ఊపిరాడనివ్వకుండా చేస్తున్నా, తెలియని భయాందోళనలకు లోను చేస్తున్నా, మన సమయాన్నంతా హరిస్తున్నా, అనవసరంగా అపరాధ భావానికీ, ఆత్మన్యూనతకూ లోను చేస్తున్నా, ఒక్క క్షణం ఆగి ఆ బంధాన్ని విశ్లేషించుకోవాలి. లవ్ బాంబింగ్ అని తేలితే, మరుక్షణమే ఆ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలి. ఇది మన ఎదుగుదలకూ, మానసిక ఆరోగ్యానికీ అవసరం.
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే