నిమ్మరసం రుచిగా
ABN , Publish Date - May 02 , 2026 | 01:27 AM
ఎండాకాలంలో తరచూ ఇంట్లో నిమ్మరసం తయారుచేసుకుని తాగుతూ ఉంటాం. కానీ హోటళ్లు, జ్యూస్ సెంటర్లలో లభించేదానిలా రుచిగా అనిపించదు. దీనికి మనం చేసే...
ఎండాకాలంలో తరచూ ఇంట్లో నిమ్మరసం తయారుచేసుకుని తాగుతూ ఉంటాం. కానీ హోటళ్లు, జ్యూస్ సెంటర్లలో లభించేదానిలా రుచిగా అనిపించదు. దీనికి మనం చేసే చిన్న పొరపాట్లే కారణం. అలాకాకుండా నిమ్మరసాన్ని సులువుగా రుచికరంగా సువాసనభరితంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం...
నిమ్మరసం చేసేటప్పుడు మనం ఒక పెద్ద గ్లాసు నిండా చల్లటి నీటిని తీసుకుని అందులో చక్కెర వేసి నిమ్మకాయ పిండేస్తూ ఉంటాం. ఇది సరైన విధానం కాదు. చల్లటి నీటిలో చక్కెర కరగడానికి చాల సమయం పడుతుంది. ఈ లోపు నీటి చల్లదనం తగ్గిపోయి, చక్కెర అణువులు నీటిలో సరిగా కలవక నిమ్మరసం రుచిని కోల్పోతుంది.
ముందుగా చక్కెరను కొద్దిగా వేడి నీటిలో వేసి కలిపి సిరప్‌ను తయారుచేసుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. పెద్దగ్లాసు మంచి నీటిలో నిమ్మరసం పిండి ఆపైన షుగర్ సిరప్ వేసి కలపాలి. దీనివల్ల పానీయం నోటికి స్మూత్‌గా తగులుతుంది. మరోపక్క తియ్యగా కూడా అనిపిస్తుంది.
నిమ్మకాయ అసలైన సువాసన దాని పైన ఉండే పసుపు రంగు తొక్కలో ఉంటుంది. నిమ్మకాయను కోసేముందు గ్రేటర్ సహాయంతో తొక్కను పైపైన కొద్దిగా తురిమి పెట్టుకోవాలి. దీన్ని నిమ్మరసంలో కలపాలి. ఈ తురుం వల్లనే నిమ్మరసానికి మంచి రుచి వస్తుంది.
నిమ్మరసంలో మామూలు ఉప్పు వేయకూడదు. నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి కలిపితే పులుపు సరిగా బ్యాలెన్స్ అయి మంచి షర్బత్ తయారవుతుంది. ఇందులోనే రెండు పుదీనా ఆకులను అరచేతిలో నలిపి వేస్తే మంచి సువాసన తోడవుతుంది.
నిమ్మకాయలను కోసే ముందు వాటిని అరచేతిలో ఉంచుకొని గట్టిగా నొక్కుతూ వేగంగా దొర్లించాలి. అప్పుడు వాటిలోని పీచులు విచ్ఛిన్నమై రసం బయటికి వచ్చి ఉంటుంది. నిమ్మకాయను కోయగానే రసాన్ని పిండడం సులువుగా ఉంటుంది. ఎక్కువ రసం వస్తుంది కూడా.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ