మత్తు వదిలిస్తున్నారు...
ABN , Publish Date - Jun 15 , 2026 | 02:50 AM
‘‘మాదకద్రవ్యాలు వ్యక్తిగత సమస్యో, కుటుంబ సమస్యో కాదు... సామాజిక సమస్య. కాబట్టి దాన్ని రూపుమాపాలంటే సామాజిక భాగస్వామ్యం కావాల్సిందే’’ అంటారు లతాదేవి..
‘‘మాదకద్రవ్యాలు వ్యక్తిగత సమస్యో, కుటుంబ సమస్యో కాదు... సామాజిక సమస్య. కాబట్టి దాన్ని రూపుమాపాలంటే సామాజిక భాగస్వామ్యం కావాల్సిందే’’ అంటారు లతాదేవి. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఆమె తమ పంచాయతీలోని అయిదు గ్రామాల్లో డ్రగ్స్ వాడకాన్ని ఎనభై శాతానికి పైగా నిరోధించారు. దీనికోసం ఆమె రూపొందించిన నమూనా, ఉద్యమ స్థాయిలో చేపట్టిన చర్యలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
హమీర్‌పూర్... హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ పంచాయతీ ప్రకృతి సౌందర్యానికి నిలయం... ప్రశాంతతకు కూడా. కానీ కొన్నేళ్ళ క్రితం చాపకింద నీరులా మొదలైన మాదకద్రవ్యాల వాడకం కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. ప్రధానంగా యువత జీవితాలు కల్లోలమైపోయాయి. ఈ పరిస్థితులు స్థానికురాలైన లతాదేవిని కలవరపరిచాయి. భవిష్యత్తులో మరెన్నో అనర్థాలను చూడాల్సి వస్తుందని ఆమెకు అర్థమయింది. సమస్య పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగారు. ‘‘దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట... గ్రామాల్లోని యువత అప్పుడప్పుడు మద్యం తాగడంతో ఈ వ్యవహారం ఆరంభమయింది. 2010 తరువాత... ‘చిత్తా’ అనే చవక రకం హెరాయిన్ గ్రామాల్లోకి ప్రవేశించింది. అప్పట్లో అంతా గుట్టుగా సాగేది. మెల్లగా బడి పిల్లలకు కూడా మాదక ద్రవ్యాలు అందుబాటులోకి వచ్చాయి. పిల్లలు బడి మానేయడం, కుటుంబ సభ్యుల మీద తిరగబడడం, సొంత ఇళ్ళలోనే దొంగతనాలు చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. రోజులు గడుస్తున్నకొద్దీ డ్రగ్స్‌కు బానిసలైన వారి సంఖ్య పెరిగింది. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాగే అతిగా డ్రగ్స్ వాడడం వల్ల హఠాన్మరణాలు కూడా ఎక్కువే సంభవించాయి’’ అని గుర్తు చేసుకున్నారు లతాదేవి. ‘‘మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వాటిని తమ దగ్గర ఉంచుకోవడం, వినియోగించడం... ఇవన్నీ నేరాలు. వీటి గురించి తెలిస్తే రిపోర్ట్ చెయ్యాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. తమ ఇంట్లో డ్రగ్స్ బానిసలు ఉన్నారనే విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా... పరువు పోతుందనో, తమ వారు జైలుకు వెళ్ళాల్సి వస్తుందనో దాస్తూ వచ్చారు. పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని గుర్తించాను’’ అని చెప్పారామె.
పెద్దలను, పిల్లలను కూడదీసి...
లతాదేవి కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు. ఆంక్షల మధ్య ఎంతో కాలం గడిపారు. 2014లో... స్థానిక ఎన్జీవో ‘ఆశాదీప్ జన్’ సంస్థలో వాలంటీర్‌గా చేరడం తన జీవితంలో పెద్ద మలుపు అని ఆమె చెబుతారు. ‘‘బాలికలందరూ బడికి వెళ్ళేలా చూడడం, పేద కుటుంబాల కనీస అవసరాలు తీర్చడం ఆ సంస్థ లక్ష్యాలు. దాదాపు ఎనభై మంది వాలంటీర్లుగా దానిలో పని చేసేవాళ్ళం. అప్పుడే మాదక ద్రవ్యాల దుష్ప్రభావాన్ని చాలా దగ్గరగా చూశాను. 2019 నాటికి... మా పంచాయతీలోకి డ్రగ్స్ పెద్ద సంఖ్యలో రావడం, కొన్ని పదులమంది దానికి బానిసలు కావడం, గృహ హింస, బహిరంగ వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇవన్నీ చూశాక... డ్రగ్స్ నిరోధానికి స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించాను’’ అని చెప్పారు లత. మహిళా స్వయంసహాయక బృందాలు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా తమ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో తన కార్యాచరణను లత ఆరంభించారు. పిల్లలను, వారి అలవాట్లను, వారి ప్రవర్తనలో మార్పులను, ఎవరితో వారు స్నేహం చేస్తున్నరనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని తల్లిదండ్రులను కోరారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. పాటలు, నాటకాలు, నినాదాల ద్వారా మాదకద్రవ్యాలు చేసే కీడును వాడవాడలా వివరించారు. పిల్లలతో బాలపంచాయతీలను ఏర్పాటు చేసి, తమ కార్యక్రమాలలో వారిని భాగస్వాముల్ని చేశారు. మెల్లమెల్లగా మార్పు మొదలయింది.

పూర్తిగా రూపుమాపడమే లక్ష్యం
2023లో సర్పంచ్‌గా ఎన్నికైన లత తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అధికారుల సాయం తీసుకున్నారు. జిల్లా స్థాయిలో పోలీసుశాఖ చేపట్టిన మాదకద్రవ్యాలపై యుద్ధంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఈ ఏడాది ఆరంభానికల్లా ఆ పంచాయతీలోని అయిదు గ్రామాల్లో 80 శాతానికి పైగా డ్రగ్స్ వాడకాన్ని, రాకపోకలను నియంత్రించగలిగారు. పంచాయతీ స్థాయిలో ఆమె సాధించిన విజయానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇటీవల ‘జన్ నేత్రి సన్మాన్-2026’ పురస్కారంతో సహా పలు గౌరవాలను ఆమె అందుకున్నారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అలాగే ‘ఐక్యరాజ్య సమితి మహిళా సదస్సు’లో తమ రాష్ట్రం నుంచి ఏకైక మహిళా ప్రతినిధిగా హాజరయ్యారు. డ్రగ్స్ నిరోధానికి ఆమె రూపొందించిన నమూనాను ఇప్పుడు పలు ప్రాంతాలు అనుసరిస్తున్నాయి. ‘‘ఇప్పుడు మా పంచాయతీలో డ్రగ్స్ కారణంగా జరిగే దుస్సంఘటనలు దాదాపుగా లేవు. కానీ ఇప్పటికీ కొందరు చాటుమాటుగా వాటిని తీసుకుంటున్నారు. గ్రామస్తుల సహకారంతో... నిఘా పెట్టాం. ఆ మహమ్మారిని పూర్తిగా రూపుమాపడం, మహిళలకు భద్రత, సాధికారత కల్పించడం నా లక్ష్యం. మాదకద్రవ్యాలపై యుద్ధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’’ అంటున్నారు లత.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..
మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..