ఆమె పరుగు అమ్మలెందరికో స్ఫూర్తి
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:48 AM
‘పిల్లలు పుట్టిన తరువాత తమ కెరీర్ ముగిసిపోయిందని... ఏమీ చేయలేమని చాలామంది మహిళలు భావిస్తుంటారు. అలాంటివారిలో చైతన్యం నింపే ప్రయత్నమే నాది’...
సంకల్పం
‘పిల్లలు పుట్టిన తరువాత తమ కెరీర్ ముగిసిపోయిందని... ఏమీ చేయలేమని చాలామంది మహిళలు భావిస్తుంటారు. అలాంటివారిలో చైతన్యం నింపే ప్రయత్నమే నాది’... అంటారు కుల్సుమ్ బానో. చంటి బిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్ పూర్తి చేసిన ఆమె పేరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది. ఇటీవల శ్రీనగర్‌లో నిర్వహించిన మారథాన్‌లో ఈ అపురూప ఘట్టం చోటుచేసుకుంది. సైనికుడి సతీమణిగా... ముగ్గురు పిల్లల తల్లిగా... కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... తనలాంటి మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు సంకల్పించిన 34 ఏళ్ల కుల్సుమ్ కథ ఇది.
‘‘భారత సైన్యంలో చేరాలి. దేశానికి సేవ చేయాలి’... చిన్నప్పుడు ఇదే నా కల. వయసుతో పాటు నా ఆకాంక్ష కూడా పెరుగుతూ వచ్చింది. గుజరాత్‌లోని సూరత్ జిల్లా మాది. 2012లో జమ్ముకశ్మీర్ బందిపొరా జిల్లా గురేజ్‌కు చెందిన ఇంతియాజ్‌తో నాకు పెళ్లయింది. ఆయన సీఆర్పీఎ్‌ఫలో జవాను. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లో పని చేస్తున్నారు. నేను సైనికురాలిని కాలేకపోయినా, నా భర్త కేంద్ర బలగాల్లో భాగం కావడం నాకు గర్వంగా అనిపిస్తుంది. పెళ్లికి ముందు నేను ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేసేదాన్ని. మావారికి వేరే ప్రాంతంలో ఉద్యోగంవల్ల నేను ఒంటరిగా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇది నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ఎందుకంటే మా అబ్బాయి వయసు పన్నెండేళ్లు. ఒక కుమార్తెకు రెండేళ్లు. ఇంకో బిడ్డకు ఏడాది. పిల్లల సంరక్షణతో నా కలలకు దూరమయ్యాను. అలాగని ఏ రోజూ బాధపడలేదు కానీ, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ‘నేనేంటి’ అని ప్రశ్నించుకున్నప్పుడు చెప్పుకోవడానికి నాకంటూ ఏ ప్రత్యేకత లేదు. మా అమ్మాయిలు పుట్టినప్పుడు నా భర్త విధినిర్వహణలో ఉండి రాలేకపోయారు.
పసిబిడ్డల ఆలనాపాలన ఒక ఎత్తు... పెద్దవాడిని రెడీ చేసి బడికి పంపడం మరొక ఎత్తు. క్షణం తీరిక దొరకదు. తెల్లవారుజాము మూడు గంటలకు నిద్ర లేస్తే... రాత్రి పడుకొనేసరికి పన్నెండు దాటుతుంది. నాకంటూ కలలు, కోరికలు ఉంటాయి కదా... వాటన్నిటినీ త్యాగం చేయాల్సివచ్చింది. కొన్నిసార్లు నామీద నాకే విసుగు పుట్టేది. తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లిపోతున్నాను. ఈ పరిస్థితిని అధిగమించాలంటే నాకంటూ కొంత సమయం కేటాయించుకోవాలని అనుకున్నాను.
ఒక రోజు ముందు...
చివరకు కోచ్, స్నేహితుడి ప్రోత్సాహంతో ఒక రోజు ముందు శ్రీనగర్ మారథాన్‌కు పేరు నమోదు చేసుకున్నా. చెబితే వద్దంటారని మావారికి చెప్పలేదు. హాఫ్ మారథాన్‌లో పాల్గొనాలనేది ఆలోచన. అంటే 21 కిలోమీటర్లు పరుగెత్తాలి. నేను క్లబ్‌కు వెళ్లినా నా బిడ్డను తీసుకువెళతాను. అలాగే ఈ పరుగు పందెంలో కూడా తనను ఎత్తుకొని పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. కానీ పోటీ రోజున నా పెద్ద కుమార్తె ఆరోగ్యం బాలేదు. మారథాన్ నుంచి విరమించుకుందామని అనుకున్నా. కానీ మా అబ్బాయి నాతో అన్నాడు... ‘‘చెల్లిని నేను చూసుకొంటా’’ అని. వాడు ఇచ్చిన ధైర్యంతో చంటి బిడ్డను నడుముకు కట్టుకొని, మారథాన్‌లో పాల్గొన్నాను. పాపాయి ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు కానీ, మధ్యలో ఆకలి వేసి ఏడ్చింది. దాంతో లాల్‌చౌక్ క్లాక్‌టవర్ వద్ద ఆగి, పాపకు పాలు పట్టాను. తరువాత రేసులో వెనుకబడ్డాను. అయితే విజయవంతంగా మారథాన్ పూర్తి చేశాను. చంటి బిడ్డను ఎత్తుకొని పరుగెత్తుతున్న నన్ను దారి పొడవునా ప్రోత్సహించారు. తమ సెల్‌ఫోన్లలో నా వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవన్నీ చూశాక నా మనసు ఆనందంతో పరవశించింది.
వారి కోసమే...
పిల్లలు పుట్టిన తరువాత తమ కెరీర్ ముగిసిపోయిందని, ఇక జీవితంలో ఏమీ సాధించలేమని చాలామంది మహిళలు భావిస్తుంటారు. నిత్యం పని ఒత్తిడిలో మనోవేదనకు లోనవుతుంటారు. అలాంటివారిలో చైతన్యం నింపడానికే నేను ఈ పరుగులో పాల్గొన్నాను. నన్ను చూసి ఏ ఒక్క తల్లి తన కెరీర్‌ను కొనసాగించినా, అది నా విజయంగానే భావిస్తాను.’’
ఫిట్‌నెస్ ట్రైనర్‌గా...
ఎలాగో తీరిక చూసుకొని శ్రీనగర్‌లోని ఒక స్పోర్ట్స్ క్లబ్‌లో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా చేరాను. ఎనిమిదో తరగతి చదువుతున్న మా అబ్బాయి అబ్దుల్లా కూడా ఈ క్లబ్‌లోనే స్కేటింగ్ నేర్చుకొంటున్నాడు. నా ఫిట్‌నెస్ చూసిన కోచ్... ‘‘మారథాన్‌లో ఎందుకు పాల్గొనకూడదు’’ అని అడిగారు. నా స్నేహితుడిదీ అదే మాట. ‘ముగ్గురు పిల్లల తల్లినైన నాకు పరుగులో పోటీ పడటం సాధ్యమా’ అనుకున్నాను. అయితే వ్యాయామాలు నా దినచర్యలో భాగం. కనుక ఫిట్‌నె్‌సకు ఎలాంటి ఇబ్బందీ లేదు. వచ్చిన చిక్కల్లా... ఇంట్లో పాలు తాగే పాప ఉంది. తనను ఒంటరిగా వదిలి రాలేని పరిస్థితి. ఏంచేయాలో తోచలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం