Share News

‘కూచిపూడి’తో నన్ను మలచుకున్నా

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:57 AM

ఒకవైపు శాస్త్రీయ నృత్యం, మరోవైపు రంగస్థలం, ఇంకోవైపు యాక్టింగ్‌ ట్రైనర్‌... ఇవన్నీగాక ప్రొఫెసర్‌గా సేవలు... ఇన్ని పాత్రల్లో ఒకే వ్యక్తి ఒదగడం కథల్లోనే కాదు... నిజ జీవితంలోనూ...

‘కూచిపూడి’తో నన్ను మలచుకున్నా

ఒకవైపు శాస్త్రీయ నృత్యం, మరోవైపు రంగస్థలం, ఇంకోవైపు యాక్టింగ్‌ ట్రైనర్‌... ఇవన్నీగాక ప్రొఫెసర్‌గా సేవలు... ఇన్ని పాత్రల్లో ఒకే వ్యక్తి ఒదగడం కథల్లోనే కాదు... నిజ జీవితంలోనూ సాధ్యమని నిరూపిస్తున్నారు డాక్టర్‌ అరుణా భిక్షు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నృత్య విభాగాధిపతి అయిన ఆమె... కూచిపూడిలో ‘రుద్రమకలాపం’తో వినూత్న ప్రయోగాలకు నాందిపలికారు. ఆమె దగ్గర శిక్షణపొందిన నటీనటులు ఎందరో వెండితెరపై రాణిస్తున్నారు. ‘యాదాద్రి జాతీయ పురస్కారా’న్ని అరుణ భిక్షు అందుకుంటున్న సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలకరించింది.

‘‘నటనలో మీరెక్కడైనా శిక్షణ తీసుకున్నారా?’’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. నేనెప్పుడూ ఎక్కడా యాక్టింగ్‌ కోర్సులు చేయలేదు. కూచిపూడి నృత్యం నాకు అభినయం నేర్పింది. అవసరార్థమే నట శిక్షకురాలినయ్యాను. నా దగ్గర యాక్టింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న వారిలో చాలామంది ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో నటీనటులుగా రాణిస్తున్నారు. కూచిపూడి నాటక సంప్రదాయానికి ఆత్మ... భామాకలాపం. అది సాత్వికాభినయ ప్రధానమైంది. అందులో భామ పాత్రధారిణి ముఖ్యంగా మనసును, శరీరాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇదే సూత్రాన్ని మా గురువు ఏలేశ్వరపు సూర్యప్రకాశశర్మగారు నాకు నేర్పించారు. ఆయన దగ్గర నా నాలుగో ఏట కూచిపూడి అభ్యాసం మొదలైంది. నా 12వ ఏట కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో వెంపటి పెద్దసత్యం మాస్టారి సమక్షంలో ప్రదర్శన ఇచ్చే భాగ్యం నాకు లభించింది. మా గురువుగారు సాధన చేయించిన ‘భామాకలాపం’, ‘ఉషాపరిణయం’ రూపకాలు నా అభినయ నైపుణ్యాన్ని తీర్చిదిద్దాయి.

రుద్రమ కలాపం...

‘బాలరామాయణం’ సినిమాకు సంబంధించి నటీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, స్మితామాధవ్‌ బృందానికి శిక్షణ ఇస్తున్న సమయంలోనే ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో ఏదైనా నృత్యరూపకం ప్రదర్శించమని నన్ను నిర్మాత మల్లెమాలగారు అడిగారు. ఒగ్గుకథ మీద నా భర్త భిక్షు క్షేత్ర స్థాయి పరిశోధన చేసినప్పుడు... ఆయన వెంట నేనూ వరంగల్‌ జిల్లా అంతా పర్యటించాను. భద్రకాళి దేవాలయాన్ని, ఇతర కట్టడాలను చూసినప్పుడు కాకతీయుల చరిత్ర, ముఖ్యంగా రాణి రుద్రమ సాహసాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సాహిత్యాభిలాషిని కావడంతో రుద్రమ జీవితం మీద వచ్చిన రచనలు కొన్ని చదివాను. అప్పటికే ‘భామాకలాపం’ కొన్ని వందలసార్లు ప్రదర్శించిన నాకు అదే ప్రక్రియలో ‘రుద్రమ కలాపం’ చేయాలన్న ఆలోచన కలిగింది. ఆ విషయం మల్లెమాలగారితో చెప్పగానే ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాతూరి నాగరాజుతో చర్చించి వీర రస ప్రధానంగా ఆయనతో ‘రుద్రమ కలాపం’ రాయించుకున్నాం. ఇరవై రోజుల వ్యవధిలో సాధన చేసి ప్రదర్శించాం. అది చూసిన కళా విమర్శకులు సైతం ‘21వ శతాబ్దంలో వచ్చిన ప్రథమ కలాపం ఇదే’ అని ప్రశంసించడం మరిచిపోలేను. అలాగే టీటీడీ కోరిక మేరకు తిరుమల చరిత్రను కళ్లకు కడుతూ... ‘యుగయుగాల తిరుమల’, ‘తరతరాల తిరుమల’, ‘వేంకటేశ్వరుని విలాసం’ నృత్యరూపకాలను బ్రహ్మాత్సవాల్లో లక్షలాది మంది భక్తుల సమక్షంలో ప్రదర్శించాం. కార్గిల్‌ అమరవీరులకు నీరాజనంగా ‘సోల్జర్‌’ కూడా ప్రేక్షకులను కదిలించింది. అందులో హీరో సునీల్‌ (అప్పటికి కాదు) నటించాడు. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ‘రోష్ని’ లాంటి రూపకాల ద్వారా సామాజిక చైతన్యానికి శాస్త్రీయ నృత్యాన్ని ఒక సాధనంగా మలిచేందుకు నా వంతుగా ప్రయత్నించాను.


స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో కూచిపూడి పరిణామం ఇతివృత్తంగా ఇచ్చిన ‘పరికథ’ ప్రదర్శన నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. వీరరస ప్రధానమైన నరకాసురుడు, వృషభాసురుడు లాంటి విభిన్న పాత్రల్లో అభినయించడం నన్ను రంగస్థలంమీద మరొక మెట్టుకు చేర్చాయి. ప్రస్తుతం మానవ అక్రమరవాణాకు వ్యతిరేకంగా మరొక నృత్య రూపకల్పనకు సన్నద్ధమవుతున్నాం.

6-Navya.jpg

రంగస్థల నటిగా....

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సరోజినీనాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ మొదటి బ్యాచ్‌ మాది. థియేటర్‌ ఆర్ట్స్‌లో భిక్షుగాక మరొక ఇద్దరు అబ్బాయిలు మాత్రమే ఉంటే, డాన్స్‌ కోర్సులో చాలా మంది అమ్మాయిలున్నారు. అబిడ్స్‌లోని ‘గోల్డెన్‌ త్రెషోల్డ్‌’లోనే అప్పుడు మా కాలేజీ. గాంధీజీ నాటిన మామిడి చెట్టు కింద విద్యార్థులంతా కలసి కబుర్లాడడం... నటరాజ రామకృష్ణ, ఆరుద్ర, పీఎ్‌సఆర్‌ అప్పారావు, వెంపటి చినసత్యం, ఎంఎన్‌శర్మ, ఏఆర్‌ కృష్ణ లాంటి హేమాహేమీల బోధన... వీటన్నిటితో ఆ ప్రాంగణమంతా ఒకనాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తలపించేది. ఆ సమయంలోనే ఏఆర్‌ కృష్ణగారు ‘మృచ్ఛకటికం’ నాటకంలో వసంతసేన పాత్రకు నన్ను ఆడిషన్‌ ద్వారా ఎంపికచేశారు. అదే నాటకానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా భిక్షు పనిచేశారు. అప్పుడు ఆయన వాయిస్‌ ఎక్సర్‌సైజ్‌లతో పాటు శరీర వశ్యత (ఫ్లెక్సిబిలిటీ) కోసం థియేటర్‌ గేమ్స్‌ మాతో ఆడించారు. అది నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. నలభై రోజుల నాటకం రిహార్సల్స్‌... రంగస్థల అనుభవాన్ని ఇవ్వడమే కాదు... నా కూచిపూడి సాధన మరింత సృజనాత్మకంగా కొనసాగించడానికి తోడ్పడింది. ఆంగిక, వాచిక, సాత్వికాభినయాల్లో... ఏది ఎన్ని పాళ్లు చేయాలన్నది రంగస్థలమే నాకు నేర్పింది. తర్వాత రాంగోపాల్‌ బజాజ్‌ ‘అంథయుగ్‌’, డీఎ్‌సఎన్‌ మూర్తి ‘కోదండపాణి’తో పాటు చాట్ల శ్రీరాములు లాంటి పెద్దల నాటకాలలో కొరియోగ్రఫీ చేసే అవకాశం లభించింది. జపనీస్‌ దర్శక దిగ్గజం అకీరా కురసోవా ‘రషోమాన్‌’కు తెలుగు వెర్షన్‌గా... ‘ఒక ఒరలో నాలుగు కత్తులు’ అనే నాటకానికి భిక్షు దర్శకత్వం వహించారు. నేను కొరియోగ్రఫీకి నంది పురస్కారం అందుకున్నాను. ‘బ్రోచేవారెవరురా’ తదితర’ చిత్రాల తర్వాత సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఉద్యోగానికి నా తొలి ప్రాధాన్యత కనుక సెలెక్టివ్‌గా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను.


ఆ హీరోల పలకరింపు...

నా దగ్గర నటనలో శిక్షణ పొందిన వారిలో రామ్‌, ప్రియదర్శి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, వైష్ణవ్‌తేజ్‌, నాగశౌర్య రెగ్యులర్‌గా ఫోన్‌చేసి నన్ను పలకరిస్తుంటారు. మహే్‌షబాబు గారి అబ్బాయి గౌతమ్‌, అల్లు అర్జున్‌ గారి అమ్మాయి అర్హ కూడా చాలా ఆప్యాయంగా ఉంటారు. మహేష్‌ కూతురు సితార మా అమ్మాయి మహతి దగ్గర కూచిపూడి నేర్చుకొంటోంది. నటీనటులు, నృత్య కళాకారులు భావోద్వేగాలను సరిగ్గా పలికించాలంటే శ్వాసమీద వారికి పట్టు చాలా అవసరమని గమనించాను. ప్రదర్శనకారుల శక్తి అంతా శ్వాసలోనే దాగుంటుంది. కనుక దానిమీద మరింత శ్రద్ధపెట్టి రకరకాల టెక్నిక్స్‌తో కలపి శరీర కదలికలకు, శ్వాసను అనుసంధానం చేయడంద్వారా ‘నృత్యచేతనం’ పేరుతో ప్రత్యేకమైన శిక్షణ మాడ్యూల్‌ రూపొందించాను. అందరికీ ఒకేలా కాకుండా... వ్యక్తి జ్ఞాపకశక్తి, పరిశీలన, భావోద్వేగ స్థితిగతులు, స్వభావం, వయసు ఆధారంగా పూర్తి పర్సనలైజ్డ్‌ యాక్టింగ్‌ ట్రైనింగ్‌ ఇస్తుంటాం’’

సాంత్వన్‌

ఫొటోలు: మొహమ్మద్‌ ఆతీఫ్‌

అభినయం మీదే పరిశోధన

కూచిపూడిలో ప్రయోగాలెన్ని చేసినా అభినయం మీదే పరిశోధన చేయాలన్న కోరికతో... ‘సాత్వికాభినయం: సైకో సొమాటిక్స్‌’ అంశంపై నటరాజ రామకృష్ణగారి పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేశాను. అనారోగ్యం కారణంగా మొదట మూడేళ్లు మాత్రమే ఆరుద్ర గారు నాకు కో-గైడ్‌గా వ్యవహరించారు. మనసులో భావం జనించినప్పుడే శరీరం ద్వారా దాన్ని పలికించగలమన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా నా పీహెచ్‌డీ థీసె్‌సలో వివరించాను. మా ఇంట్లో లేని పుస్తకం ఉండేది కాదు. చందమామ, బాలమిత్ర కథలు నాలో సాహిత్య పఠనాసక్తిని కలిగించాయి. మనసు బాగులేనప్పుడు ఉర్దూ ముషాయిరాలు రాసుకుంటాను. భవిష్యత్తులో వాటిని ఒక పుస్తకంగా తీసుకొచ్చే ఆలోచన ఉంది.


ఇంకా కళ్లముందు మెదులుతోంది...

మాది పాత్రికేయ కుటుంబం. నా తొలి నృత్యప్రదర్శన 1975లో బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. మా నాన్న గుడ్లవల్లేటి రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ వ్యవస్థాపక కార్యదర్శి. ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో చాలాకాలం బ్యూరోచీ్‌ఫగా పని చేశారు. నగరంలో ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలున్నా నన్నూ మా నాన్న తీసుకెళ్లేవారు. అలా నా తొమ్మిదో ఏట చూసిన వేదాంతం సత్యనారాయణశర్మ ‘ఉషాపరిణయం’ ఈ రోజుకూ కళ్లముందు మెదులుతోంది. ఆ ప్రదర్శనలో గురువుగారు నిమిషాల్లో ఆహార్యం మార్చుకొని ఒకపాత్ర నుంచి మరొక పాత్రలోకి ఒదిగిపోవడం నన్నెంతగానో ప్రభావితం చేసింది. మా అమ్మ కమల వీణ విద్వాంసురాలు. నేను పుట్టి, పెరిగిందంతా మాసబ్‌ట్యాంక్‌లోని విజయనగర్‌ కాలనీలో! అదే కాలనీలో అమ్మ ‘శ్రీలలిత కళానిలయం’ నెలకొల్పారు. అందులో అమ్మతో పాటు మరికొందరు విద్వాంసులు వీణ, వయోలిన్‌, తబలా వంటి వాయిద్యాలలో తర్ఫీదు ఇవ్వగా, ఏలేశ్వరపు సూర్యప్రకాశశర్మ గారు కూచిపూడి నేర్పించేవారు. త్యాగరాజస్వామి ఉత్సవాల సమయంలో మా కాలనీ అంతాకోలాహలంగా ఉండేది. ఆ సాంస్కృతిక వాతావరణమే నన్ను కళారంగంలో ఇంతవరకు తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..

Updated Date - Jul 22 , 2026 | 01:57 AM