కుండీల్లో మట్టి సారవంతంగా...
ABN , Publish Date - May 13 , 2026 | 02:26 AM
ఇంట్లో, బాల్కనీలో పెంచుకునే మొక్కలు పచ్చగా ఏపుగా పెరగాలంటే కుండీల్లో మట్టి సారవంతంగా ఉండాలి. అందుకోసం వంటింటి వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం..
ఇంట్లో, బాల్కనీలో పెంచుకునే మొక్కలు పచ్చగా ఏపుగా పెరగాలంటే కుండీల్లో మట్టి సారవంతంగా ఉండాలి. అందుకోసం వంటింటి వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...
వాడేసిన టీ పొడిని మంచినీటితో కడిగి కొద్దిగా ఎండబెట్టి మట్టిలో కలపవచ్చు. ఇది మట్టిని గుల్లగా మారుస్తుంది. కుండీల్లో ఎక్కువసేపు తేమ నిలిచేలా చేస్తుంది. దీంతో మొక్కల వేర్లు బలపడతాయి.
నాలుగైదు కోడిగుడ్ల పెంకులను బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేయాలి. దీన్ని నెలకోసారి కుండీల్లోని మట్టిలో కలపాలి. దీంతో గుడ్ల పెంకుల్లో ఉండే కాల్షియం, మెగ్నీయం. పాస్ఫరస్, సల్ఫర్ లాంటి ఖనిజాలు; ఇనుము, జింక్, మాంగనీస్, రాగి లాంటి సూక్ష్మ మూలకాలు మట్టిలోకి చేరి మొక్కలు బాగా పెరగడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా టమాటా, మిర్చి, గులాబీ మొక్కలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
బియ్యం, పప్పులు కడిగిన నీటిలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీటిని పెద్ద గిన్నెలోకి సేకరించి సాయంత్రం పూట కుండీల్లో పోస్తుంటే సూక్ష్మజీవులు వృద్ధి పొంది మట్టిని సారవంతం చేస్తాయి. అంతేకాదు మట్టి పోషకాలతో నిండుతుంది కూడా.
అరటి తొక్కల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ తొక్కలను చిన్న ముక్కలుగా కోసి కుండీల్లో వేస్తే మట్టిలో ఏ ఇతర ఎరువులు కలపనవసరం లేదు. అరబకెట్ నీటిలో అయిదారు అరటి తొక్కలు వేసి నాలుగు రోజులు నానబెట్టాలి. ఆ నీటిని కుండీల్లో పోసినా మట్టి సారవంతమవుతుంది. పూలు విరివిగా పూస్తాయి.
ఒక పాత కుండీని తీసుకుని అందులో కొద్దిగా మట్టిని చల్లాలి. దానిపైన కూరగాయల తొక్కలు వేసి పైన ఇంకొంచెం మట్టిని పొరలా చల్లాలి. ఆపైన పండ్ల తొక్కలు వేసి మరల మట్టిని చల్లాలి. ఇలా కుండీ నిండే వరకు చేస్తూ ఉండాలి. నెల రోజుల తరువాత కుండీలో సారవంతమైన మట్టి తయారవుతుంది. దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఇతర కుండీల్లో చల్లితే మొక్కలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News