వారే నా తొలి ప్రేక్షకులు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:13 AM
సినీ ప్రపంచంలో తారలు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ, కొందరు మాత్రమే తన నటనతో, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి...
సినీ ప్రపంచంలో తారలు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ, కొందరు మాత్రమే తన నటనతో, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఒకరు. ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో ‘సాక్షి’గా మెరిసినా, ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు వారిని పలకరించినా, ‘కబీర్‌సింగ్’లో ‘ప్రీతి’గా కన్నీరు పెట్టించినా.. ప్రతి పాత్రకు ఆమె ప్రాణం పోసింది. కియారా తాజాగా పంచుకున్న విశేషాలు మీ కోసం.
ప్రపంచంతో పోరాడే ధైర్యం
ఇటీవల ఒక ప్రముఖ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాతృత్వం గురించి అడిగినప్పుడు ఆమె ఎంతో ఉద్వేగంగా స్పందించింది. ‘‘సారాయా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఒక పులి (టైగ్రెస్)లా మారిపోయాను. గతంలో నేను దేనికైనా సర్దుకుపోయేదాన్ని, కానీ ఇప్పుడు నా బిడ్డ విషయంలో చాలా రక్షణాత్మకంగా ఉంటున్నాను. తన కోసం ప్రపంచంతో పోరాడే ధైర్యం నాలో వచ్చింది. అమ్మ అనే పిలుపు ఇచ్చే శక్తి సామాన్యమైనది కాదు’’ అని చెప్పుకొచ్చింది.
పేరు వెనుక పరమార్థం
తన కుమార్తెకు ‘సారాయా’ అని పేరు పెట్టడం వెనుకున్న ఆసక్తికరమైన విషయ్నాన్ని కూడా కియారా పంచుకుంది. ‘‘సారాయా’ అంటే ‘రాకుమారి’, లేదా ‘నోబుల్ లేడీ’ అని అర్థం. మా జీవితాల్లోకి తను వచ్చిన క్షణం నుంచి ప్రతీది ఎంతో సానుకూలంగా మారింది. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లగానే ఆ చిన్నారి చిరునవ్వు చూస్తే రోజంతా ఉన్న అలసట మాయమవుతుంది’’ అని మురిసిపోయింది. బిడ్డను నిద్రపుచ్చడం, ఆమెతో ఆడుకోవడం వంటి చిన్నచిన్న పనుల్లోనే తనకు అసలైన ఆనందం దొరుకుతుందని చెప్పింది.
టీచర్ నుంచి స్టార్ హీరోయిన్ దాకా
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కియారా సినిమాల్లోకి రాకముందు తన తల్లి నడిపే ప్లే స్కూల్‌లో టీచర్‌గా పనిచేసింది. ‘‘ఆ చిన్నారులే నా తొలి ప్రేక్షకులు’’ అని ఆమె నవ్వుతూ గుర్తుచేసుకుంది. ‘‘డైపర్ మార్చడం నుంచి వారికి రైమ్స్ నేర్పించడం వరకు ప్రతీది నాకు ముందే తెలుసు. బహుశా ఆ అనుభవమే ఇప్పుడు నాకు నా బిడ్డను చూసుకోవడంలో ఎంతో సాయపడుతోంది’’ అని వివరించింది. చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండే కియారా సినిమాలపై ఉన్న మక్కువతో తన తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలియా అద్వానీగా ఉన్న తన పేరును సల్మాన్‌ఖాన్ సూచన మేరకు ‘కియారా’గా మార్చుకుంది.
సిద్ధార్థ్‌తో బంధం
సిద్ధార్థ్ మల్హోత్రాతో తన వైవాహిక జీవితం గురించి చెబుతూ ‘‘సిద్ధార్థ్ ఒక అద్భుతమైన లైఫ్ పార్ట్‌నర్. ఒకే వృత్తిలో ఉండటం వల్ల మా మధ్య అవగాహన ఎక్కువ. తను నాకు భర్త మాత్రమే కాదు, నా కెరీర్ ఎదుగుదలలో ప్రోత్సహించే మంచి స్నేహితుడు కూడా’’ అని ప్రశంసలు కురిపించింది. ‘‘పెళ్లయ్యాక తొలిసారి ఒక ఇంటిని స్వయంగా నిర్వహించడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. వంటగదిలో ప్రయోగాలు చేయడం నుంచి ఇంటి అలంకరణ వరకు ప్రతీది సొంతంగా చూసుకోవడం వల్ల జీవితం పట్ల బాధ్యత పెరిగింది. మా అమ్మ ఇవన్నీ ఎలా చేసేదో అని ఇప్పుడు అనిపిస్తుంటుంది’’ అని తన వ్యక్తిగత జీవితంలోని మార్పులను వివరించింది. తండ్రిగా సిద్ధార్థ్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడని, ఇద్దరం కలిసి సారాయా ఆలనాపాలనా చూసుకోవడం ఒక మధురమైన అనుభవమని చెప్పుకొచ్చింది.
‘టాక్సిక్’తో సరికొత్త సవాల్
తెలుగు ప్రేక్షకులతో కియారాకు ఉన్న అనుబంధం విడదీయలేనది. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలతో ఆమె టాలీవుడ్ హోమ్లీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె కన్నడ స్టార్ యశ్ సరసన ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తోంది. ‘‘టాక్సిక్ నా కెరీర్‌లో విభిన్నమైన సినిమా కాబోతోంది. యశ్‌లాంటి ప్రతిభావంతుడితో పనిచేయడం, గీతూ మోహన్‌దాస్ విజన్‌లో భాగం కావడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది’’ అని కియారా హింట్ ఇచ్చింది.

ఫిట్‌నెస్.. లైఫ్‌స్టైల్
తల్లి అయిన తర్వాత కూడా ఎంతో ఫిట్‌గా కనిపిస్తున్న కియారా తన సీక్రెట్‌ను బయటపెట్టింది. ‘‘నేను కఠినమైన డైట్లను నమ్మను. ఇంట్లో వండిన స్వచ్ఛమైన భోజనం తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగా చేయడం వల్లే నేను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం నాకు ఎంతో సాయపడుతోంది’’ అని చెప్పింది. ‘మెట్‌గాలా’ వంటి అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తున్న ప్రయోగాలు కియారాను గ్లోబల్ ఐకాన్‌గా నిలబెట్టాయి.
క్వాలిటీయే ముఖ్యం
కియారా ప్రస్తుతం తన కెరీర్‌ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లో ప్రాధాన్యతలు మారడం వల్లో ఆమె కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నా, అది ఆమె కెరీర్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ‘‘ఇప్పుడు నా సమయం చాలా విలువైనది. ఇంటి దగ్గర చిన్నారిని వదిలి షూటింగ్‌కు వస్తున్నానంటే, నేను చేసే సినిమా అంతకంటే గొప్పగా ఉండాలి. అందుకే ఇప్పుడు మరింత క్వాలిటీ ఉండే కథలే ఎంచుకుంటున్నాను. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటిగా నన్ను నేను సవాలు చేసుకునే పాత్రలు చేయాలని ఉంది’’ అని మనసులోని మాటను బయటపెట్టింది కియారా.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు