Share News

కూలీ బిడ్డ... కలెక్టరైంది

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:06 AM

విద్యుత్‌ సౌకర్యం లేని చిన్న గుడారం లాంటి ఇల్లు... వేల ఏళ్ల సామాజిక వెనుకబాటుతనం.. వేధించే పేదరికం... దినసరి కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు..

కూలీ బిడ్డ... కలెక్టరైంది

విద్యుత్‌ సౌకర్యం లేని చిన్న గుడారం లాంటి ఇల్లు... వేల ఏళ్ల సామాజిక వెనుకబాటుతనం.. వేధించే పేదరికం... దినసరి కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు.. వీటన్నింటినీ అధిగమించి కేరళంలోనే మొట్టమొదటి గిరిజన ఐఏఎస్‌ అధికారిగా, కలెక్టర్‌గా రికార్డు సృష్టించారు శ్రీధన్య సురేశ్‌. ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళ్లేందుకు చార్జీలు కూడా లేని క్లిష్ట పరిస్థితి నుంచి నేడు ఒక జిల్లాను శాసించే స్థాయికి ఎదిగిన శ్రీధన్య ప్రయాణం ఇదీ...

‘‘ఒక మనిషి ప్రయాణాన్ని కొలవడానికి ఆమె ఎక్కడికి చేరింది?.. అనేది మాత్రమే చూస్తే సరిపోదు. ఆమె ఎక్కడి నుంచి బయలుదేరింది? అనేది కూడా చూడాలి. ఈ రోజు నా పేరుకు ముందు ‘ఐఏఎస్‌’ అనే మూడక్షరాల గర్వకారణమైన హోదా చేరి ఉండొచ్చు. కానీ ఈ హోదా వెనుక దశాబ్దాల కన్నీళ్లు.. ఆకలి కేకలు.. కటిక పేదరికం.. సామాజిక అవమానాలు.. వీటన్నింటినీ దాటుకుని వచ్చిన అపరిమితమైన ఆత్మవిశ్వాసం ఉన్నాయి. ఈ నా ఐఏఎస్‌ ప్రయాణం కేవలం నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. తరతరాలుగా అవకాశాలకు దూరమైన ఒక సమాజపు ఆశాకిరణం.

గుడారపు చీకట్లలో బాల్యం

కేరళంలోని వయనాడ్‌ జిల్లా సుల్తాన్‌ బతేరి సమీపంలో ఉన్న ‘ఇడుక్కల్‌’ అనే చిన్న గిరిజన గూడెంలో నేను పుట్టాను. మేము ‘కురిచియా’ అనే గిరిజన తెగకు చెందిన వాళ్లం. మా ఊరిలో సరైన రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. రాత్రిపూట కనీస వెలుగునిచ్చే దీపం కూడా మా ఇంట్లో లేకపోవడం నా చిన్నతనపు జ్ఞాపకం. నా తండ్రి సురేశ్‌, తల్లి కమల. ఇద్దరూ రోజంతా ఇతరుల పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప మా పొయ్యి వెలిగేది కాదు. చాలా రోజులు పూటగడవడమే కష్టంగా ఉండేది. నా తోబుట్టువులు, నేను తీవ్రమైన అభద్రతాభావం మధ్య పెరిగాం. కానీ, ఎంత పేదరికం ఉన్నప్పటికీ నా తల్లిదండ్రులు మా చదువును ఎప్పుడూ ఆపలేదు. ‘‘మేం కూలీలుగా మిగిలిపోయాం, కానీ మీరు చదువుకుని గొప్పవాళ్లు కావాలి’’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అదే నా మనసులో బలంగా నాటుకుపోయింది.


అడ్డంకులను దాటి...

మా గ్రామంలో ఉన్న గిరిజన పాఠశాలలో నా ప్రాథమిక విద్యసాగింది. రోజూ 4 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేదాన్ని. సరైన పుస్తకాలు, దుస్తులు లేకపోయినా నా శ్రద్ధ అంతా చదువుపైనే ఉండేది. దేవుడు మాకు సంపద ఇవ్వకపోయినా, చదివింది గుర్తుంచుకునే పదునైన మెదడును ఇచ్చాడని నేను నమ్మాను. ఆ తర్వాత కోజికోడ్‌లోని ప్రసిద్ధ సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో జువాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. అనంతరం మలప్పురం క్యాంప్‌సలోని కాలికట్‌ విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పట్టా పుచ్చుకున్నాను. డిగ్రీ, పీజీ చదివే సమయంలో నా తోటి విద్యార్థుల ఆర్థిక స్థోమతను చూసి కొన్నిసార్లు నాకు బాధగా అనిపించేది. కానీ నా కుటుంబ ఆర్థిక పరిస్థితి నాకు నిరంతరం ఒక హెచ్చరికలా కనిపించేది.

జీవితాన్ని మలుపుతిప్పిన కలెక్టర్‌

పీజీ పూర్తయ్యాక కేరళ గిరిజన సంక్షేమశాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ‘షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ ప్రమోటర్‌’గా నాకు ఉద్యోగం వచ్చింది. అలాగే, గిరిజన విద్యార్థుల హాస్టల్‌లో వార్డెన్‌గా కూడా పనిచేశాను. ఈ ఉద్యోగమే నా జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సమయంలో వయనాడ్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీరామ్‌ సాంబశివరావు అనే ఐఏఎస్‌ అధికారి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ప్రసంగం, ఆయన వ్యక్తిత్వం, సమాజంపై ఆయన ప్రభావం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఒక జిల్లా కలెక్టర్‌ ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపగలరో నేను కళ్లారా చూశాను. ‘‘నేను కూడా ఎందుకు ఐఏఎస్‌ కాకూడదు?’’ అనే ఆలోచన అప్పుడు నా మనసులో మొదటిసారి మొలకెత్తింది.

ఐఏఎస్‌ వైపు అడుగులు

నేను కలెక్టర్‌ వద్దకు వెళ్లి నా మనసులోని మాట చెప్పాను. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. ‘నీలో స్పార్క్‌ ఉంది శ్రీధన్య, నువ్వు తప్పక సాధిస్తావు’ అని నాలో ఉత్సాహం నింపారు. ఆయన మాటలు నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాయి. అయితే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ప్రిపరేషన్‌ అనేది అంత సులువైన విషయం కాదు. దానికి నాణ్యమైన శిక్షణ, పుస్తకాలు, సమయం, డబ్బు చాలా అవసరం. నా దగ్గర ఇవేవీ లేవు. దీంతో తిరువనంతపురంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీలో చేరాను. మొదటి రెండు ప్రయత్నాల్లో నాకు అనుభవం, పాఠాలు మాత్రమే మిగిలాయి. అయినా నిరాశ పడలేదు. నా బలహీనతను అధిగమిస్తూ గంటల తరబడి గ్రంథాలయంలో కూర్చుని తీవ్రంగా శ్రమించాను. గిరిజన సంస్కృతి, వారి సమస్యలు నాకు బాగా తెలుసు కాబట్టి ఆ పరిజ్ఞానాన్ని పరీక్షల్లో ప్రతిబింబించేలా రాశాను.


ఢిల్లీ ప్రయాణం

మూడో ప్రయత్నంలో నేను అనుకున్న ఫలితం వచ్చింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు పూర్తిచేసి ఇంటర్వ్యూకి అర్హత సాధించాను. ఇంటర్వ్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సి ఉంది. కానీ నా దగ్గర ఢిల్లీ వెళ్లడానికి, అక్కడ రెండురోజులు ఉండటానికి, మంచి బట్టలు కొనడానికి డబ్బులు లేవు. అప్పుడు నా వద్ద ఉన్నది వంద రూపాయలు మాత్రమే. ఆ క్షణంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘ఇంత దగ్గరకు వచ్చాక డబ్బులు లేక నేను వెనక్కి తగ్గాలా?’’ అని విలపించాను. ఆ సమయంలో నా మిత్రులు, శ్రేయోభిలాషులు నాకు అండగా నిలిచారు. నా పరిస్థితి చూసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ. 40 వేలు పోగేసి నా చేతిలో పెట్టారు. ఆ డబ్బుతో నేను ఢిల్లీ రైలు ఎక్కాను. రైలు ప్రయాణంలో ప్రతిక్షణం నా కళ్లముందు నా తల్లిదండ్రుల కష్టం, మిత్రుల నమ్మకం, నా జాతి ఆకాంక్షలు మాత్రమే కనిపిస్తుండేవి. ఢిల్లీలో ఇంటర్వ్యూ బోర్డు ఎదుట నిలబడినప్పుడు ఎలాంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇచ్చాను.’’

ప్రజాసేవే పరమావధిగా..

2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా నా ప్రయాణం ప్రారంభమైంది. కోజికోడ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, పెరింతల్మన్న సబ్‌ కలెక్టర్‌గా, ఆ తర్వాత కేరళ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించాను. కాసర్‌గోడ్‌ జిల్లా కలెక్టర్‌గా సేవలు అందించే అవకాశం కూడా నాకు లభించింది. ప్రతి పదవిలోనూ పేదలు, గిరిజనులు, మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాను. పాలనలో పారదర్శకత, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే నా లక్ష్యం.

చరిత్ర సృష్టించిన క్షణం

2018 యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో 410వ ర్యాంకు వచ్చింది. కేరళం చరిత్రలోనే ఐఏఎస్‌ సాధించిన మొట్టమొదటి గిరిజన మహిళగా నేను నిలిచాను. ఆ వార్త వినగానే కళ్ల నుంచి నీళ్లు ఆగలేదు. నా తల్లిదండ్రులు పడిన కష్టానికి సార్థకత లభించింది. నా ఊరు.. నా వయనాడ్‌ జిల్లా, రాష్ట్రం పండుగ చేసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నన్ను ప్రత్యేకంగా అభినందించారు.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 05:06 AM