ఎల్లలు దాటిన సేవా నిరతి
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:01 AM
‘‘తోటి మనుషులకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం ఉన్న వృత్తి... నర్స్. అందుకే దాన్ని ఎంచుకున్నాను అంటారు అజిమోల్ ప్రదీప్. కేరళంకు చెందిన ఈ 46 ఏళ్ళ మహిళ బ్రిటన్‌లో...
‘‘తోటి మనుషులకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం ఉన్న వృత్తి... నర్స్. అందుకే దాన్ని ఎంచుకున్నాను అంటారు అజిమోల్ ప్రదీప్. కేరళంకు చెందిన ఈ 46 ఏళ్ళ మహిళ బ్రిటన్‌లో నర్స్‌గా, సామాజిక కార్యకర్తగా... అవయవాలు, స్టెమ్ సెల్స్ దానాల దిశగా వేలాదిమందిని నడిపించారు. ఆసియన్ రోగులకు ఆశాజ్యోతిగా నిలిచి, ఈ ఏడాది రెండున్నర లక్షల డాలర్ల ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు’ను అందుకున్న అజిమోన్ ప్రయాణం ఇది.
‘‘మాది కేరళం రాష్ట్రంలోని కొట్టాయంలో... దిగువ మధ్య తరగతి కుటుంబం. నా బాల్యం, చదువు ఆర్థికపరమైన ఒడుదొడుకుల మధ్య సాగింది. మేం నలుగురు అక్కచెల్లెళ్ళం. నేను రెండోదాన్ని. బాగా చదువుకొని, నా కుటుంబానికి అండగా నిలవాలని అనుకొనేదాన్ని. ఇతరులకు సేవ చేసే అవకాశం, అదృష్టం ఉన్న వృత్తిగా నర్సింగ్ నాకు ఇష్టం. దానికి అనుగుణంగా... బెంగళూరులో నర్సింగ్ డిప్లమా, డయాలసి్‌సకు సంబంధించిన ఒక కోర్సు చేశాను. ఒక ఆసుపత్రిలో కొన్నాళ్ళు పని చేశాను. ఈలోగా బ్రిటన్‌లో అవకాశం వచ్చింది. 2001లో.. మొదటిసారిగా మన దేశాన్ని వదిలి... విదేశీ గడ్డ మీద అడుగుపెట్టాను.
వివక్ష అనుకున్నారు...
బ్రిటన్‌లోని మాంఛెస్టర్‌లో... నేషనల్ హెల్త్ సర్వీ్‌సలో పని చేస్తూనే డిగ్రీ, మాస్టర్స్ కోర్సులు చేశాను. ఆ తరువాత ట్రాన్స్‌ప్లాంటేషన్ కేర్ విభాగానికి మారాను. అదే నా జీవితాన్ని కొత్త దిశలో నడిపించింది. కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు మా విభాగానికి ఎక్కువగా వచ్చేవారు. దక్షిణాసియాకి చెందిన ఒక వ్యక్తి నన్ను కలిశారు. ‘‘మూడేళ్ళ నుంచి కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నాను. నా తరువాత నమోదు చేయించుకున్న ఎందరికో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిపోయింది. నాకు ఎందుకు చెయ్యట్లేదు?’’ అని అడిగారు. తను శ్వేతజాతీయుడు కాదు కాబట్టి తన పట్ల వివక్ష చూపిస్తున్నారనే భావన ఆ మాటల్లో నాకు కనిపించింది. నా పై అధికారులతో మాట్లాడిన తరువాత... అది కణజాలం మ్యాచ్ కావడానికి సంబంధించిన సమస్య అని నాకు అర్థమయింది. రోగి ఏ జాతి నేపథ్యానికి చెందిన వ్యక్తో... అదే నేపథ్యం చెందినవారి కణజాలం మ్యాచ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అటువంటి దాత కోసం మూడేళ్ళుగా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదనీ, ఇదే సమస్యను ఆసియన్ నేపథ్యం కలిగిన చాలామంది ట్రాన్స్‌ప్లాంట్ రోగులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం... పిహెచ్‌డి కూడా చేశాను. మరోవైపు ఆసియన్లలో అవయవదానంపై అవగాహన కల్పించడానికి నావంతు ప్రయత్నాలు మొదలుపెట్టాను.
దానంపై అవగాహన కోసం...
నా స్వచ్ఛంద సేవ గురించి, రిసెర్చ్ గురించి కేరళంకు చెందిన ఫాదర్ డేవిస్ ఛైర్మెల్‌కు తెలిసింది. ఆయన 2012లో నెల రోజుల పాటు బ్రిటన్‌లో ఉండి... అవయవ దానం, మార్పిడి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఆసియన్ మూలాలున్న పిల్లలు... సరిపడే దాతలు లేక మరణిస్తున్నారని తెలుసుకున్న ఆయన బాధపడ్డారు. అవయవాలు, స్టెమ్ సెల్స్ దానాన్ని ప్రోత్సహించడానికి కలిసి ఏదైనా చెయ్యాలనుకున్నాం. 2014లో ‘ఉపాహార్’ అనే సంస్థను ఏర్పాటు చేశాం. మరణించినవారి అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేసేలా ప్రచారం చేపట్టాం. అలాగే స్టెమ్ సెల్ దానం కూడా. స్టెమ్ సెల్స్‌ను ఒక వ్యక్తి జీవించి ఉండగానే దానం చెయ్యొచ్చు. అవి దాదాపు 90 రోజుల్లో సహజసిద్ధంగా రీజనరేట్ అవుతాయి. ఈ దానం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి అంశాల గురించి ఆసియన్లలో అవగాహన కలిగించడానికి అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. సామాజికమైన భయాలు, సంకోచాలు, మతపరమైన విశ్వాసాలు... అవయవదానానికి అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో... వారి సందేహాలను నివృత్తి చేశాం. అపోహలను పోగొట్టాం. క్రమంగా వారి విశ్వాసాన్ని సంపాదించాం.

మాటలకందని సంతృప్తి
‘ఉపాహార్’ ఇప్పుడు బ్రిటన్ వ్యాప్తంగా పని చేస్తున్న నెట్‌వర్క్. వందమందికి పైగా వాలంటీర్లు దీనికి సేవలు అందిస్తున్నారు. తమ మరణానంతరం అవయవాలు దానం చేయడానికి పదివేల మందికి పైగా దాతలు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. గత పదకొండేళ్ళలో కొన్ని వందలమంది ట్రాన్స్‌ప్లాంటేషన్ల ద్వారా విజయవంతంగా కొత్త జీవితాలను సాగిస్తున్నారు. అది వారికే కాదు... వారి కుటుంబాలకు కూడా పునర్జన్మ. అవయవమార్పిడి జరిగి, ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్న పిల్లలను చూసినప్పుడు కలిగే సంతృప్తిని మాటల్లో చెప్పలేను. ప్రస్తుతం నేను లండన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్‌లో సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్నాను. సాల్ఫోర్డ్ యూనివర్సిటీలో గౌరవ సీనియర్ లెక్చరర్‌గా వ్యవహరిస్తున్నాను. అవయవ మార్పిడి, స్టెమ్ సెల్ దానాలకు సంబంధించి నేను చేసిన కృషిని గుర్తిస్తూ.... ఈ ఏడాది ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు’ను నాకు బహూకరించారు. దానితోపాటు రెండున్నర లక్షల డాలర్ల నగదు బహుమతి కూడా ఇచ్చారు. ఈ అవార్డు నాకు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా కలలా అనిపిస్తోంది. దీన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. బహుమతిగా అందుకున్న మొత్తాన్ని సామాజిక కార్యక్రమాల కోసం వినియోగిద్దామనుకుంటున్నాను.’’
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు