స్ఫూర్తి శిఖరం
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:11 AM
‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ కేట్ మిడిల్టన్... క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు. ఆ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతో శ్రమతో కూడిన ‘నేషనల్ త్రీ పీక్స్ ఛాలెంజ్’ను స్వీకరించి....
న్యూస్‌మేకర్
‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ కేట్ మిడిల్టన్... క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు. ఆ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతో శ్రమతో కూడిన ‘నేషనల్ త్రీ పీక్స్ ఛాలెంజ్’ను స్వీకరించి... పట్టుదలతో శిఖరాల్ని పాదాక్రాంతం చేసుకున్నారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే తపనే తనను నడిపించిందంటున్న కేట్... క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తిని, ఆశను నింపుతున్నారు.
రెండేళ్ళ క్రితం తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు బ్రిటన్ యువరాజు విలియమ్స్ భార్య... ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ కేట్ మిడిల్టన్ చెప్పినప్పుడు ప్రపంచం విస్తుపోయింది. సామాజిక కార్యక్రమాల్లో, క్రీడా వేడుకల్లో చురుగ్గా పాల్గొం టూ, సరికొత్త ఫ్యాషన్లతో ఆకర్షించే కేట్ ఆ తరువాత కొన్నాళ్ళు ప్రజా జీవితానికి దూరంగా గడిపారు. పరిస్థితు ల్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ వ్యాధిపై గెలిచారు. ఇప్పుడు క్యాన్సర్‌పై అవగాహన కల్పించానికి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఒక ఛారిటీ నిమిత్తం ‘నేషనల్ త్రీ పీక్స్ ఛాలెంజ్’ను స్వీకరించారు.
ఏమిటీ సవాల్?
నేషనల్ త్రీ పీక్స్ ఛాలెంజ్... ఇంగ్లండ్‌లోని స్కాఫెల్ పీక్, వేల్స్ లోని స్కౌడౌన్, స్కాట్లాండ్‌లోని బెన్ నేవిస్ శిఖరాలను 24 గంటల్లో అధిరోహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా 37 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. రాయల్ మార్స్‌డిన్ క్యాన్సర్ ఛారిటీ’ కోసం విరాళాలు పోగు చేయడానికి కేట్ ఇటీవల ఈ సవాల్ స్వీకరించి, విజయవంతంగా పూర్తి చేశారు. ‘‘ఇలాంటి సవాల్‌ను ఎందుకు స్వీకరించావని నన్ను చాలామంది అడిగారు. ఇది చాలా కష్టమైన ప్రయాణమని నాకు తెలుసు. ఇక్కడివరకూ చేరుకున్నందుకు, ఈ పర్వతాల్ని అధిరోహించడానికి తగినంత శక్తి నాకు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వడం, క్యాన్సర్ నివారణ కోసం జరుగుతున్న అద్భుతమైన కృషిని గుర్తించడం... ఇవి అన్నిటికన్నా ముఖ్యం. దీని ప్రధాన లక్ష్యం అదే. ఈ ప్రయాణంలో క్యాన్సర్‌ను దాటి ముందుకు సాగుతున్న అద్భుతమైన వ్యక్తులు కొందరిని కలుసుకోగలిగాను’’ అని సవాల్‌ను ముగించిన అనంతరం ఒక వీడియో సందేశంలో కేట్ తెలిపారు.
జీవితాన్వేషణకు ఒక అవకాశం...
నేను ఈ సవాల్‌ను కేవలం ఒక శారీరకమైన ప్రయత్నంగా మాత్రమే కాదు... వ్యాధి నిర్ధారణ తర్వాత జీవితాన్ని అన్వేషించడానికి, సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వడానికి ఒక అవకాశంగా స్వీకరించాను. తీవ్రమైన ఈ వ్యాధి కలిగించే గాఢమైన ప్రభావం గురించి, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని అనుకుంటున్నాను. క్యాన్సర్ వచ్చిన తరువాత ఎదురయ్యే పరిస్థితులు శారీరకంగా, భావోద్వేగపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనలో ప్రతి భాగాన్నీ పరీక్షిస్తాయి. అవి విసిరే సవాళ్లు కుటుంబాలు, స్నేహాలు, చేసే పనితో పాటు మనం ఒంటరిగా ఆలోచనలతో గడపాలనుకున్న నిశ్శబ్ద క్షణాల వరకూ విస్తరిస్తాయి. క్యాన్సర్ శరీరాన్నే కాదు, ఆలోచనా ధోరణినీ, అనుభూతి చెందే తీరునీ మార్చేస్తుంది. జీవితంలో ప్రతి అంశాన్నీ అది తీవ్రమైన ప్రభావానికి గురి చేస్తుంది. ఈ సంగతి నాకు వ్యక్తిగతంగా తెలుసు. క్యాన్సర్ చికిత్స సమయంలో, ఆ తరువాత సాగించే ప్రయాణానికి కేవలం మందులు మాత్రమే సరిపోవు. జీవన విధానంలో సమతుల్యత అవసరం. అలాగే ధైర్యం కావాలి. అంటే పరిసరాలు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ స్థిరత్వంతో... వర్తమానంలోనే ఎలా జీవించాలో తెలుసుకోవాలి’’ అంటూ ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేశారు.
సమాజంతో మమేకం
బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీలో ఉన్న రీడింగ్ అనే పట్టణంలో 1982 జనవరి తొమ్మిదిన కేట్ జన్మించారు. ఆమె పూర్తి పేరు కేథరిన్ ఎలిజబెత్ మిడిల్టన్. కేట్ తల్లిదండ్రులు బ్రిటిష్ ఎయిర్‌వే్‌సలో చిరుద్యోగులు. ఆమెకు రెండేళ్ళ వయసులో ఆమె కుటుంబం జోర్డాన్‌కు వెళ్ళింది. ఆమె ప్రాథమిక విద్య అక్కడే ఆరంభమయింది. మరో రెండేళ్ళకు మళ్ళీ ఆ కుటుంబం బెర్క్‌షైర్‌కు తిరిగి వచ్చింది. చదువులో కేట్ చాలా చురుగ్గా ఉండేవారు. బాలికల ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్’ స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూ్‌సలో సైకాలజీ, ఆర్ట్ హిస్టరీ అభ్యసించారు. ఆ సమయంలో పార్ట్‌టైమ్ వెయిట్రె్‌సగా పని చేశారు. అప్పట్లోనే సామాజిక సేవా కార్యక్రమాల్లో, విరాళాల సేకరణలో చురుగ్గా పాల్గొనేవారు. విద్యార్ధిగా ఉండగానే బ్రిటన్ యువరాజు విలియమ్స్‌తో ఆమెకు పరిచయమయింది. విభేదాలతో కొద్దికాలం విడిపోయినా... మళ్ళీ కలిశారు. 2011లో వారి వివాహం జరిగింది. ఆ వివాహాన్ని ప్రత్యక్షంగా 26 లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా వివిధ మాధ్యమాల్లో దాదాపు 30 కోట్ల మంది తిలకించారని అంచనా. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు.
మధ్యతరగతి మనసు
బ్రిటన్ యువరాజు భార్యగా... ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ స్థాయికి చేరుకున్నప్పటికీ... కేట్ మనసులో ఆలోచనలన్నీ సాధారణ మధ్య తరగతి మహిళలాగానే ఉంటాయి. వివాహం తరువాత తన సేవా కార్యక్రమాలను ఆమె మరింత విస్తృతపరిచారు. యునిసె్‌ఫ సహా పలు సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ప్రధానంగా పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు, క్రీడాభివృద్ధికి, డ్రగ్స్ నిర్మూలనకు, కళలను ప్రోత్సహించడానికి, పర్యావరణ పరిరక్షణకు ఆమె నడుపుతున్న, భాగంగా ఉన్న ఛారిటబుల్ ట్రస్టులు, సంస్థలు పని చేస్తున్నాయి. విరాళాల సేకరణ, పౌరులను భాగస్వాములను చేసి, వారితో మమేకం కావడంలో ఆమె చొరవను ‘కేట్ ఎఫెక్ట్’గా పత్రికలు అభివర్ణించాయి. ప్రతి సంవత్సరం వింబుల్డన్ సహా పలు క్రీడా పోటీలకు ఆమె హాజరవుతూ ఉంటారు. పుస్తక పఠనం, ఫొటోగ్రఫీ ప్రధాన అభిరుచులు. సరికొత్త ఫ్యాషన్లంటే మక్కువ. ఫ్యాషన్ ఐకాన్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!