Share News

ఆరోగ్యానికి.. ఉపాధికి ‘కారుణ్య’ వారధి

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:17 AM

ఆరోగ్యకరమైన జీవనోపాధి... ఇది కారుణ్య గుణవతి నినాదం. బీడీ కార్మికులుగా ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని పణంగా పెడుతున్న మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి అందించడానికి ఆమె పాటుపడుతున్నారు. ఈ క్రమంలో...

ఆరోగ్యానికి.. ఉపాధికి ‘కారుణ్య’ వారధి

ఆరోగ్యకరమైన జీవనోపాధి... ఇది కారుణ్య గుణవతి నినాదం. బీడీ కార్మికులుగా ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని పణంగా పెడుతున్న మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి అందించడానికి ఆమె పాటుపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వందల మంది మహిళలకు కొత్త జీవితానికి దారులు వేసిన కారుణ్య కథ ఆమె మాటల్లోనే...

‘‘తమిళనాడులోని తెన్‌కాశి, తిరునల్వేలి ప్రాంతం మన దేశంలో ప్రధానమైన బీడీ తయారీ కేంద్రాల్లో ఒకటి. ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలోని మహిళలు బీడీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారి సంఖ్య సుమారు అయిదు లక్షలకు పైనే ఉంటుందని 2024లో నేను నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. వీరు ఇంట్లో కూర్చొని, రోజూ పన్నెండు గంటల సేపు... కొన్నిసార్లు విరామం కూడా తీసుకోకుండా పని చేస్తారు. వెయ్యి బీడీలు చుట్టి, ఫ్యాక్టరీలకు అందిస్తే... 230 రూపాయలు ఇస్తారు. చాలా కుటుంబాలకు అది ప్రధానమైన జీవనాధారం. అయితే... గంటలకు గంటలు నేల మీద కూర్చొని, నడుమును వంచి, వేళ్ళను త్వరగా కదులుస్తూ పని చెయ్యాలి. దీనివల్ల నడుము నొప్పి, కీళ్ళ నొప్పి లాంటి సమస్యలు ప్రతి ఒక్కరిలోనూ సర్వసాధారణం. తన దగ్గరకు వచ్చే రోగుల్లో ఇరవై శాతం మందికి పైగా బీడీ కార్మికులే ఉంటారని ఒక నేత్ర వైద్యురాలు నాకు చెప్పారు. అలాగే ఈ కార్మికుల్లో 83 శాతం మంది శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో వారు అర్థంతరంగా పని మానేయాల్సి వస్తోంది. ఆ తరువాత ఆదాయం లేక, అనారోగ్యానికి చికిత్స చేయించుకొనే స్థోమత లేక దుర్భరంగా జీవితాలు సాగిస్తున్నారు. అలాంటి వారిలో మా పిన్ని కూడా ఒకరు.

అదే లక్ష్యంగా...

తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలోని పెరుమాళ్‌పట్టి నా స్వస్థలం. మా నాన్న వెల్డర్‌, అమ్మ ఒక చిన్న మెస్‌ నడుపుతోంది. ఎన్ని ఇబ్బందులున్నా పట్టుదలగా చదువుకున్నాను. మా కుటుంబంలో నేనే తొలి గ్రాడ్యుయేట్‌ని. ఎంబీఏతోపాటు గ్రాఫిక్‌ డిజైనింగ్‌ చేశాను. ప్రస్తుతం... సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షి్‌పలో పీహెచ్‌డీచేస్తున్నాను. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. ఎందుకంటే... హైస్కూల్‌ చదువు మధ్యలో మానేసి, బీడీ కార్మికులుగా... బతుకుతెరువుకోసం ప్రాణాలను పణంగా పెట్టి, అనారోగ్యాలతో మంచం పట్టినవారిని చూస్తూ పెరిగాను. మా కుటుంబంలో... మా పిన్ని క్షయవ్యాధితో జీవచ్ఛవంలా మారిపోయింది. ఆర్థికంగా మా పరిస్థితి అంతంతమాత్రం కావడంతో... ఆమె కోలుకోవడానికి తగినంత సాయం చెయ్యలేకపోయాం. అయితే... అలాంటి దుస్థితి ఇంకెవరికీ రాకుండా ఏం చెయ్యగలననే ఆలోచనలు నన్ను నిత్యం వెంటాడుతూ వచ్చాయి. చదువుకుంటూనే ఆ దిశగా పని చేయడం ప్రారంభించాను. ఈ క్రమంలో నేను నిర్వహించిన సర్వేలో... కుటుంబాలను పోషించుకోవడానికే ఈ విష వలయంలో చిక్కుకున్నామని దాదాపు అందరూ చెప్పారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తే బీడీలు చుట్టే పని మానెయ్యడానికి సిద్ధమని 93 శాతం మంది అన్నారు. వీరికి ఆరోగ్యకరమైన ఉపాధిని చూపించాలనే సంకల్పం నాలో బలపడింది. అదే ఏకైక లక్ష్యంగా ‘కొట్రావై’ అనే సంస్థను ప్రారంభించాను.


అయిదు ఉత్పత్తి యూనిట్లు...

బీడీ కార్మికులైన మహిళలతో వివిధ ఉత్పత్తులు తయారు చేయించి, వాటిని విక్రయించడానికి ఒక ప్లాట్‌ఫారమ్‌ ఏర్పాటు చేయాలనేది నా ప్రాథమిక ఆలోచన. కానీ విక్రయానికి తగిన ఉత్పత్తుల తయారీ కోసం శిక్షణకు కనీసం ఆరేడు నెలలు అవసరమవుతాయి. ఆ సమయంలో వారికి ఆర్థికంగా మద్దతు అవసరమవుతుంది. ‘వారికి స్టైఫండ్‌ ఇవ్వడం ఎలా?’ అని ఆలోచించినప్పుడు... అరటి నారతో ఉత్పత్తుల తయారీలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ గురించి తెలిసింది. 50 మంది మహిళలకు తొలి విడతగా శిక్షణ ఇప్పించాం. వారిలో 30 మంది ఇప్పుడు మా సంస్థలోనే పని చేస్తున్నారు. మరోవైపు ‘క్రేజీ కోకోనట్‌’ అనే సంస్థ భాగస్వామ్యంతో... కొబ్బరి పీచు, చిప్పలతో కళాత్మకమైన వస్తువుల తయారీలో కూడా మూడు నెలలపాటు శిక్షణ కల్పించాం. ఇప్పుడు ‘కొట్రావై’ ఆధ్వర్యంలో అయిదు ఉత్పత్తి యూనిట్లు నడుస్తున్నాయి. వీటిలో కొబ్బరి చిప్పలతో, అరటి నారతో ఉత్పత్తులు, టెర్రాకోట అభరణాలు, ఆహార ఉత్పత్తులు తయారవుతున్నాయి. వీటిద్వారా కొన్నివందల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. సుగంధ కొవ్వొత్తులు, వెల్‌నెస్‌ ఉత్పత్తుల కోసం మరో యూనిట్‌ను త్వరలో ఆరంభిస్తున్నాం. ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా విక్రయాలు జరుపుతున్నాం. కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాం. దీనికోసం రెండు ప్రముఖ కంపెనీల నుంచి మొత్తం కోటి రూపాయల ఆర్డర్లు లభించాయి. ఒక అంతర్జాతీయ బ్రాండ్‌ ద్వారా అమెరికా, బ్రిటన్లలో కూడా విక్రయాలు సాగిస్తున్నాం.

బెదిరింపులు తట్టుకొని...

ఇప్పటివరకూ సాగిన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు కూడా ఎదురయ్యాయి. తమ దగ్గర పని మానేస్తే పీఎఫ్‌ లాంటి ప్రయోజనాలు అందవని బీడీ ఫ్యాక్టరీల యజమానులు కార్మికులను బెదిరించారు. పీఎఫ్‌ నెంబర్‌ ఉంటే... ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా విత్‌డ్రాయల్స్‌ చేసుకోవచ్చని కార్మికులకు అవగాహన కల్పించాం. శిక్షణ కార్యక్రమాల కోసం కమ్యూనిటీ హాల్స్‌, కళ్యాణ మండపాలు బుక్‌ చేసుకుందామంటే... అవి మాకు ఇవ్వకుండా కొందరు అడ్డుకున్నారు. దాంతో చెట్ల కింద శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు... నాకు హాని చేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాను. బీడీలు చుడితే గతంలో నెలకు మూడు నాలుగు వేలు సంపాదించే మహిళలు.. ఇప్పుడు కనీసం ఎనిమిది వేలు ఆర్జిస్తున్నారు. దీనికన్నా వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించగలుగుతున్నారనే సంతృప్తి నాకు ఎక్కువ ఆనందాన్నిస్తోంది. విక్రయాల ద్వారా వస్తున్న లాభాలను శిక్షణ కోసం, నైపుణ్యాలు పెంచడం కోసం ఖర్చు చేస్తున్నాం. రాబోయే అయిదేళ్ళలో కనీసం పదివేలమందికి కొత్త ఉపాధిని సృష్టించడం, వచ్చే ఏడాదికల్లా కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ ఆదాయాన్ని మరింత పెంచడం నా లక్ష్యం.’’

ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 05 , 2026 | 05:17 AM