కోచ్‌గా ఆ కల నెరవేర్చుకున్నారు
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:29 AM
వివక్ష అడ్డు గోడగా నిలిచినా... పేదరికం సవాళ్లు విసిరినా... అన్నిటినీ ఆత్మవిశ్వాసంతో అధిగమించారు. చెట్టు కొమ్మలనే హాకీ స్టిక్‌లుగా చేసుకొని... ఆట మొదలుపెట్టారు. టీమ్ ఇండియా జెర్సీ...
స్ఫూర్తి
వివక్ష అడ్డు గోడగా నిలిచినా... పేదరికం సవాళ్లు విసిరినా... అన్నిటినీ ఆత్మవిశ్వాసంతో అధిగమించారు. చెట్టు కొమ్మలనే హాకీ స్టిక్‌లుగా చేసుకొని... ఆట మొదలుపెట్టారు. టీమ్ ఇండియా జెర్సీ ధరించాలనే కల నెరవేరకపోయినా...
కోచ్‌గా కొత్త అధ్యాయం ప్రారంభించారు. యాభై మందికి పైగా గ్రామీణ, గిరిజన నేపథ్యంగల బాలబాలికలను... జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. తన కలను వారి ద్వారా నెరవేర్చొకొంటున్న కరుణ పుర్తీ కథ ఇది.
‘‘ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి... చెప్పులు లేకుండా... చెట్టు కొమ్మలు విరగ్గొట్టి... గ్రామ బావి దగ్గర నేను, నా స్నేహితురాళ్లు రోజూ హాకీ ఆడేవాళ్లం. అదికూడా రహస్యంగా. ఊళ్లో వాళ్లకు తెలిస్తే ఊరుకోరు. ఎందుకంటే ఆడపిల్లలకు ఆటలు ఆడుకొనే స్వేచ్ఛలేదు మా ప్రాంతంలో. ఝార్ఖండ్ ఖుంటి జిల్లాలోని జాతే అనే మారుమూల పల్లె మాది. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన నాకు లక్ష్యాలంటూ ఏవీ ఉండేవి కాదు. చిన్నప్పుడు ఊళ్లో మగపిల్లలు ఏదో కర్ర పట్టుకొని, ఓ తెల్ల బంతి వెనుక పరుగెడుతూ ఉండేవారు. అది చూసి నాకు కూడా ఆడాలనిపించేంది. కానీ ఆడపిల్లను కావడంతో ఎవరూ నన్ను అనుమతించలేదు. ఏదిఏమైనా హాకీ ఆడాలన్న కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఒక రోజు నా స్నేహితులతో కలిసి, ఊరి చివర బావి దగ్గరకు వెళ్లాను. చెట్లకొమ్మ లు విరగ్గొట్టి, హాకీ స్టిక్‌లా మార్చుకుని హాకీ ఆడటం మొదలుపెట్టాం. నాడు మా ఆనందానికి హద్దులు లేవు. సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వస్తుండటంతో మా అమ్మానాన్న, ముఖ్యంగా మా అమ్మమ్మ నన్ను తెగ తిట్టేది. నేనంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కారణం... మా ఇంట్లో నేను వరుసగా మూడో ఆడపిల్లను కావడమే.
అనుకోకుండా అటువైపు...
అనుకోకుండా మొదలు పెట్టిన హాకీ మీద ఇష్టం విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. ఉమ్మడి బిహార్ నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన తొలి మహిళా క్రీడాకారిణి సావిత్రి పుర్తీ, ఆమె సోదరి బిశ్వాసీ పుర్తీ మా గ్రామం వారే. నేను హాకీ మొదలుపెట్టిన రోజుల్లో వారు మా గ్రామానికి వచ్చారు. నాకు ఆటపై ఉన్న మక్కువను గమనించిన మా అక్క... సావిత్రిని కలిసింది. ‘మా చెల్లిని కూడా మీతోపాటు తీసుకువెళ్లి శిక్షణ ఇవ్వండ’ని కోరింది. అప్పుడు అక్క కూడా చిన్నపిల్లే కదా. ఆమె మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అయితే యాదృచ్ఛికంగా అదే సమయంలో ఖుంటిలో హాకీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో పాల్గొన్నాను. ఎంపికైనవారికి రాంచీ ప్రభుత్వ బాలికల పాఠశాలలోని ‘రాష్ట్ర హాకీ శిక్షణ కేంద్రం’ (ఎస్‌హెచ్‌టీసీ)లో శిక్షణ ఇస్తారు. దానికి నేను ఎంపికయ్యాను. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నాను. శిక్షణ కోసం రాంచీ వచ్చాను. అదే నా జీవితంలో అతిపెద్ద మలుపు. రాజ్‌పాల్ సింగ్ నేతృత్వంలో ఏడాదిపాటు శిక్షణ పూర్తవ్వగానే, నరేంద్ర సింగ్ సైనీ దగ్గర మెళకువలు నేర్చుకున్నా. తరువాతి కాలంలో ఆయనే ఎస్‌హెచ్‌టీసీ ప్రధాన కోచ్‌గా, భారత హాకీ జట్టు కోచ్‌గా వ్యవహరించారు.
చోటు దక్కలేదు... కానీ...
మొదట్లో హాకీని కెరీర్‌గా ఎంచుకోవాలన్న ఆలోచన కానీ, జాతీయ జట్టుకు ఆడాలనే కల కానీ లేవు. అందుకు కారణం నా కుటుంబ నేపథ్యం. ఎప్పుడైతే కోచింగ్ మొదలుపెట్టానో... ఆనాటి నుంచి భారత్ తరుఫున ఆడాలని కలలు కన్నాను. కానీ నేను ఎంత ప్రయత్నించినా జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేక పోయాను. బతుకుదెరువు కోసం జాతీయ హాకీ క్రీడాకారులతో కలిసి హోటల్ ప్రారంభించాను. అది కలిసిరాలేదు. తరువాత హాకీ ద్వారా సామాజిక అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. నిధుల సమస్యతో దాన్నీ మూసివేయాల్సి వచ్చింది.

జీవనోపాధి కోసం...
నేను చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో రోజు గడవడం కూడా కష్టమైంది. దాంతో నాటి క్రీడా శాఖ కార్యదర్శిని కలిశాను. బతకడానికి ఏదైనా ఉద్యోగం చూపించడని వేడుకున్నాను. నా కథ విన్న ఆయన ఎంతో బాధపడ్డారు. వెంటనే ఖుంటీలోని శిక్షణ కేంద్రంలో నన్ను కోచ్‌గా నియమించారు. అయితే అక్కడ నెలనెలా జీతం ఇచ్చేవారు కాదు. కొన్నిసార్లయితే ఆరేడు నెలల తరువాత జీతం అందేది. దానికితోడు ఢిల్లీలో ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మా అక్క అనారోగ్యంతో మరణించింది. అది నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తన మరణంతో నా బాధ్యత మరింత పెరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్క పని చేసిన ఇంటి యజమానురాలు నాకు అండగా నిలిచారు. ఆమె మద్దతుతో పంజాబ్‌లోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’కు దరఖాస్తు చేసుకున్నా. హాకీ కోచింగ్‌లో అక్కడ శిక్షణకు అయ్యే ఖర్చును ఆ ఇంటి యజమాని భరించారు. అది నా జీవితాన్ని నిలబెట్టిన మలుపు.
యాభైమందికి పైనే...
అంతటి ప్రతిష్ఠాత్మక ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెషనల్ కోచ్‌గా శిక్షణ పూర్తి చేసిన తరువాత కూడా సరైన ఉద్యోగం రాలేదు. ఐదేళ్లు ఖుంటీలోని శిక్షణ కేంద్రంలోనే పని చేశాను. అక్కడ బాలికలకు శిక్షణ ఇచ్చాను. ఏదైనా రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్‌లో పోస్టింగ్ ఇప్పించాల్సిందిగా అప్పటి క్రీడా శాఖ కార్యదర్శికి విన్నవించాను. నా విజ్ఞాపనకు శాఖ స్పందించి, రాంచీ బరియాతూలోని స్టేట్ హాకీ ట్రైనింగ్ సెంటర్‌లో పర్మినెంట్ కోచ్‌గా నియమించింది. ఆ రోజు నుంచీ ఒకటే లక్ష్యం... నాలాంటి ఔత్సాహిక బాలికలను దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టాలని. దానికి తగ్గట్టుగానే శ్రమించాను. ఇక్కడ నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ నేటి వరకు యాభై మంది బాలికలను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాను. నాడు నేను సాధించలేనిది వారి ద్వారా నెరవేరినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది.’’
ఎయిరిండియా జట్టులో...
నరేంద్ర సింగ్ సైనీ మార్గదర్శనంలో ఆటలో ఎంతో పురోగతి సాధించాను. సబ్ జూనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో రాణించాను. పాఠశాల విద్య పూర్తయ్యేసరికి రాష్ట్ర సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. రాంచీ గాస్నర్ కాలేజీలో ప్లస్ టూలో చేరాను. ఒక వైపు చదువుకొంటూనే, కెరీర్‌ను కొనసాగించాను. అదే సమయంలో ఎయిరిండియా తరుఫున ఆడేందుకు ఒప్పందం కుదిరింది. నాకు లభించి మంచి అవకాశం అది. ప్లస్ టూ పూర్తవగానే స్వగ్రామానికి తిరిగివచ్చి, ఖుంటి కాలేజీలో డిగ్రీ చదివాను.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..