Share News

ఆశల బాటలో ఆమె ఆటో!

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:25 AM

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలను అధిగమించి బెంగళూరులో ఆటో డైవ్రర్‌గా మారిన జాన్సీ బివి కథ ప్రతీ ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తోంది. హ్యాండిల్‌ పట్టి తన జీవితాన్ని చక్కదిద్దుకున్న ఆమె...

ఆశల బాటలో ఆమె ఆటో!

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలను అధిగమించి బెంగళూరులో ఆటో డైవ్రర్‌గా మారిన జాన్సీ బివి కథ ప్రతీ ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తోంది. హ్యాండిల్‌ పట్టి తన జీవితాన్ని చక్కదిద్దుకున్న ఆమె, నేడు తోటి మహిళలకు ఉచితంగా డైవ్రింగ్‌ శిక్షణ ఇస్తూ వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి ఆశాదీపంగా నిలుస్తోంది.

‘‘నా జీవితంలో నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఒకటే... కష్టాలు మనల్ని పడగొట్టడానికి కాకుండా, మనలో ఉన్న నిజమైన శక్తినో, ఆత్మవిశ్వాసాన్నో నిద్రలేపడానికే వస్తాయి. ఈ రోజు నన్ను బెంగళూరు వీధుల్లో ధైర్యంగా ఆటో తోలుతున్న డైవ్రర్‌గానో, తోటి మహిళలకు ఆటో నడపడం నేర్పించే శిక్షకురాలిగానో సమాజం గుర్తిస్తోంది. కానీ, నేను నడిచి వచ్చిన దారి పొడవునా కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు ఎన్నో ఉన్నాయి.

కష్టాలతో సాగిన చిన్నతనం

నా చిన్నతనం అంతా బెంగళూరులోని బన్నేరుఘట్ట ప్రాంతంలోనే సాగింది. నా పదేళ్ల వయసులో నాన్న అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన ఒక లారీ డైవ్రర్‌. అప్పటి వరకు ఇల్లు మాత్రమే చూసుకున్న అమ్మ, కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది. చిన్నప్పటి నుంచి నాన్న లారీ తోలడం, ఆయన డైవ్రింగ్‌ చేసే విధానాన్ని చూస్తూ పెరిగిన నాకు వాహనాలు నడపడం అంటే చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. నాన్నలాగే నేను కూడా వాహనం నడిపే వృత్తిలోనే స్థిరపడాలని కలలు కనేదాన్ని. కానీ, నాన్న లేని లోటు, ఇంట్లోని పేదరికం నా ఆశలపై నీళ్లు చల్లాయి. పొట్టకూటి కోసం వేరే దారి లేక, టైలరింగ్‌ నేర్చుకుని చిన్న చిన్న కుట్టు పనులు చేస్తూ అమ్మకు ఆసరాగా నిలిచాను.

కొవిడ్‌ కష్టాలతో మలుపు

కాలం ముందుకు సాగుతున్న కొద్దీ నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. వినోద్‌తో నా పెళ్లి జరిగింది. ఆయన ఆటోరిక్షా వ్యాపారాన్ని నడిపేవారు. పెళ్లయ్యాక నా జీవితం ఒక దారిలోకి వచ్చిందని, కష్టాలు తీరిపోతాయని భావించాను. కానీ, కొవిడ్‌ మహమ్మారి మా బతుకులను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ల వల్ల రవాణా పూర్తిగా నిలిచిపోయి మా ఆటో వ్యాపారం కుప్పకూలింది. ఆటోల కొనుగోలు కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు, కిస్తీలు పెరిగిపోయాయి. ఆ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి మేమిద్దరం కలిసి ఒక చిన్న టీ కొట్టు కూడా ప్రారంభించాం. రోజంతా కష్టపడినా అప్పులు తీరడం గగనంగా మారిన ఆ కష్టకాలంలో నా భర్త వినోద్‌ నాకొక ఆలోచన చెప్పారు. నువ్వు చిన్నప్పటి నుంచి డైవ్రింగ్‌ చేయాలనుకున్నావు కదా, ఇప్పుడు మన ఆటోను నువ్వే ఎందుకు తోలకూడదు? అని నన్ను ప్రోత్సహించారు.


బంధువుల వ్యతిరేకత

ఒక మహిళవై ఉండి రోడ్లపై ఆటో తోలడమేంటని బంధువులు, స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ, నా భర్త వినోద్‌ నా వెన్నంటే కొండంత అండగా నిలిచారు. మొదటి రోజే రూ. రూ.700 సంపాదించాను. ఆ డబ్బులు నా చేతికి వచ్చినప్పుడు నాలో కలిగిన ఆనందం, ఆత్మవిశ్వాసం మాటల్లో చెప్పలేను. నా సొంత కష్టంతో సంపాదించిన ఆ మొత్తమే నా జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత ‘ఉబెర్‌’ ప్లాట్‌ఫారమ్‌లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అత్యుత్తమమైన పని వినోద్‌ను పెళ్లి చేసుకోవడమే. ఆయన నన్ను ఒక రాణిలా చూసుకుంటూ, ప్రతి అడుగులోనూ ప్రోత్సహించారు.

అదే అసలైన స్వాతంత్య్రం

ఆ రోజు నుంచి ఉపాధి కోరుకునే మహిళలకు ఉచితంగా ఆటో డైవ్రింగ్‌ తరగతులు ప్రారంభించాను. నా దగ్గరకు వచ్చే ప్రతీ మహిళకు వాహనం నడపడమే కాకుండా, రోడ్డు భద్రతా నియమాలు, వాహన నిర్వహణ, ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పిస్తున్నాను. ఇప్పటి వరకు బెంగళూరు నగరంలో వందలాది మంది మహిళలకు రూపాయి కూడా తీసుకోకుండా ఆటో డైవ్రింగ్‌లో శిక్షణ ఇచ్చాను. నాలుగు గోడలకే పరిమితమైన గృహిణులు, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్న మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే నా ఆశయం. నా వద్ద శిక్షణ తీసుకున్న మహిళలు ఈ రోజు బెంగళూరు రోడ్లపై ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆటోలు నడుపుతూ వారి కాళ్లపై వారు నిలబడుతున్నారు. అది చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది’’.

ఉచిత శిక్షణ

నేను ఆటో హ్యాండిల్‌ పట్టి రోజువారీ ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాక, నా ఆలోచనా ధోరణిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. బెంగళూరు వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్న మహిళలు కనిపించేవారు. కానీ వారికి సరైన దారి చూపించేవారు లేరని నాకు అర్థమైంది. 2021లో ఇందిరానగర్‌ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. అక్కడ ఉపాధి పొందే తపన ఉండి కూడా, డైవ్రింగ్‌ నేర్చుకోవడానికి తగిన అవకాశాలు లేదా ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న కొందరు మహిళలను ప్రత్యక్షంగా చూశాను. ఆ క్షణమే ఒక నిశ్చయానికి వచ్చాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ నైపుణ్యాన్ని, నా అనుభవాన్ని తోటి సోదరీమణులకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాను.

ఈ వార్తలనూ చదవండి:

ఎఫ్‌డీఐలకు భారీ ఊతం!

భగ్గుమంటున్న చక్కెర ధర

Updated Date - Aug 20 , 2026 | 05:25 AM