Share News

ఎఫ్‌డీఐలకు భారీ ఊతం!

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:30 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధన ప్రణాళికలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు భారీ గా ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రెండు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలున్నట్లు...

ఎఫ్‌డీఐలకు భారీ ఊతం!

పెట్టుబడి పరిమితి రూ.15,000 కోట్లకు పెంపు

న్యూఢిల్లీ: వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధన ప్రణాళికలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు భారీ గా ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రెండు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) అనుమతి అవసరమైన ఎఫ్‌డీఐల పరిమితిని ప్రస్తుతమున్న రూ.5,000 కోట్ల స్థాయి నుంచి ఏకంగా రూ.15,000 కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, ముడి పదార్థాలను శుద్ధి చేసి వినియోగ ఉత్పత్తులుగా మార్చే ఆయిల్‌ రిఫైనింగ్‌ తదితర కంపెనీల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సైతం సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన ముసాయిదా పత్రాన్ని ఇప్పటికే రూపొందించటంతో పాటు ఆర్థిక శాఖ, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ), నీతి ఆయోగ్‌ మధ్య ఈ విషయంపై ప్రాథమిక చర్చ కూడా జరిగినట్లు సమాచారం. కేంద్ర క్యాబినెట్‌ త్వరలోనే ఈ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉంది. 2015 నవంబరు నుంచి అమలులో ఉన్న నిబంధన ప్రకారం.. రూ.5,000 కోట్లకు పైగా విలువైన ఎఫ్‌డీఐలకు సీసీఈఏ ఆమోదం తప్పనిసరి. అంతకంటే తక్కువ ఎఫ్‌డీఐలకు సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదం చాలు.

అనుమానాస్పద విదేశీ రెమిటెన్స్‌లపై ఐటీ నజర్‌

ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తాజాగా అనుమానాస్పద విదేశీ రెమిటెన్స్‌లపై దృష్టిసారించింది. అతి తక్కువ లేదా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేని సంస్థల విదేశీ రెమిటెన్స్‌లు, వాటి వెనక ఉన్న వ్యక్తులు, ఆ లావాదేవీలకు పన్ను నిర్ధారణ ధ్రువీకరణ పత్రం (ఫారం 15సీబీ లేదా ఫారం 146) జారీ చేసిన చార్టర్డ్‌ అకౌంటెంట్లు గుర్తించేందుకు ఐటీ శాఖ ప్రత్యేక డైవ్‌ను ప్రారంభించింది. ప్రధానంగా దేశ సరిహద్దు జిల్లాల్లోని సంస్థలు, పెద్ద మొత్తంలో విదేశాలకు సొమ్ము బదిలీ చేసిన వాటి గుట్టు వెలికితీసేందుకు డిపార్ట్‌మెంట్‌ నడుం బిగించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 394 సంస్థలు, 36 మంది వృత్తి నిపుణుల వ్యవహారాలను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నట్లు ఐటీ శాఖ మంగళవారం వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 05:30 AM