భగ్గుమంటున్న చక్కెర ధర
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:28 AM
దేశీయంగా చక్కెర ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. మార్కెట్లో చక్కెర సరఫరాలను పెంచడానికి, రికార్డు స్థాయిలో ఉన్న ధరలను అదుపు చేయడానికి...
సరఫరా పెంపు, ధరల కట్టడిపై ప్రభుత్వం దృష్టి
పరిమిత స్థాయిలో చక్కెర దిగుమతుల అనుమతికి అవకాశం
న్యూఢిల్లీ: దేశీయంగా చక్కెర ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. మార్కెట్లో చక్కెర సరఫరాలను పెంచడానికి, రికార్డు స్థాయిలో ఉన్న ధరలను అదుపు చేయడానికి పలు చర్యలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా పరిమిత స్థాయిలో సుంకాలు లేకుండా చక్కెర దిగుమతులకు అనుమతివ్వడం, భారీ వ్యాపారుల వద్ద నిల్వ ఉండే చక్కెర పరిమాణంపై ఆంక్షలు విధించడం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు నుంచి నవంబరు వరకు పండగల సీజన్ సందర్భంగా చక్కెరకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చక్కెర దిగుమతుల వల్ల దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదలను అదుపు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చక్కెర నిల్వ పరిమితులను తగ్గించడం, పరిమిత స్థాయిలో దిగుమతులను అనుమతించడం, దిగుమతి సుంకాలను తగ్గించడం, చక్కెర మిల్లుల ద్వారా దేశీయ అమ్మకాల కోసం నెలవారీ కేటాయింపులను సర్దుబాటు చేయడం వంటి చర్యలపై చర్చలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ధరల విషయానికి వస్తే మహారాష్ట్రలో కీలకమైన ట్రేడింగ్ కేంద్రంగా ఉన్న కొల్హాపూర్‌లో చక్కెర టోకు ధరలు 100 కిలోలకు ఈ నెల ప్రారంభం నుంచి దాదాపు 20 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.5,350కి చేరుకున్నాయి. కాగా అక్టోబరు చివరి కల్లా సుంకాలు లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను మిల్లులు దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
మిల్లుల వద్ద క్వింటా ధర రూ.5,400-5,500
అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2026-27 సీజన్ (అక్టోబరు-సెప్టెంబరు)కు సంబంధించి చక్కెర ప్రారంభ నిల్వలు తక్కువగా ఉండవచ్చన్న అంచనాల నేపథ్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా మిల్లుల వద్ద క్వింటాలు చక్కెర సగటు ధర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో రూ.5,400-5,500కు చేరిందని పరిశ్రమల సంఘం తెలిపింది. ఏడాది క్రితం క్వింటాల్ ధర రూ.3,900 ఉండగా ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగింది. మిల్లుల వద్ద ధరలను బట్టి మంగళవారం దేశవ్యాప్తంగా చక్కెర సగటు రిటైల్ ధర కిలోకు 13 శాతం పెరిగి రూ.52.3కు పెరిగింది. ఏడాది క్రితం ధర కిలోకు రూ.46.34గా ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం