Share News

జంటగా జయించారు

ABN , Publish Date - May 27 , 2026 | 03:41 AM

ఇద్దరు ఐటీ రంగ నిపుణులు... నిత్యం కంప్యూటర్లతో కుస్తీపట్టే వీరు... కలిసి శ్రీలంక నుంచి భారత్‌కు ఈదేశారు. ఎగసిపడుతున్న అలలు... భయపెట్టిన జలచరాలు... చిమ్మ చీకట్లను చీల్చుకొని...

జంటగా జయించారు

సంకల్పం

ఇద్దరు ఐటీ రంగ నిపుణులు... నిత్యం కంప్యూటర్లతో కుస్తీపట్టే వీరు... కలిసి శ్రీలంక నుంచి భారత్‌కు ఈదేశారు. ఎగసిపడుతున్న అలలు... భయపెట్టిన జలచరాలు... చిమ్మ చీకట్లను చీల్చుకొని... జంటగా లక్ష్యాన్ని అధిగమించారు. వృషాలీ ప్రసాద్‌, డానిష్‌ అబ్ది... ఈ ఘనత సాధించిన తొలి జంటగా రికార్డులకు ఎక్కారు. ఆ విశేషాలు వృషాలీ మాటల్లోనే...

‘‘శ్రీలంకలోని తలైమన్నారు తీరం. తెల్లవారుజాము నాలుగున్నర గంటల సమయం. శబ్దాన్ని, కాంతిని మింగేసినట్టు సముద్రం. నేను, డానిష్‌ నీళ్లలోకి దూకాం. భారత తీరంలోని ధనుష్కోటికి చేరాలన్నది మా లక్ష్యం. ఈత మొదలుపెట్టాం. లయబద్దమైన మా ఈత చప్పుడు తప్ప మరో శబ్దం అక్కడ వినిపించడంలేదు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భయంకరంగా ఉంటుందని అప్పుడే మాకు అర్థమైంది. ఎటు చూసినా చిమ్మచీకటి. ఈత మొదలుపెట్టిన ఐదారు నిమిషాలకే నీటి అడుగు నుంచి ఏవో మా కాళ్లను తాకుతున్నట్టు అనిపించింది. అవేమిటో మాకు అంతుపట్టలేదు. మమ్మల్ని అవి కొరకనంతవరకు, ఇబ్బంది పెట్టనంతవరకు ఈత కొనసాగిద్దామని ముందుకు వెళుతూనే ఉన్నాం. చివరకు వీడియో ఫుటేజీ పరిశీలించాక తెలిసింది... అది ఎగిరే చేపల గుంపు అని. వీడియోలో చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కానీ, ఆ సమయంలో మేం చాలా భయపడ్డాం. మొత్తానికి... 10.45 గంటలపాటు 32 కిలోమీటర్లు ఈది మధ్యాహ్నం సుమారు 3.15కు ధనుష్కోటి చేరుకున్నాం. ఆ క్షణం నా కళ్లు చమర్చాయి. గుండె ఉప్పొంగింది. ఓపెన్‌ వాటర్‌లో ఈ ఘనత సాధించిన తొలి జంట మేమేనని తెలిసి... ఎంతో సంతోషంగా, గర్వంగా అనిపించింది.


ఇంజనీరింగ్‌ తరువాత...

2016లో బిట్స్‌ పిలానీ గోవా క్యాంప్‌సలో ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ఆ తరువాత మరొకరితో కలిసి వీడియో గేమ్స్‌కు సంబంధించి అంకుర సంస్థను నెలకొల్పాను. రెండేళ్ల తరువాత దాని నుంచి బయటకు వచ్చేసి సహ వ్యవస్థాపకురాలిగా మా స్వస్థలం బెంగళూరులో ‘పిక్సిస్‌’ అనే సంస్థను ప్రారంభించాను. డిజిటల్‌ మార్కెటింగ్‌ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఏఐ ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేశాను. సొంత బిజినెస్‌ అంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ప్రొడక్షన్‌తో పాటు మార్కెటింగ్‌లాంటి వ్యవహారాలూ చూసుకోవాలి. అయితే పనిలో ఎంత బిజీగా ఉన్నా... నాకంటూ కొంత సమయం కేటాయించుకుంటా. ఆ సమయంలో నా అభిరుచులు, ఆనందాలకు ప్రాధాన్యం ఇస్తా.

కొలనులో మునిగాక...

ఎనిమిదేళ్ల కిందట... చాలా ఉత్సాహంగా ఈత కొలనులోకి దిగాను. అప్పుడే నేర్చుకొంటున్నాను. ఒక రోజు ఈత కొడుతుంటే ఉన్నట్టుండి కొలనులో మునిగిపోయాను. ఒక్కసారిగా నిస్సహాయురాలిని అయిపోయానన్న బాధ నన్ను వేధించింది. ఆ చేదు అనుభవం నాలో కసిని పెంచింది. ఇకపై ఎప్పటికీ అలాంటి పరిస్థితిల్లోకి వెళ్లకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నాను. అప్పుడప్పుడూ కాకుండా రోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లేముందు ఒక గంట ఈత నేర్చుకోవడానికి కేటాయించాను. నా భర్త డానిష్‌ కూడా నాకు అండగా నిలిచారు. తను కూడా నాతో కొలనుకు రావడం మొదలుపెట్టారు. కోచ్‌ సతీష్‌ మోహన్‌ పర్యవేక్షణలో ఇద్దరం కఠోరంగా శ్రమించాం.


5-Navya.jpg

వారి స్ఫూర్తితో...

అయితే మాతో కలిసి శిక్షణ పొందేవారిలో ప్రొఫెషనల్‌ స్విమ్మర్లు ఉన్నారు. అప్పటికే వారు తమ పేరిట అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారు. వారి స్ఫూర్తితో మేం కూడా ఏదైనా సాధించాలని అనుకున్నాం. అలా శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారత్‌ తీరంలోని ధనుష్కోటి వరకు ఈదాలనే నిర్ణయానికి వచ్చాం. పద్ధెనిమిది నెలలు కఠోర శిక్షణ అనంతరం ఈ నెల 7న మా సాహస యాత్రకు శ్రీకారం చుట్టాం. బహిరంగ జలాల్లో ఈత కొట్టడమంటే కేవలం ఓర్పును పరీక్షించడమే కాదు... ప్రకృతితో, జలచరాలతో మమేకమై శిక్షణ పొందటం. శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంచడానికి అంతర్జాతీయ ఈత పోటీలు సాధారణంగా చల్లటి నీటిలో సాగుతుంటాయి. అయితే మేం ఈత కొట్టాలనుకున్న పాక్‌ జలసంధి ఒక ఉష్ణమండల ప్రాంతం. వెచ్చని నీటిలో శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ను, ఉప్పును వేగంగా కోల్పోతాం. సూర్య కిరణాలు మనల్ని నేరుగా తాకుతుంటాయి.

అంగుళం కూడా కదల్లేదు...

సముద్రంలో మా ప్రయాణం ప్రారంభించాక భయంకరమైన అలలు. దాదాపు గంటన్నరపాటు ఏకధాటిగా ఈత కొడుతూనే ఉన్నాం. బోటులో మా వెంట వస్తున్న కోచ్‌ను అడిగాం... ‘ఎంత దూరం వచ్చాం’ అని. ‘గడిచిన గంటలో మీరు ఒక్క అంగుళం కూడా కదల్లేదు’ అన్నారు. ‘ఇప్పుడు ఏంటి? తిరిగి శ్రీలంకకు వెళ్లిపోవాలా’... ఈ ఆలోచన మమ్మల్ని నిరుత్సాహపరిచింది. ప్రకృతి అనుకూలించకపోతే ముందుకు సాగలేమని అర్థమైంది. కోచ్‌ కూడా అదే చెప్పారు. మాలో ఉత్సాహం నింపేందుకు, అలుపెరుగకుండా ప్రయత్నించేందుకు ఒకానొక సమయంలో ఆయన కూడా నీటిలోకి దూకారు. ఇక్కడ అత్యంత కీలకమైనది మానసికంగా దృఢంగా ఉండటం. నేను, డానిష్‌ దాదాపు పక్కపక్కనే కలిసి ఈత కొట్టాం. తను నాకు దగ్గరలోనే ఉన్నాడన్న విషయం నాకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. సముద్రపు నీరు కఠినంగా మారినప్పుడు, అలలు, కల్లోలాలు ఎదురైనప్పుడు ఒంటరిగా ఈదడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మనలాగే వేరొకరు కూడా అదే పరిస్థితిని ఎదిరిస్తున్నారని తెలిస్తే అది మనకు శక్తిని, ప్రేరణను ఇస్తుంది.’’


అద్భుతం జరగాలంటే...

అన్నిటినీ తట్టుకొని చివరకు ధనుష్కోటి తీరాన్ని తాకినప్పుడు మా హృదయాలు ఉప్పొంగాయి. మా ఆనందానికి అవధులు లేవు. పదకొండు గంటలు ఉప్పు నీటిలో ఉండటంవల్ల మా నాలుకలు, పెదవులు వాచిపోయాయి. వెంటనే నాలుగు ఐస్‌క్రీమ్‌లు తిన్నాను. ఈత కొట్టే సమయంలో కూడా వాపును తగ్గించుకోవడానికి ఐస్‌ క్యూబ్స్‌ తీసుకొంటూనే ఉన్నాను. కానీ ఒక అద్భుతం జరగాలంటే ఇలాంటివెన్నో ఎదుర్కోవాలి. మనమేంటో నిరూపించుకోవాలంటే పట్టుదలతో ప్రయత్నించాలి. మా తరువాతి లక్ష్యం... ఇంగ్లీష్‌ చానల్‌. అది కూడా నెరవేరుతుందని ఆశిస్తున్నాం.

ఇవి కూడా చదవండి:

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!

కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

Updated Date - May 27 , 2026 | 03:41 AM