Share News

రోదసీ వీధులపై మన మహిళల సంతకం

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:13 AM

లింగ వివక్షకు తావులేని పరిశోధనలు, మైనస్‌ 80 డిగ్రీల గడ్డకట్టే చలిలో దేశం కోసం సాహసాలు.. ఇవీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మహిళా శాస్త్రవేత్తలు...

రోదసీ వీధులపై మన మహిళల సంతకం

లింగ వివక్షకు తావులేని పరిశోధనలు, మైనస్‌ 80 డిగ్రీల గడ్డకట్టే చలిలో దేశం కోసం సాహసాలు.. ఇవీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మహిళా శాస్త్రవేత్తలు మంగళమణి, దాక్షాయణి విజయ గాథలు. తాజాగా వారు తమ అనుభవాలు పంచుకున్నారు.

ఆ విశేషాలే ఇవి...

భారత దేశం గగనతలంలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి చంద్రయాన్‌-3 విజయఢంకా మోగించడం వరకు ప్రతి మైలురాయి వెనుక ఒక అలుపెరగని పోరాటం ఉంది. ఒకప్పుడు సైన్స్‌, టెక్నాలజీ అంటే కేవలం అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల గుత్తాధిపత్యం అనే భావన ఉండేది. కానీ, ఆ అపోహలను పటాపంచలు చేస్తూ భారత్‌ నేడు ప్రపంచానికే దిక్సూచిగా మారింది. ఈ మహాయజ్ఞంలో పురుషులతో సమానంగా, కొన్ని సందర్భాలలో వారికంటే సాహసోపేతంగా వ్యవహరిస్తూ ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు చరిత్రను తిరగరాస్తున్నారు.

ప్రపంచం దృష్టిని మార్చిన భారత్‌

‘‘సైన్స్‌ అనేది కేవలం సంపన్న దేశాల సొత్తు కాదు, అది మేధస్సుకు సంబంధించినది’’ అంటారు శాస్త్రవేత్త దాక్షాయణి. ‘మంగళయాన్‌’ అతి తక్కువ ఖర్చుతో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ నిలవడం వంటివి అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇవి కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాదని, భారత శాస్త్రవేత్తల మేధోశక్తికి నిదర్శనాలని అంటారు దాక్షాయణి.


వివక్షకు చోటులేదు

సమాజంలో ఇంకా అనేక రంగాల్లో లింగ వివక్ష కొనసాగుతున్నప్పటికీ ఇస్రో ఒక విలక్షణమైన పని సంస్కృతి కలిగి ఉందని దాక్షాయణి చెప్పారు. ‘‘అక్కడ మేం పని చేసేటప్పుడు మహిళలం అని కానీ, పురుషులం అని కానీ అనుకోం. మేమంతా కేవలం సైంటిస్టులం, ఇంజినీర్లం మాత్రమే’’ అన్నారు. సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ రాసినా, ఒక భారీ రాకెట్‌ హార్డ్‌వేర్‌ డిజైన్‌ చేసినా అక్కడ పరిగణనలోకి తీసుకునేది సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే. ప్రతిభ ఉంటే ఆకాశమే హద్దు అని, పనితీరు ఆధారంగానే అక్కడ గుర్తింపు లభిస్తుందని ఆమె చెప్పిన మాటలు సైన్స్‌ రంగంలోకి రావాలనుకునే యువతకు కొండంత భరోసాను ఇస్తున్నాయి.

5-Navya.jpg

గడ్డకట్టే మంచులో...

56 ఏళ్ల సీనియర్‌ శాస్త్రవేత్త మంగళమణి ప్రయాణం కేవలం ల్యాబ్‌కే పరిమితం కాలేదు. ఇస్రో ప్రతిష్ఠాత్మక మిషన్‌లో భాగంగా ఆమె అంటార్కిటికా ఖండంలో సుదీర్ఘకాలం గడిపారు. అది భూమిపైన అత్యంత కఠినమైన ప్రాంతం. అక్కడి ఉష్ణోగ్రతలు ఒక్కోసారి మైనస్‌ 80 డిగ్రీల సెల్సియ్‌సకు పడిపోతాయి. అటువంటి గడ్డకట్టే చలిలో, ఆక్సిజన్‌ తక్కువగా ఉండే వాతావరణంలో ఉండటమే ఒక సాహసం. కానీ మంగళమణి అక్కడ ఏడాదిపాటు ఉండి పరిశోధను నిర్వహించారు. ‘‘అంటార్కిటికాలో పని చేయడం అనేది కేవలం ఉద్యోగ బాధ్యత కాదు, అది దేశానికి సేవ చేసే ఒక అరుదైన అవకాశం’’ అంటారామె. అక్కడ ప్రతి క్షణం ప్రాణాలతో పోరాటం లాంటిదే అయినా, మాతృభూమి కోసం ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నానని ఆమె చెబుతారు. అంటార్కిటికా మంచు పలకల మధ్య భారత జెండాను రెపరెపలాడించిన ఆ ధైర్యం నేటి తరానికి అసలైన స్ఫూర్తి.

ఇస్రోలో ఎంతోమంది...

చంద్రయాన్‌-2 మిషన్‌లో డైరెక్టర్‌గా పనిచేసి ‘రాకెట్‌ ఉమన్‌’గా పేరు పొందారు రితు కరిధాల్‌. చంద్రయాన్‌ ప్రాజెక్టును ముందుండి నడిపించిన ధీర వనిత ముత్తయ్య వనిత. అలాగే మంగళయాన్‌ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన మేధావి నందిని హరినాథ్‌. ఇస్రోలో ప్రస్తుతం 16 వేలమందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో 20 శాతానికిపైగా మహిళలు కీలక విభాగాల్లో రాణిస్తున్నారు. రాబోయే ‘గగన్‌యాన్‌’ (మానవసహిత అంతరిక్ష యాత్ర)లోనూ మహిళ పాత్ర అత్యంత కీలకం కానుంది. సాంకేతికతకు సరిహద్దులు లేవని, పట్టుదల ఉంటే అంటార్కిటికా మంచునైనా, అంతరిక్ష రహస్యాలనైనా ఛేదించవచ్చని వీరు నిరూపించారు.

ఇవి కూడా చదవండి...

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 01:13 AM