మైదానంలో ధిక్కారం
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:39 AM
ఇరాన్ మీడియా, ఆ ఐదుగుర్నీ దేశ ద్రోహులుగా చిత్రీకరించింది. దేశంలోకి అడుగుపెడితే వాళ్లకు పరాభవాలు, శిక్షలూ, చిత్రహింసలూ తప్పవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో...
న్యూస్ మేకర్స్
ఇరాన్ మీడియా, ఆ ఐదుగుర్నీ దేశ ద్రోహులుగా చిత్రీకరించింది. దేశంలోకి అడుగుపెడితే వాళ్లకు పరాభవాలు, శిక్షలూ, చిత్రహింసలూ తప్పవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఐదుగురు ఇరాన్ మహిళా సాకర్ ప్లేయర్స్‌కు తాజాగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం హ్యుమానిటేరియన్ వీసాలను ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆసక్తికరమైన ఈ సంఘటన గురించిన మరిన్ని వివరాలు...
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఇరాన్ మహిళా సాకర్ జట్టు దక్షిణ కొరియాతో తల పడబోయే ముందు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రతి మ్యాచ్‌కు ముందు, రెండు జట్లూ వారి వారి జాతీయ గీతాలను ఆలపించడం ఆనవాయితీ! అయితే ఈ సందర్భంలో ఇరాన్ జట్టులోని ఐదుగురు మహిళా క్రీడాకారిణులు జాతీయ గీతాలాపన సమయంలో మిగతా జట్టుతో గొంతు కలపకుండా మౌనంగా ఉండిపోయి, ఇరాన్ ప్రభుత్వ తీరు పట్ల వినూత్న నిరసనను ప్రకటించారు. దాంతో ఇరాన్ మీడియా ఈ క్రీడాకారిణులను దేశ ద్రోహులుగా చిత్రీకరించింది. దేశవ్యాప్తంగా పలు టివి ఛానళ్లు ఈ క్రీడాకారుల మీద దుమ్మెత్తిపోశాయి. ఈ దుస్థితికి తోడు ఈ మహిళా జట్టు దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయి, స్వదేశానికి తిరుగుముఖం పట్టవలసి వచ్చింది.
సినీ ఫక్కీలో...
స్వదేశంలో అడుగుపెడితే, వేధింపులకు, చిత్రహింసలకూ, శిక్షలకూ గురికాక తప్పదు. కానీ స్వదేశానికి తిరిగి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. ఈ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న ఈ క్రీడాకారిణులకు మరొక సమస్య ఎదురైంది. జట్టులోని మిగతా క్రీడాకారిణిల్లో ఒకరు వాళ్ల చిరునామా వివరాలను ఆస్ట్రేలియాలోని ఇరాన్ ఎంబసీకి చేరవేశారు. దాంతో ఈ ప్లేయర్ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ క్రమంలో, క్రీడాకారిణులు స్వదేశంలో చిత్రహింసలకు గురికాకుండా ఉండాలంటే, వాళ్లకు ఆస్ట్రేలియాలోనే ఆశ్రయం కల్పించాలంటూ కొందరు మద్దతుదారులు, ఆస్ట్రేలియా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం మానవతా ధృక్పథంతో ముందుకొచ్చి, అత్యవసరంగా వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి, స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సుముఖత ప్రదర్శించిన క్రీడాకారిణులు మినహా మిగతా ఐదుగురికీ మానవతా వీసాలను మంజూరుచేసింది. సినీ ఫక్కీని తలపించే ఈ సంఘటన అంతర్జాతీయ మీడియాతో పాటు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను సైతం ఆకర్షించడం విశేషం. ఇంతకూ ఇంతటి సంచలనానికి కారణమైన ఆ ఐదుగురు క్రీడాకారిణులు ఎవరు?
ఆ ఐదుగురు వీళ్లే!
ఫతెమె పసందిదె: టీమ్ టోర్నమెంట్ తర్వాత ఆశ్రయం పొందిన మిడ్ ఫీల్డర్
జహ్రా ఘన్‌బారి: జట్టులో కీలక సభ్యురాలు, కెప్టెన్
ఆతిఫె రంజాన్‌జాదె: స్వదేశంలో వేధింపుల భయాన్ని ఎదుర్కొంటున్న మిడ్ ఫీల్డర్
మోనా హమౌది: గోల్డ్‌కో్‌స్టలోని జట్టు శిక్షణా శిబిరంలో తలదాచుకున్న మిడ్‌ఫీల్డర్
జహ్రా సారాబాలి ఆలిషా: ఆశ్రయం పొందిన ఐదుగురిలో మిడ్‌ఫీల్డర్
హ్యుమానిటేరియన్ వీసా అంటే?
స్వదేశంలో హింస, వివక్ష లేదా ప్రాణహాని ఎదుర్కొనే వ్యక్తులకు విదేశీ ప్రభుత్వాలు కల్పించే రక్ష. ఈ వీసాతో పొందే ప్రయోజనాలు...
ఆస్ట్రేలియాలో నివసించవచ్చు
విద్య, వైద్య సదుపాయాలను పొందవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు
ఇలాంటి వీసాలు శాశ్వత నివాసానికి మార్గాన్ని సుగమం చేస్తాయి
ఇవి కూడా చదవండి..
నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు