Share News

జిమ్‌... ఇంటికొచ్చేస్తుంది..!

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:32 AM

ఆరోగ్యం కోసం ఆరాటం, దారుఢ్యం పట్ల మక్కువ ఉన్నా... జిమ్‌కు వెళ్లే తీరిక, వెసులుబాటు లేక చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు...

జిమ్‌... ఇంటికొచ్చేస్తుంది..!

విభిన్నం

ఆరోగ్యం కోసం ఆరాటం, దారుఢ్యం పట్ల మక్కువ ఉన్నా... జిమ్‌కు వెళ్లే తీరిక, వెసులుబాటు లేక చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు. ఇద్దరు ట్రైనర్స్‌ ఆలోచన ఆ దూరాన్ని తగ్గిస్తోంది. అన్‌లీ్‌ష 45... దేశంలోనే మొదటిదైన ఈ మొబైల్‌ జిమ్‌ గురించి దాని వ్యవస్థాపకుల్లో ఒకరైన పాతికేళ్ల భూమిక జయన్న చెబుతున్న విశేషాలివి.

‘‘కాలంతోపాటే జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో, వృత్తి సమయాల్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, వేళ కాని వేళ తిండి, నిద్ర, చదువులు, ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా ముప్ఫైలు వచ్చేసరికే జనం అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించుకోవడానికి, శరీర దారుఢ్యానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజంతా ఉత్సాహంగా ఉండడానికి, దీర్ఘకాలికంగా చక్కటి ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అయితే తీరికలేని వర్క్‌ షెడ్యూల్స్‌, వ్యక్తిగత బాధ్యతల వల్ల మనం ఎక్కువగా పట్టించుకోనిది ఆరోగ్యాన్ని, వ్యాయామాన్ని. ఇంట్లో వీలులేక, జిమ్‌కు వెళ్ళడానికి సమయంలేక... వ్యాయామం అవసరం, ఆసక్తి ఉన్నా చాలామంది దానికి దూరంగానే ఉంటున్నారు. దీనికి మేము చూపిస్తున్న పరిష్కారం... దేశంలోనే మొట్టమొదటి మొబైల్‌ జిమ్‌ స్టూడియో- ‘అన్‌లీ్‌ష 45’. ఈ సంచార వ్యాయామశాల ఒక సమస్య నుంచి ఉద్భవించింది.

నాట్యంతో మొదలై...

నాట్యం నాకు ఎంతో ఇష్టం. అయిదేళ్ళ వయసు నుంచి శిక్షణ తీసుకున్నాను. చదువు పూర్తయిన తరువాత... బెంగళూరులోని ఒక ప్రముఖ ఫిట్‌నెస్‌ సంస్థలో డ్యాన్స్‌ ఇనస్ట్రక్టర్‌గా చేరాను. శరీరం పని తీరు గురించి, శరీరం కదలికలకు అవసరమైన సూక్ష్మమైన అంశాల గురించి అప్పుడే తెలుసుకున్నాను. అదే నన్ను ఫిట్‌నెస్‌ వైపు ఆకర్షించింది. అక్కడే రుత్విక్‌ రాధాష్ణన్‌ నాకు పరిచయమయ్యాడు. అతను రెజ్లర్‌. అనేక పోటీల్లో పాల్గొన్నాడు. ఆ తరువాత ఒక స్కూల్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా కొన్నాళ్ళు పని చేశాడు. అయితే ఆ స్కూల్‌ యాజమాన్యం పిల్లలకు పాఠాలు నూరిపొయ్యడం తప్పితే క్రీడలను, వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకొనేది కాదు. అది అతనికి నచ్చకపోవడంతో ఉద్యోగం మానేసి.. ఫిట్‌నెస్‌ కోచ్‌గా మారాడు.

మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. సొంతంగా ఏదైనా చెయ్యాలని ప్రణాళికలు వేసుకొనేవాళ్ళం. అలా 2024లో... ఉద్యోగం వదిలేశాం. బెంగళూరులోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లలో ఉన్న జిమ్‌లు, క్లబ్‌ హౌస్‌లలో గ్రూప్‌ క్లాసులు నిర్వహించడం మొదలెట్టాం.


యూరప్‌ తరహాలో...

ఇది కొన్నాళ్ళు బాగానే గడిచినా... ‘‘బయటి నుంచి వచ్చిన శిక్షకులు తమ జిమ్‌లను, అందులోని సామగ్రిని వాడుకోవడం ఏమిటి? మాకు అనువైన సమయాల్లో వేరేవాళ్ళకు మీరు శిక్షణ ఇస్తూ ఉంటే మా వంతు కోసం ఆగాలా?’’ అంటూ అపార్డ్‌మెంట్‌వాసులు కొందరు అభ్యంతరం చెప్పారు. అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ లేదా కమ్యూనిటీలో... అందరూ ఉపయోగించే పరికరాలను వాడుకోలేకపోవడం పెద్ద సమస్య. ఈ విషయంలో చాలా గొడవలు జరిగేవి. దీంతో కమ్యూనిటీ ఎక్వి్‌పమెంట్‌ వినియోగం మాకు సవాలుగా మారింది. మా దగ్గర శిక్షణ పొందుతున్న వారి కోసం వాటి మీద ఆధారపడకుండా ఏం చేయగలం? అని ఆలోచిస్తున్నప్పుడు... యూరప్‌ తరహాలో ట్రక్కుల్లో మొబైల్‌ జిమ్‌ను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. సాధ్యాసాధ్యాలపై లెక్కలు వేసుకున్నాం. దాదాపు అయిదు లక్షలు ఖర్చు చేసి... ఒక సెకెండ్‌ హ్యాండ్‌ మారుతీ ఎకో వ్యాన్‌ను కొని, మాకు కావలసిన విధంగా డిజైన్‌ చేయించాం. డంబెల్స్‌, కెటిల్‌బెల్స్‌, స్లామ్‌ బాల్స్‌, బ్యాటిల్‌ రోప్స్‌ రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌... ఇలా అవసరమైన సామగ్రి అంతా దాన్లోనే తీసుకువెళ్ళడం, అపార్ట్‌మెంట్స్‌ దగ్గర శిక్షణ ఇవ్వడం... ఇదీ ప్రణాళిక. అలా... ‘అన్‌లీ్‌ష 45’ను ఒక సింగిల్‌ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో అయిదుగురు సభ్యులతో మొదలుపెట్టాం. ఇప్పుడు వారి సంఖ్య వందకు పైనే.’’

పిల్లల నుంచి 70 ఏళ్లవారి దాకా...

ప్రస్తుతం మాతోపాటు మరో తొమ్మిదిమంది ట్రైనర్స్‌ పని చేస్తున్నారు. సాధారణంగా వారానికి మూడు రోజుల పాటు... 45 నుంచి 50 నిమిషాల చొప్సున, కమ్యూనిటీల్లోని కామన్‌ ఏరియాల్లో సెషన్స్‌ నిర్వహిస్తున్నాం. ఒక చోట సెషన్‌ పూర్తి కాగానే... మరో చోటుకు గంట లోగానే చేరుకొని, అక్కడ శిక్షణ మొదలుపెడతాం. కొందరికి పర్సనల్‌ ట్రైనర్స్‌గానూ వ్యవహరిస్తున్నాం. పిల్లల కోసం వారాంతాల్లో ప్రత్యేక సెషన్స్‌ ఉంటాయి. గతంలో ఎన్నడూ వ్యాయామం చేయనివారు, జిమ్‌ ముఖం చూడనివారు మా దగ్గర శిక్షణ కోసం వస్తున్నారు. వారిలో చిన్న పిల్లల నుంచి డెబ్భయ్యేళ్ల వారి వరకూ ఉన్నారు. ఇది మాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. మొదట దీన్ని సవాలుగా స్వీకరించాం. కానీ ఎంతో సరదాగా కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఇది మాకు చాలా ఇష్టమైన పని. రెండో వ్యాన్‌ను కూడా కొద్దిరోజుల్లోనే సమకూర్చుకోబోతున్నాం. ఇతర రాష్ట్రాలలోని నగరాలకు కూడా మొబైల్‌ జిమ్‌లను విస్తరించాలనేది మా ఆశయం.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:32 AM