Share News

అడ్డంకులు దాటి ఆక్స్‌ఫర్డ్‌కు

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:49 AM

ఎదురుదెబ్బలు ఎదురైనా పట్టువదలని సంకల్పంతో పోరాడి... ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు 2 కోట్ల రూపాయల ‘క్లారెండన్‌ స్కాలర్‌షిప్‌’...

అడ్డంకులు దాటి ఆక్స్‌ఫర్డ్‌కు

ఎనిమిది నెలలపాటు వరుస తిరస్కరణలు... ఎదురుదెబ్బలు ఎదురైనా పట్టువదలని సంకల్పంతో పోరాడి... ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు 2 కోట్ల రూపాయల ‘క్లారెండన్‌ స్కాలర్‌షిప్‌’ సాధించిన భారతీయ యువతి వైష్ణవి రామలింగం విజయగాధ ఇది.

జీవితంలో మనం కోరుకునే కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఒక్కోసారి మన శక్తికి మించినవిగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక, విద్యాపరమైన నేపథ్యం లేని సాధారణ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనే కల కలగానే మిగిలిపోతుంది. కానీ నిరంతర శ్రమ, అచంచలమైన ఆత్మవిశ్వాసం, పట్టుదలే పెట్టుబడిగా ముందడుగు వేస్తే ఎలాంటి కష్టాన్నయినా అధిగమించి ఆకాశమే హద్దుగా రాణించవచ్చని నిరూపించింది భారత యువతి వైష్ణవి రామలింగం. ప్రపంచంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయిన బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు రూ. 2 కోట్ల విలువైన ప్రతిష్ఠాత్మక ‘క్లారెండన్‌ స్కాలర్‌షిప్‌’ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. న్యాయశాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ చేసేందుకు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత మహిళగా వైష్ణవి రికార్డులకెక్కింది. గతంలో ఈ విభాగంలో ముగ్గురు భారతీయులు మాత్రమే ఈ ఘనత సాధించారు.

సాధారణ నేపథ్యం నుంచి..

వైష్ణవి రామలింగం తన కుటుంబంలోనే విశ్వవిద్యాలయం స్థాయి చదువులు చదువుతున్న మొదటి తరం గ్రాడ్యుయేట్‌. పూణెలోని ప్రసిద్ధ సింబయాసిస్‌ లా స్కూల్‌ నుంచి బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన వైష్ణవి.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లైడెన్‌ విశ్వవిద్యాలయం నుంచి ‘ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ రైట్స్‌’ (అంతర్జాతీయ బాలల హక్కులు) అంశంలో అడ్వాన్స్‌డ్‌ ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. లైడెన్‌ యూనివర్సిటీలో కూడా ఆమె తన అసాధారణ ప్రతిభతో ‘లైడెన్‌ యూనివర్సిటీ ఎక్స్‌లెన్స్‌ స్కాలర్‌షిప్‌’ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.


ఆందోళన.. ఒంటరితనం

మొదటి తరం విద్యార్థులు ఉన్నత విద్యారంగంలో.. ముఖ్యంగా విదేశీ చదువుల విషయంలో ఎదుర్కొనే మానసిక ఇబ్బందులను వైష్ణవి పంచుకుంది. ‘‘మన కుటుంబంలో ఎవరూ వెళ్లని కొత్త మార్గంలో ఒంటరిగా ప్రయాణించడం, చదువుల విషయంలో సరైన దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు ఇంట్లో లేకపోవడం ఒక రకమైన ఆందోళనకు, ఒంటరితనానికి గురిచేస్తుంది. ఇతరులకు ఎంతో సాధారణంగా అనిపించే రోజువారీ విద్యావిషయాలు మనకు ఎంతో దూరంగా, పూర్తిగా కొత్తగా అనిపిస్తాయి. అయితే లైడెన్‌ యూనివర్సిటీలో నా ప్రొఫెసర్లు నాలోని పరిశోధనా ప్రతిభను గుర్తించి ఆక్స్‌ఫర్డ్‌కు దరఖాస్తు చేయమని చెప్పి నన్ను ప్రోత్సహించారు. నాపై నాకంటే ఎక్కువగా వారు నమ్మకం ఉంచారు. వారి నమ్మకం, అందించిన మద్దతు లేకపోతే నేను అసలు ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థకు దరఖాస్తు చేసేదాన్నే కాదు’’ అని వైష్ణవి అన అనుభవాలను పంచుకుంది.

పరిశోధనల్లో అంతర్జాతీయ గుర్తింపు

వైష్ణవి స్కాలర్‌షిప్‌ సాధించడమే కాకుండా.. అంతర్జాతీయ పరిశోధన రంగంలోనూ అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. బాలల హక్కులపై ఆమె రాసిన మాస్టర్స్‌ థీసి్‌సకు నెదర్లాండ్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ‘రాయల్‌ హాలండ్‌ సొసైటీ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ (కెహెచ్‌ఎండబ్ల్యూ) జాన్‌ బ్రూవర్‌ థీసిస్‌ ప్రైజ్‌ 2026’ లభించింది. బాలల మానసిక వికాసానికి, సమాజలో తోటివారితో ఉండే పరస్పర సంబంధాలు ఎంత ముఖ్యమనే నూతన అంశంపై ఆమె చేసిన పరిశోధన అంతర్జాతీయ చట్టపరమైన నిపుణుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుత సమాజంలో పిల్లల మానసిక ఆరోగ్యంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, చట్టంలో ఎక్కడా స్పష్టంగా లేని బాలల హక్కుల కోణాన్ని ఆమె తన థీసిస్‌ ద్వారా ప్రపంచానికి చూపించారు. ఆక్స్‌్‌ఫర్డ్‌లో కూడా ఆమె బాలల హక్కుల అంశంపైనే తన పీహెచ్‌డీ పరిశోధనను కొనసాగించనున్నారు.

3-Navya.jpg

స్ఫూర్తిదాయక సందేశం

వైష్ణవి సాధించిన ఈ విజయం భారత్‌లోని ఎందరో సాధారణ విద్యార్థులకు, ముఖ్యంగా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వశక్తితో పైకి రావాలనుకునే వారికి గొప్ప స్ఫూర్తినిస్తోంది. ‘‘నచ్చిన రంగంపై ఇష్టాన్ని, పట్టుదలను పెంచుకుని నిలబడితే అవకాశాలు కచ్చితంగా వస్తాయి. ఆక్స్‌ఫర్డ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలను చూసి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుని ముందే వెనకడుగు వేయకూడదు. మనల్ని మనం తక్కువ చేసుకుని ప్రయత్నించకుండా ఉండటమే మనం చేసే మొదటి తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నాన్ని మానుకోవద్దు’’ అంటూ తోటి విద్యార్థులకు వైష్ణవి ఇచ్చిన పిలుపు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. వరుస ఓటముల అంచుల నుంచి స్వశక్తితో, ఒంటరి పోరాటంతో ప్రపంచస్థాయి శిఖరాగ్రానికి చేరిన వైష్ణవి ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.


వరుస తిరస్కరణలు

వైష్ణవి సాధించిన ఈ అద్భుత విజయం వెనుక 8 నెలల నిరాశ, వరుస తిరస్కరణలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం, పరిశోధనల కోసం ఆమె చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ సమయంలో తీవ్ర నిరాశకు లోనై.. అసలు దరఖాస్తు చేయవద్దని అనుకున్న చోట.. దేశం గర్వించే అత్యుత్తమ ఫలితం దక్కిందని వైష్ణవి చెప్పుకొచ్చింది. ‘క్లారెండన్‌ స్కాలర్‌షి్‌ప’కు ఎంపికయ్యావంటూ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఈమెయిల్‌ వచ్చినప్పుడు తన ఆనందానికి అవధులు లేవని గుర్తుచేసుకుంది. వైష్ణవి సాధించిన అసాధారణ విజయాన్ని ‘ఆక్స్‌ఫర్డ్‌’ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా అభినందించింది.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 04:49 AM