ఎవరె్‌స్టపై హ్యాట్రిక్!
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:18 AM
ఎవరెస్ట్... దాన్ని జీవితంలో ఒక్కసారైనా అధిరోహించాలనేది పర్వతారోహకుల కల. ఒక్కసారి కాదు... వరుసగా మూడేళ్ళు ఎవరెస్ట్ మీద ‘టెన్జింగ్-హిల్లరీ మారథాన్‌ను పూర్తి చేసి చరిత్ర సృష్టించారు...
ఎవరెస్ట్... దాన్ని జీవితంలో ఒక్కసారైనా అధిరోహించాలనేది పర్వతారోహకుల కల. ఒక్కసారి కాదు... వరుసగా మూడేళ్ళు ఎవరెస్ట్ మీద ‘టెన్జింగ్-హిల్లరీ మారథాన్‌ను పూర్తి చేసి చరిత్ర సృష్టించారు నౌషీన్ బాను చంద్. ఈ క్రమంలో పలు రికార్డులను పాదాక్రాంతం చేసుకున్న ఆమె ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కల్పనా చావ్లా’ పురస్కారాన్ని అందుకున్నారు. సహనానికి, పట్టుదలకు ప్రతిరూపంగా యువతకు స్ఫూర్తినిస్తున్న నౌషీన్ సాహసోపేతమైన ప్రయాణం ఇది.
నౌషీన్ బాను చంద్ స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. క్రీడలంటే ఆమెకు చిన్న వయసు నుంచి ఆసక్తి. ‘‘అప్పుడు నాకు ఆరేళ్ళుంటాయి. మేము ఈరోడ్‌లో ఉండేవాళ్ళం. మా ఇంటికి దగ్గరగా ఒక ప్రార్థనా మందిరం, దాని పక్కన ఒక కొండ ఉండేవి. మా నాన్న ప్రోత్సాహంతో ఆ కొండ ఎక్కాను. పర్వతారోహణలో తొలి అడుగు అలా పడింది’’ అని గుర్తు చేసుకున్నారు నౌషీన్. క్రీడల్లో ఆమె చాలా చురుగ్గా ఉండేవారు. దానివల్ల సామాజికంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘‘దిగువ తరగతికి చెందిన ముస్లిం కుటుంబాలల్లో మహిళలకు వివాహం, కుటుంబానికి మించి కలలేవీ ఉండకూడదని కొందరు ఆక్షేపించారు. కానీ ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా తల్లిదండ్రులు క్రీడలపట్ల నాకున్న ఇష్టాన్ని గుర్తించారు. ఆ దిశగా ప్రోత్సహించారు’’ అని చెప్పారు నౌషీన్. ఒక వైపు చదువులో రాణిస్తూనే మరోవైపు క్రీడాసక్తిని కూడా కొనసాగించారు. వైమానిక దళంలో చేరాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా... వైమానిక దళానికి ఎంపిక కాలేదు. దాంతో ఆమె తీవ్ర నిస్పృహకు గురయ్యారు. దాని నుంచి బయటపడడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఆ తరువాత చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరారు. అక్కడ త్రిలోక్‌చంద్రన్ అనే కోచ్ దగ్గర పర్వతారోహణలోని ప్రాథమిక అంశాలలో శిక్షణ పొందారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఓర్పును పెంపొందించుకోవడానికి ట్రయల్ రన్నింగ్ క్రీడను ఎంచుకున్నారు. అప్పుడే ఆమె దృష్టి ‘టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్’ మీద పడింది.
నగలు తాకట్టు పెట్టి...
అది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన, అత్యంత ఎత్తులో సాగే మారథాన్లలో ఒకటి. ఇది 42.195 కిలోమీటర్ల దూరం... గడ్డ కట్టించే ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ తక్కువగా ఉండడం, కఠిమైన పర్వత మార్గాలు... ఇలా మాటల్లో వర్ణించలేనంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సాగుతుంది. కఠోరమైన శిక్షణ, అంతులేని పట్టుదల ఉన్నవారు మాత్రమే దీనికి ప్రయత్నించగలరు. ఆ సవాల్‌ను స్వీకరించాలని నౌషీన్ నిశ్చయించుకున్నారు. అంతకుముందు లడఖ్‌లో 22 కిలోమీటర్ల ఇన్‌లైన్ స్కేటింగ్‌ను పూర్తి చేసి, తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. అయితే అనుకోని ఆటంకం ఆమెకు ఎదురయింది. ‘‘మా కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. మా నాన్న ఫార్మసి్‌స్టగా పని చేసి రిటైరయ్యారు. మా అన్నయ్య చిన్న వ్యాపారం చేస్తాడు. మారథాన్‌కు సన్నద్ధం కావడానికి, నా ప్రయాణానికి డబ్బు సమకూర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు నా పెళ్ళి కోసం దాచిన నగలను మా నాన్న తాకట్టు పెట్టారు’’ అని చెప్పారు నౌషీన్. ఒక్కొక్క అవరోధాన్నీ దాటి... 2024లో ‘టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్’లో పాల్గొన్నారు. దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తొలి తమిళ మహిళగా చరిత్రకెక్కారు. ‘‘ఆ మారథాన్ నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకొనేలా చేసింది. మళ్ళీ మళ్ళీ చేయాలనే ఆకాంక్షను రగిలించింది’’ అంటారు నౌషీన్.
అది మరచిపోలేని క్షణం...
అందుకే... 2025లో, ఈ ఏడాది మేలో... వరుసగా మరో రెండుసార్లు పాల్గొని.... వరుసగా మూడేళ్ళు ఈ మారథాన్‌ను పూర్తి చేసిన భారతీయ మహిళా అథ్లెట్‌గా నిలిచారు. అంతేకాదు.. ఈ ఏడాది ఈ మారథాన్ రేసులో 254 మంది అంతర్జాతీయ పర్వతారోహకులు పాల్గొంటే.. వారిలో పూర్తి మారథాన్‌ను ముగించిన ఏకైక భారతీయ మహిళ నౌషీన్. ఆమె ఘనతకు గుర్తింపుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ‘కల్పనా చావ్లా పురస్కారం’ ప్రకటించింది. గొప్ప ధైర్య సాహసాలు కనబరిచిన మహిళలకు ఇచ్చే ఆ పురస్కారాన్ని... ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు.
‘‘ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. నన్ను అభినందిస్తూ ఎందరో కాల్స్ చేస్తున్నారు. కొందరు అమ్మాయిలు... నేను తమకు స్ఫూర్తి అని చెబుతున్నారు. వారిలో కొందరైనా క్రీడల్లో ఆసక్తి పెంచుకొని, రాణిస్తే... నాకు అంతకన్నా సంతృప్తినిచ్చేది ఇంకేముంటుంది?’’అంటున్నారు ముప్ఫయ్యేళ్ళ నౌషీన్.
ఈ రేసులో 254 మంది అంతర్జాతీయ పర్వతారోహకులు పాల్గొంటే.. వారిలో పూర్తి మారథాన్‌ను ముగించిన ఏకైక భారతీయ మహిళ నౌషీన్. ఆమె ఘనతకు గుర్తింపుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ‘కల్పనా చావ్లా పురస్కారం’ ప్రకటించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం