మారేడు పూల హల్వా
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:05 AM
మారేడు చెట్టును శివుడిపై భక్తి కొద్దీ పెంచుకునేవారే ఎక్కువ. కానీ దాని ఆకులు, పూలు, కాయలు, అన్నీ ఔషధ ప్రయోజనం కలిగినవే. మర్రి, రావి, మారేడు... ఇవి ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ని తీసుకుని...
భోజనకుతూహలం
నిహన్యాద్బిల్వజం పుష్పమతీసారం తృషాం వమీమ్!
మారేడు చెట్టును శివుడిపై భక్తి కొద్దీ పెంచుకునేవారే ఎక్కువ. కానీ దాని ఆకులు, పూలు, కాయలు, అన్నీ ఔషధ ప్రయోజనం కలిగినవే. మర్రి, రావి, మారేడు... ఇవి ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ని తీసుకుని ఎక్కువ ఆక్సిజన్‌ని ఇచ్చే మహావృక్షాలు. ‘భోజన కుతూహలం’ గ్రంథంలో ఆహార యోగ్యమైన పువ్వుల గురించిన ప్రకరణం ప్రారంభిస్తూ మారేడు పూలను మొదటగా ప్రస్తావించారు. భక్తి ప్రాధాన్యత కాదు, ఆహార ప్రాధాన్యత అది! మారేడు (బిల్వ- ఇండియన్ బేల్) పూలు నీళ్ల విరేచనాలను తగ్గిస్తాయి, దప్పిక తీరుస్తాయి. వాంతుల్ని ఆపుతాయని ‘భోజన కుతూహలం’ పేర్కొంది.
మారేడు కాయ గుజ్జు అమీబియాసిస్ వ్యాధి నియంత్రణకు పని చేస్తుంది కానీ, మారేడు పువ్వులు అతిసార వ్యాధుల్ని కూడా అరికట్టగలవని దీని తాత్పర్యం. బాక్టీరియా కారణంగా పేగులలో వచ్చే వ్యాధుల్ని అరికట్టడానికి మారేడు పూలు తోడ్పడతాయి. మనం ‘ఫుడ్ పాయిజనింగ్’కి లోనవుతూ ఉంటాం. బయట ఆహారం తినటం తప్పనిసరి అయినవాళ్లు తరచూ మారేడు పూలు లేదా ఆకులు, కాయలు... వీటిలో ఏది దొరికినా వాడుకుంటూ ఉండాలి. దీనివల్ల పొట్ట మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఇవి తాజాగానే ఉండాలని లేదు. ఎండించి, దంచి, భద్రపరచుకుని రోజూ ఒక చెంచా పొడిని నీళ్లలో వేసి మరిగించి టీ లాగా తాగవచ్చు. మారేడుని వాత వ్యాధుల్ని తగ్గించే ఔషధం అని చరకుడు ప్రముఖంగా పేర్కొన్నాడు. మారేడు వేరు దశమూలాలలో ఒకటి. దశమూలాలు వాత వ్యాధుల్ని హరించేవిగా ప్రసిద్ధి.
మారేడు పూలు చలవనిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి. అందువలన ఎసిడిటీ కారణంగా వచ్చే సమస్యలన్నింటిపైనా పనిచేస్తాయి. మారేడు పూలను నేతితో వేగించి హల్వా చేసుకుని ఫ్రిజ్జులో భద్రపరచుకుని రోజూ ఒక చెంచా మోతాదులో తీసుకోవచ్చు.
తీసుకున్న అహారం వంటబట్టకపోవటం, తినగానే విరేచనానికి వెళ్లాల్సిరావటం, మలబద్ధత, గ్యాసు, పేగుపూత, కడుపులో నొప్పి, నీరసం, నిస్సత్తువ లాంటి లక్షణాలన్నీ ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ అనే వ్యాధిని సూచిస్తాయి. దీనిపైన మారేడు ఆకులు, పూలు, కాయ లోపలి గుజ్జు ఔషధంగా పనిచేస్తాయి. ఇది చిట్కా వైద్యం కాదు... ఆయుర్వేదంలో బిల్వారిష్ట, బిల్వాది గుటిక లాంటి ఔషధాలు దీనిపైన పనిచేసేవి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. వైద్యుడి సలహా మేరకు వాడవచ్చు.
గంగరాజు అరుణాదేవి
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు