మీ స్పేస్ మీకుందా..?
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:59 AM
అనుబంధాలకు అంకితమవడం మంచిదే. కానీ ఆ క్రమంలో మహిళలు తమ వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను కోల్పోకుండా చూసుకోవడమే నిజమైన బంధానికి బలమైన పునాది....
అనుబంధాలకు అంకితమవడం మంచిదే. కానీ ఆ క్రమంలో మహిళలు తమ వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను కోల్పోకుండా చూసుకోవడమే నిజమైన బంధానికి బలమైన పునాది.
మన సమాజంలో మహిళకు సంబంధాలు ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యమైనవి. కూతురిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా.. ప్రతి పాత్రలోనూ నూటికి నూరుశాతం ఒదిగిపోవడానికి ఆమె నిరంతరం తపిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలు, వారి అవసరాలు, సంతోషమే తన సంతోషంగా భావించి జీవించడం మన ఇళ్లలో తరతరాలుగా చూస్తున్నదే. అయితే, ఆధునిక జీవనశైలిలో ఈ బంధాల నిర్వహణలో మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ‘మై స్పేస్’ (తన ఉనికి) లేదా వ్యక్తిగత గుర్తింపును కోల్పోవడం.
వ్యక్తిత్వాలను దాచుకోవద్దు
ఒక మంచి బంధం అంటే.. ఇద్దరు వ్యక్తులు కలిసి నడవడం. అంతేతప్ప ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు పూర్తిగా కప్పేసుకోవడం కాదు. ప్రేమ, బాధ్యత పేరుతో తమకు నచ్చిన హాబీలను వదిలేయడం, కెరీర్ ఆశయాలను అణచివేసుకోవడం, లేదా కనీసం ప్రశాంతంగా కాసేపు గడిపే సమయాన్ని కూడా త్యాగం చేయడం సరైన పద్ధతి కాదు. బంధంలో త్యాగం ఉండాలి. కానీ, అది ఒకవైపు నుంచే నిరంతరం జరిగే సమర్పణ కాకూడదు.
అలా చెప్పడం స్వార్థం కాదు
ఈ సమస్యకు ప్రధాన పరిష్కారం ‘ఎమోషనల్ బౌండరీస్’.. అంటే భావోద్వేగపు సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడం. కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వరిస్తూనే.. తనకంటూ రోజులో కనీసం గంట సమయాన్ని కేటాయించుకోవడం మహిళకు ఎంతో అవసరం. ఆ సమయంలో పుస్తకం చదవడం, వర్కౌట్ చేయడం, పాత మిత్రులతో మాట్లాడటం లేదా ఖాళీగా కూర్చోవడం వంటివి మానసిక రీచార్జ్‌లా పనిచేస్తాయి. ‘‘నాకు కూడా కాస్త సమయం కావాలి’’ అని భాగస్వామికి లేదా కుటుంబానికి స్పష్టంగా, మృదువుగా చెప్పడం స్వార్థం అనిపించుకోదు, అది ఆత్మగౌరవానికి సంకేతం.
మనసు విప్పి మాట్లాడటం
సంబంధాలలో ఓపెన్ కమ్యూనికేషన్ (మనసు విప్పి మాట్లాడటం) అత్యంత కీలకం. మనసులోని అసంతృప్తులను, అలసటను లోపలే అణచివేస్తే అవి కాలక్రమేణా అసహనంగా మారే ప్రమాదం ఉంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కేవలం ఇంటి పనులు, పిల్లల చదువులే కాకుండా.. తన భావోద్వేగాలు, ఆశయాలు, భయాల గురించి చర్చించే వాతావరణాన్ని మహిళలు చొరవ తీసుకుని ఏర్పరచుకోవాలి.
ఆమె సంతోషంగా ఉంటేనే..
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉన్న మహిళ మాత్రమే తనచుట్టూ ఉన్న కుటుంబానికి పరిపూర్ణమైన సంతోషాన్ని పంచగలదు. తనను తాను ప్రేమించుకోవడం, తనకంటూ ఒక గుర్తింపును నిలుపుకోవడం వల్ల బంధాలు బలహీనపడవు సరికదా.. మరింత ఆరోగ్యకరంగా, పటిష్ఠంగా మారతాయి. ఆత్మగౌరవం, ఆత్మీయత సరిసమానంగా ఉన్నప్పుడే ఏ బంధమైన శోభనిస్తుంది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..