Share News

ఆమె సంకల్పంతో... సాగుకు భరోసా

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:30 AM

మట్టిని ఎక్కడోవున్న ల్యాబ్‌కు పంపడం... ఆ ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురుచూడటం... ఈలోపు పంట వేయాల్సిన సమయం మించిపోవడం... వీటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు ఐఐటీ ముంబయి...

ఆమె సంకల్పంతో... సాగుకు భరోసా

స్ఫూర్తి

ప్రతిసారి విత్తనాలు నాటే ముందు మట్టిని పరీక్షించడంలో ఎన్నో సమస్యలు...

మట్టిని ఎక్కడోవున్న ల్యాబ్‌కు పంపడం... ఆ ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురుచూడటం... ఈలోపు పంట వేయాల్సిన సమయం మించిపోవడం... వీటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు ఐఐటీ ముంబయి శాస్త్రవేత్త డాక్టర్‌ రాజుల్‌ పాట్కర్‌.

నిమిషాల వ్యవధిలో... అదీ వ్యవసాయ క్షేత్రంలోనే... సాయిల్‌ హెల్త్‌ను తెలుసుకొనే పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా రైతులకు మేలు మాత్రమే కాదు... గ్రామీణ మహిళలకు ఉపాధి మార్గం కూడా చూపిన రాజుల్‌ జర్నీ ఇది.

‘‘ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న భూసార పరీక్ష పద్ధతులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఎందుకంటే రైతులు మట్టి నమూనాను ప్రయోగశాలకు పంపాలి. దాని ఫలితాలు రావడానికి కనీసం పదిహేను రోజులు పడుతుంది. సమయానికి విత్తనాలు నాటే క్రమంలో అప్పటికే నేలలో ఎరువులు వేసి ఉంటారు. ఈ అంశమే రైతుల్లో భూసార పరీక్ష పట్ల విముఖత వ్యక్తమవడానికి కారణం అవుతోంది. దేశంలో సుమారు పధ్నాలుగు కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ అందుబాటులో ఉన్నది మూడు వేల ల్యాబ్‌లు మాత్రమే. అలాగని మట్టిని పరీక్షించకుండా పంట వేస్తే సత్ఫలితాలు రావడంలేదు. ఐదు దశాబ్ధాల కిందట రెండు టన్నుల దిగుబడికి హెక్టారుకు 54 కిలోల ఎరువులు అవసరమయ్యేవి. ఇప్పుడు అదే మొత్తానికి 280 కిలోలు వాడాల్సివస్తోంది. రసాయన ఎరువులను అసమతుల్యంగా వినియోగించడంవల్ల నేల ఆరోగ్యం బలహీనపడుతుంది. నాణ్యత క్షీణించి దిగుబడి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనికి పరిష్కారంగానే డాక్టర్‌ ముకుల్‌సింగ్‌తో కలిసి ‘న్యూట్రిసెన్స్‌’ డివైజ్‌ను తీసుకువచ్చాను. విత్తనాలు వేసేముందు తప్పనిసరిగా మట్టిని పరీక్ష చేయించుకోవాలని రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నాను. ఇది ప్రపంచంలోనే అతిచిన్న సాయిల్‌ టెస్ట్‌ పరికరం. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఉపయోగించడం చాలా సులువు.


ఆ అనుభవంతో...

మహారాష్ట్రలోని పుణే మాది. 1992లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాను. తరువాత ఐఐటీ బాంబేలో ఎంటెక్‌ చదివాను. అక్కడే రీసెర్చ్‌ స్కాలర్‌గా ఆరేళ్లకు పైగా ఉన్నాను. 2017లో ‘ప్రాక్సిమల్‌ సాయిల్‌సెన్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను నెలకొల్పాను. అదేసమయంలో ఐఐటీ బాంబే తరుఫున ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో సీనియర్‌ రీసెర్చ్‌ సైంటి్‌స్టగా సేవలు అందించాను. వివిధ రకాల సెన్సార్‌లను అభివృద్ధి చేశాను. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి, నీటి పరీక్షలకు సంబంధించి పోర్టబుల్‌, సెన్సార్‌ డివైజ్‌లపై పరిశోధనలు జరిపాం. ఈ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడింది.

2-Navya.jpg

గ్లూకోమీటర్‌ స్ఫూర్తితో...

వాస్తవానికి పదిహేనేళ్ల కిందటి ప్రాజెక్ట్‌ ఇది. ఐఐటీ బాంబేలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. నాకు వ్యవసాయంలో ఎలాంటి ప్రవేశం లేదు. అయితే ఇతర విద్యార్థులను చూసి నాకు కూడా ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. కానీ డాక్టరేట్‌ డిగ్రీ కంటే నా పరిశోధన సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలని అనుకున్నాను. అలా సాయిల్‌ టెస్ట్‌ పరికరాలపై పరిశోధన మొదలుపెట్టాను. గ్లూకోమీటర్ల ఆవిష్కరణతో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కొలవడం సులువైంది. మట్టిని పరీక్షించడానికి కూడా ఇలాంటి పరికరాన్ని ఎందుకు తయారుచేయకూడదు! ఈ ఆలోచన నన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు. గ్లూకోమీటర్‌ను పోలిన విద్యుత్‌- రసాయన ఆధారిత సాంకేతికతపై పరిశోధన ప్రారంభించాను.

పదేళ్ల శ్రమకు ఫలితం...

దశాబ్దానికి పైగా పరిశోధన తరువాత 2022లో సాయిల్‌ టెస్ట్‌ పరికరం నమూనా... ‘న్యూట్రిసెన్స్‌’ తయారు చేయగలిగాను. ఇది ఒక చిన్న పరికరం. మట్టిలోని పీహెచ్‌, విద్యుత్‌ వాహకత, నైట్రేట్‌, ఫాస్పేట్‌, పొటాషియం... ఇలా ఆరు పారమితులను పరీక్షిస్తుంది. కాగితం ఆధారిత సెన్సార్‌ స్ర్టిప్‌లతో ఇది వస్తుంది. ఎక్కడో ఉన్న ప్రయోగశాలలకు అర కిలో మట్టి నమూనాలను పంపే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా... నేరుగా దీన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లవచ్చు. చిన్న సీసాలో మూడు మిల్లీలీటర్ల ఏజెంట్‌ ద్రావకాన్ని పోసి, అందులో గ్రాము మట్టి వేసి, బాగా కలిపి, అరగంట పక్కన పెట్టాలి. తరువాత ఆ ద్రావకం చుక్కను సెన్సర్‌పై వేస్తే, ఆరు పారామీటర్ల ఫలితాలు ఐదు నిమిషాల్లో వచ్చేస్తాయి. ప్రతి పారమితిని కొలవడానికి దాదాపు ముప్ఫై సెకన్లు పడుతుంది. అనంతరం సాయిల్‌ హెల్త్‌ రికార్డు సిద్ధమతువుతుంది. దీన్ని మొబైల్‌ ఫోన్‌లో తక్షణమే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


విజయవంతంగా...

ఏడు నెలల కిందట వాణిజ్య అవసరాలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేశాను. అసోం, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రైతులు ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వేలకు పైగా సెన్సార్‌ స్ర్టిప్‌లను విక్రయించాం. ఐఐటీ ధన్‌బాద్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.అనంతకృష్ణన్‌... ఝార్ఖండ్‌లోని రైతులకు ఈ పరికరం వినయోగం, ఉపయోగం గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీని ఖరీదు రూ.35 వేలు. మార్కెట్‌లో లభించే ఇతర పరికరాల ధరలతో పోలిస్తే యాభై శాతం తక్కువ. రాబోయే రోజుల్లో సగం ధరకే మా పరికరాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఇది ఏడాదికి కనీసం మూడు వేల మట్టి పరీక్షలు చేయగలదు. విత్తనాలు వేయడానికి ముందు నేలపై అవగాహన, మెరుగైన దిగుబడి కోసం ప్రతి వ్యవసాయదారుడి వద్ద ఈ పరికరం ఉండటం అవసరంగా భావిస్తున్నా.’’

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 04:30 AM