Share News

కలలు నిజం చేస్తున్నారు

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:14 AM

ధైర్యంగా కలలు కనండి. అవి నెరవేరేలా చేస్తాం... ఇదీ సురభి యాదవ్‌ నినాదం. ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థిని అయిన ఆమె గ్రామీణ యువతుల స్వావలంబన కోసం కృషి చేస్తున్నారు. వారికి...

కలలు నిజం చేస్తున్నారు

ధైర్యంగా కలలు కనండి. అవి నెరవేరేలా చేస్తాం... ఇదీ సురభి యాదవ్‌ నినాదం. ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థిని అయిన ఆమె గ్రామీణ యువతుల స్వావలంబన కోసం కృషి చేస్తున్నారు. వారికి నైపుణ్య శిక్షణ అందించి... ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు. ‘జీవితంలో ఏ గెలుపుకైనా చదువే మూలం’ అంటున్న సురభి కథ ఇది.

‘‘మాది మధ్యప్రదేశ్‌ పరిధిలో ఉన్న బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. మా ఇంట్లో కాలేజీకి వెళ్ళిన మొదటి మహిళను నేనే. చదువు పట్ల నా ఆసక్తిని గమనించిన నా తల్లిదండ్రులు నా ఆకాంక్షలకు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే మా ఊర్లో పూర్తిగా విద్యావంతుడై, ప్రభుత్వ ఉద్యోగం చేసిన తొలి వ్యక్తి మా నాన్న. ఆయన స్ఫూర్తితోనే... ఉన్నత విద్యావంతురాల్ని కావాలనుకున్నాను. ఢిల్లీ ఐఐటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. మా ప్రాంతం లో చాలామంది మహిళలకు ఈ అదృష్టం లేదు. ఏదైనా గొప్పగా సాధించాలని కనీసం కలలు కనే హక్కు కూడా వారికి లేదు. మహిళలు ఎన్నో రకాలుగా ఎదుర్కొంటున్న వెనుకబాటును, అణచివేతను నేను ప్రత్యక్షంగా చూశాను. వారికోసం ఏం చెయగలను? ఈ ఆలోచన నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. సామాజిక రంగంలోనే నా కెరీర్‌ వెతుక్కుందామనుకొని... ఒక పెద్ద సంస్థలో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఈలోగా అమెరికాలోని ఒక యూనివర్సిటీలో మాస్టర్స్‌ సీటు వచ్చింది.

అదే లక్ష్యంగా...

అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ అందుకొని... ఇండియాకు తిరిగి వచ్చాను. ఒక స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్‌గా చేరాను. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల స్థితుగతుల్ని తెలుసుకొనే అవకాశం దొరికింది. నేను ఏం చేయాలనే స్పష్టత వచ్చింది. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు నన్ను సంప్రదించారు. వాళ్ళు అణగారిన వర్గాలకు చెందినవారు. అతి కష్టంమీద ఇంటర్‌ వరకూ చదివారు. ‘‘ఇక చదువు చాలు. పెళ్ళి చేసుకోండి’’ అని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని, ఇంకా చదువుకొని తమ కాళ్ళమీద తాము నిలబడాలని అనుకుంటున్నామని వారు చెప్పారు. వారి స్నేహితులు మరికొందరు కూడా నాతో సంభాషించారు. వారి కలల గురించి, వారి ఆసక్తుల గురించి తెలుసుకున్నాను. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన, పేదరికంలో మగ్గుతున్న అమ్మాయిలు పెద్దగా ఏదైనా సాధించాలని కలలు కనడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం తమకు ఉందని నమ్మి, ముందుకు వచ్చేవారికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి మార్గం చూపడమే లక్ష్యంగా 2021లో ‘సాఝే సప్నే’ అనే సంస్థ ఏర్పాటు చేశాను. దానికి అనుబంధంగా మొదటి ‘సప్నా సెంటర్‌’ను ప్రారంభించాను.


7-Navya.jpg

100కు పైగా గ్రామాల నుంచి

అప్పుడు నాకు ఎదురైన ప్రధానమైన అవరోధం... నిధుల కొరత. సొంత డబ్బు పదిహేను లక్షలు సమకూర్చుకున్నాను. అది చాలకపోవడంతో... కొందరు స్నేహితుల ప్రోత్సాహంతో క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం ప్రచారం ప్రారంభించాను. నేను చేయదలుచుకున్న కార్యక్రమాల గురించి స్పష్టంగా వివరించాను. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. మూడు రోజుల్లోనే రూ.26 లక్షలు సమకూరాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంద్‌బరి గ్రామంలో 28 మంది అమ్మాయిలతో మొదటి బ్యాచ్‌ మొదలయింది. ఆ శిక్షణ ఫలితాలు ఆశావహంగా ఉండడంతో... మరింత విస్తరించాలనుకున్నాను. ఔత్సాహికులైన మరికొందరు కూడా నాతో కలిశారు. ఆసక్తి, సామర్థ్యం కలిగిన, జీవితంలో ఏదైనా సాధించాలనే కలలు కంటున్న గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలను గుర్తించాం. వారి కుటుంబాలను ఒప్పించి, నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మేనేజిమెంట్‌ కోర్సులు, కోడింగ్‌, ప్రాథమిక బోధన లాంటి అంశాలు వీటిలో ప్రధానమైనవి. ఈ శిక్షణ ఏడాది కాలం ఉంటుంది. ఆ సమయంలో వారికి అవసరమైనవన్నీ సమకూరుస్తున్నాం. అప్పటివరకూ ల్యాప్‌టా్‌పను కనీసం చూడని అమ్మాయిలు... కోడింగ్‌లో నిష్ణాతులు కావడం చూస్తున్నప్పుడు మా ఆనందానికి అవధులు ఉండవు. పలు సంస్థలను సంప్రదించి, వారి ఉద్యోగ అవకాశాలకు సాయం చేసే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొంది... పది నుంచి పాతిక వేల రూపాయల నెల జీతానికి చేరిన కొందరు ఇప్పుడు యాభై వేలకు పైగా ఆర్జిస్తున్నారు. గత అయిదేళ్ళలో దాదాపు 200 మందికి పైగా శిక్షణ తీసుకున్నారు. వీరిలో హిమాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన... వందకు పైగా గ్రామాలవారు ఉన్నారు.’’

ఆ స్వాతంత్ర్యాలు అవసరం

శిక్షణ తీసుకునేవారిని ‘సప్నేవాలీ’గా వ్యవహరిస్తాం. శిక్షణ తీసుకొని, ఉద్యోగాలు పొందినవారు ఇప్పుడు ఆర్థికంగా సాయపడుతున్నారు. వారి ద్వారా రూ.10లక్షలు సమకూరాయి. ఇప్పుడు బిహార్‌, మధ్యప్రదేశ్‌ల్లో కూడా మా ‘సప్నా సెంటర్లు’ మొదలయ్యాయి. మహిళలకు నాలుగు విషయాల్లో స్వాతంత్య్రం అవసరమని నా అభిప్రాయం. మొదటిది బాగా చదువుకొని ఆర్థిక స్వావలంబన సాధించడం, రెండోది తమ పెళ్ళి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, మూడోది ప్రతి కుటుంబ నిర్ణయంలో భాగస్వామ్యం. నాలుగోది తమకు నచ్చిన ప్రదేశాలకు పర్యటించగలగడం. వీటన్నిటికే కాదు... జీవితంలో ఏ గెలుపుకైనా మూలం చదువే. అలాగే నైపుణ్యం, జీవితంలో గెలవాలనే పట్టుదల కూడా. వాటిని అమ్మాయిల్లో పెంచడానికి నేను, మా వాలంటీర్లు ప్రయత్నిస్తున్నాం.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:14 AM