Share News

ఖండాంతరాల్లో ఆమె స్ఫూర్తి

ABN , Publish Date - Apr 27 , 2026 | 03:02 AM

ఆమె పుట్టింది పల్లెటూరిలో.. ఆరుగురు ఆడపిల్లల కుటుంబంలో కట్టుబాట్లు, ఆర్థిక పరిమితులు.. అయినా ‘నేను చేయగలను’ అనే ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం. న్యూజిలాండ్‌, ఆమెరికా..

ఖండాంతరాల్లో ఆమె స్ఫూర్తి

ఆమె పుట్టింది పల్లెటూరిలో.. ఆరుగురు ఆడపిల్లల కుటుంబంలో కట్టుబాట్లు, ఆర్థిక పరిమితులు.. అయినా ‘నేను చేయగలను’ అనే ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం. న్యూజిలాండ్‌, ఆమెరికా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి, ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్‌ లీడర్‌గా ఎదిగి, అక్కడి రాజకీయాల్లోనూ తెలుగు గళాన్ని వినిపించిన హైమారెడ్డి ఉల్పాల ప్రస్థానం ఇది.

‘‘తెలంగాణలోని నారాయణపేట జిల్లా నిడుగుర్తి నేను పుట్టిన ఊరు. మా నాన్న నర్సిరెడ్డి డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేసేవారు. ఉద్యోగ రీత్యా ఆయన నిరంతరం బదిలీలపై వెళ్తుంటే.. మా అమ్మ రుక్మిణి ఒకవైపు వ్యవసాయాన్ని చూసుకుంటూనే ఆరుగురు పిల్లలను క్రమశిక్షణతో పెంచారు. చదువుకోకపోయినా అమ్మలో అసాధారణమైన నాయకత్వ లక్షణాలు ఉండేవి. వ్యవసాయాన్ని మేనేజ్‌ చేయడం, కూలీలను చూసుకోవడం, ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటాన్ని చూస్తూ పెరిగాను. ఆ ధైర్యం, ఆ నాయకత్వ లక్షణాలు తెలియకుండానే నాకు ఒంటబట్టాయి. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలవంచడం ఎరుగను.

  • నెరవేరని డాక్టర్‌ కల

ఆడపిల్లల చదువుల కంటే పెళ్లిళ్లకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే రోజులు అవి. ఆరుగురు అమ్మాయిలకు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్లు చేయడం నాన్నకు భారమని చుట్టుపక్కల వారు అంటున్నా, చదువుపై నాకున్న ఇష్టాన్ని నా తల్లిదండ్రులు ఏనాడూ కాదనలేదు. నిజానికి నేను డాక్టర్‌ కావాలని ఎన్నో కలలు కన్నాను. కానీ, ర్యాంకింగ్‌ సమీకరణల వల్ల ఆ కల నెరవేరలేదు. అయినా నిరాశ చెందకుండా పోలీస్‌ ఫోర్స్‌లో చేరాలని శ్రమించాను. కానీ, అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు. అయితే, డిగ్రీ చేస్తున్న సమయంలో హాబీగా నేర్చుకున్న కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నా జీవితాన్ని ఇంతటి ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అప్పుడు ఊహించలేదు.

  • న్యూజిలాండ్‌లో తొలి అడుగులు

నాగర్‌కర్నూల్‌కు చెందిన రాజవర్ధన్‌రెడ్డితో వివాహం జరిగాక సరికొత్త ఆశలతో న్యూజిలాండ్‌ చేరుకున్నాను. కొత్త దేశం, అర్థం కాని ఇంగ్లిష్‌.. ఉద్యోగాలు దొరకని పరిస్థితి.. అన్నీ సవాళ్లే, అయినా వెనక్కి తగ్గలేదు. మొదట్లో ఒక ఇండియన్‌ రెస్టారెంట్‌లో అతి తక్కువ జీతానికి పనిచేశాను. ఆ తర్వాత మెక్‌డొనాల్డ్స్‌లో అవకాశం వచ్చింది. అక్కడ పనిచేస్తూనే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. పగలు పనిచేస్తూ, రాత్రిళ్లు ఐటీ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటూ నా కెరీర్‌కు గట్టి పునాదులు వేసుకున్నాను. అపై అమెరికా వెళ్లి మరింత అనుభవాన్ని గడించి మళ్లీ న్యూజిలాండ్‌ చేరుకున్నాను. ఆ అనుభవమే నన్ను ఒక పటిష్టమైన వృత్తి నిపుణురాలిగా తీర్చిదిద్దింది.


  • ఆస్ట్రేలియాలో తెలుగు జెండా

2000వ సంవత్సరంలో న్యూజిలాండ్‌ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నాను. మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డాను. అక్కడ అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించాను. ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ రీసెర్చ్‌ డేటా కామన్స్‌ (ఏఆర్‌డీసీ)లో ఎగ్జిక్యూటివ్‌ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అక్కడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో నా ముద్ర వేశాను. నా జీవితంలో అత్యంత గర్వపడే ఘట్టం.. ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం. ఈ ఎన్నికల బరిలో నిలిచిన తొలి భారతీయ, తెలుగు మహిళగా చరిత్ర సృష్టించాను. 2016 కౌన్సిల్‌ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకు నేను గట్టి పోటీ ఇచ్చాను. గెలవకున్నా ఆ ఎన్నికలు నాకు ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

  • ఉత్సవంలా సంక్రాంతి పండుగ

ఎక్కడ ఉన్నా, పదవులు ఉన్నా, లేకున్నా మన మూలాలు మరచిపోకూడదన్నది నా సిద్ధాంతం. అందుకే ఆస్ట్రేలియాలోని తెలుగు పిల్లలు మాతృభాషకు దూరం కాకూడదని పదేళ్లపాటు స్వచ్ఛందంగా తెలుగు స్కూల్‌ నడిపాను. సంకాంత్రి పండుగను ఆస్ట్రేలియా గడ్డపై ఒక ఉత్సవంలా మార్చి వేలాదిమంది భారతీయులను ఏకం చేశాను. ముగ్గుల పోటీలు, గాలిపటాల పండుగతో ఆస్ట్రేలియా వీధుల్లో తెలుగుదనాన్ని నింపాను. నా ఈ కృషిని గుర్తించి ‘అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌’ వారు ‘ప్రవాస భారతీయ అవార్డు’తో నన్ను గౌరవించడం నా బాధ్యతను మరింత పెంచింది.

01-Navya.jpg

  • విద్యార్థులకు దిక్సూచి

నా ప్రస్థానంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చే విషయం.. మన దేశం నుంచి వచ్చే విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం. భారత్‌ నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఎన్నో కలలతో ఆస్ట్రేలియా వస్తుంటారు. ఇక్కడకు వచ్చాక వాస్తవ పరిస్థితులు తెలిసి దిక్కుతోచని స్థితిలో పడిపోతుంటారు. అలాంటి వారికి ఒక భరోసాలా నిలబడాలని నేను సంకల్పించాను. స్థానిక కాలేజీలు, యూనివర్సిటీలతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థి ఆసక్తిని బట్టి ఏ కోర్సు చదివితే బాగుంటుంది? ఏ యూనివర్సిటీలో ఫీజులు తక్కువ, అవకాశాలు ఎక్కువ.. అన్న విషయాలపై పూర్తి అవగాహన కలిస్తున్నాను. ఏ ప్రతిఫలం ఆశించకుండా నేను చేస్తున్న ఈ సేవ విద్యార్థుల కెరీర్‌ గ్రోత్‌కు తోడ్పడుతోంది. వేల మైళ్ల దూరంలో ఉన్న తమ బిడ్డలు హైమారెడ్డి పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నారన్న భరోసా భారత్‌లోని వారి తల్లిదండ్రులకు కొండంత అండ. విద్యార్థి దశ నుంచి వారిని గ్లోబల్‌ ప్రొఫెషనల్స్‌గా మార్చే ఈ ప్రయాణంలో నేను పొందే ఆనందం వెలకట్టలేనిది. నా సేవాభావం గురించి తెలుసుకున్న భారత్‌లోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు, కాలేజీలు నాతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి. వారి విద్యార్థులకు దిశానిర్దేశం కోసం నన్ను సంప్రదిస్తున్నాయి.


కుటుంబమే నా బలం

ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా భర్త రాజవర్ధన్‌రెడ్డి, పిల్లల సహకారం ఎంత ఉందో.. నా తోడబుట్టిన సోదరీమణుల తోడ్పాటు కూడా అంతే ఉంది. మేం ఆరుగురం ఆడపిల్లలం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నా అక్కచెల్లెళ్ల నిరంతర ప్రోత్సాహం, వారి వెన్నుదన్ను కూడా ఒక ముఖ్య కారణం. నా జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ప్రతి సందర్భంలోనూ నా వెన్నంటి ఉంటూ ‘నీ వల్ల అవుతుంది.. నువ్వు సాధించగలవు’ అంటూ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. వారి ప్రేమాభిమానాలు నాకు ఒక రక్షణ కవచంలా నిలిచాయి. విక్టోరియాలోని ‘తెలంగాణ అసోసియేషన్‌’కు ఫౌండింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన నా భర్త రాజవర్ధన్‌రెడ్డి నా ప్రతి ఆశయానికి అండగా నిలిచారు. ఉద్యోగం, సామాజిక సేవ, రాజకీయాలు.. ఇలా ఎన్ని బాధ్యతలు నిర్వరిస్తున్నా ఇంటి బాధ్యతలు పంచుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న కుటుంబమే నా అసలైన ఆస్తి’’.

ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 03:02 AM