అమ్మ గెలిచింది
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:29 AM
కన్నబిడ్డను కబళిస్తున్న అరుదైన వ్యాధిని నయం చేసుకోవాలని పరితపించింది హైదరాబాద్‌కు చెందిన పవిత్ర శిరోలికర్. కానీ అది కోట్ల రూపాయలతో ముడిపడిన విదేశీ చికిత్స...
కన్నబిడ్డను కబళిస్తున్న అరుదైన వ్యాధిని నయం చేసుకోవాలని పరితపించింది హైదరాబాద్‌కు చెందిన పవిత్ర శిరోలికర్. కానీ అది కోట్ల రూపాయలతో ముడిపడిన విదేశీ చికిత్స అని తెలిసి హతాశురాలైంది. చివరకు వైద్యులు, ఔషధ సంస్థలతో కలిసి సమిష్టిగా కృషి చేసి, ఏడాదికి సరిపడా ఉచిత ఔషధాన్ని అందుకోబోతోంది. ఆ విజేత ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలివి.
‘‘బాబు ఆరవ్ ఆరు నెలల వయసొచ్చేవరకూ అందరు పిల్లల్లా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆ తర్వాత నీరసించి, బరువు తగ్గిపోవడం మొదలుపెట్టాడు. దాంతో బాబులో ఏదో సమస్య ఉన్నట్టు అనుమానించి వైద్యులకు చూపించాను. ప్రాథమిక పరీక్షల్లో ఎదుగుదల లోపం ఉన్నట్టు తేలింది. గత మే నెలలో చేయించిన జన్యు పరీక్షలో మూల కారణం బయటపడింది. ‘ఆలన్ హెర్న్‌డన్ డడ్లీ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి అది. ఆ వ్యాధి గురించి మాకెవరికీ అవగాహన లేదు. దాంతో పిల్లల వైద్యురాలైన డాక్టర్ శివరంజని సంతోష్ దంపతులను కలిసి, వ్యాధి తీవ్రత, పర్యవసానాల గురించి తెలుసుకున్నాను. ఆమెతో కలిసి, ఆ వ్యాధి గురించి లోతుగా పరిశోధించి, రుగ్మతను నియంత్రించే ఔషథం నెదర్లాండ్స్‌లోని ఎమ్‌సిటెక్ అనే ఔషధ సంస్థలో తయారవుతున్నట్టు కనిపెట్టాను. తర్వాత మేమందరం ఇమెయిల్స్ ద్వారా ఆ సంస్థను సంప్రతించడం మొదలుపెట్టాం. అయితే ప్రారంభంలో సహాయం చేస్తామని ఒప్పుకున్న ఆ సంస్థ, తర్వాత ఎంపిక చేసిన దేశాలకే ఔషధాన్ని పంపించగలుగుతామని చెప్పేసింది. అప్పటికే మేమందరం ఆ ఔషధం కోసం 45 రోజులుగా ఉమ్మడిగా శ్రమిస్తున్నాం! దాంతో చెప్పలేనంత నిరాశకు లోనయ్యాను. చికిత్స ఆలస్యమైపోతోందనే బాధ నన్ను మరింత బాధించింది.
భరించలేని భారమిది
ఈ ఔషధాన్ని ఎంత త్వరగా అందిస్తే, బాబులో సహజ ఎదుగుదల అంత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఓ పక్క వైద్య బృందం సహాయంతో ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తూనే, అదే ఔషధాన్ని విక్రయించే ఇతర దేశాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టాను. నిజానికి యూరప్ దేశాల్లో ఆ ఔషధం వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉంది. అలా చివరకు 13 లక్షలు ఖర్చు పెట్టి, జర్మనీలోని ఔషధ సంస్థ నుంచి ఔషధం తెప్పించాను. అంత ఖర్చును ప్రతి నెలా భరించడం మాకే కాదు, సామాన్య ప్రజలెవరికీ సాధ్యపడదు. కాబట్టి ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని మేమందరం నిశ్చయించుకున్నాం.
చివరకు మా ప్రయత్నాలు ఫలించి, ఒక నెదర్లాండ్స్ ఫార్మసీ స్పందించింది. ఫార్మసూటికల్ కాంపౌండింగ్ ద్వారా తక్కువ ధరకే ఔషధాన్ని అందించడానికి కూడా అంగీకరించింది.
రూ.9 కోట్ల ఔషధం 2.5 లక్షలకే...
నెదర్లాండ్స్ ఫార్మసూటికల్ కాంపౌండింగ్ వల్ల ఈ చికిత్సకయ్యే రూ.9 కోట్ల వార్షిక ఖర్చు రెండున్నర లక్షలకు తగ్గడమన్నది గొప్ప పరిణామం. ఇది కొన్నేళ్ల పాటు వాడుకునే ఔషధం కాదు. బిడ్డ బ్రతికున్నంత కాలం జీవితాంతం వాడుతూనే ఉండాలి. కాబట్టి నాలాంటి తల్లులందరికీ ఎంతో ఊరట కలిగించే విషయమిది. మా బాబుతో పాటు సిఎమ్‌సి వెల్లూరులో ఐదుగురు పిల్లలు, హైదరాబాద్‌కు చెందిన మరో చిన్నారితో కలిపి మొత్తం ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచిత ఔషధ పంపిణీకి నెదర్లాండ్ ఫార్మసీ అంగీకరించడం హర్షించవలసిన విషయం.
గోగుమళ్ల కవిత
సమర్థ ఔషధం
కర్ణాటకలోని శిరోలిలో మా పూర్వీకుల మూలాలున్నాయి. ఆ ఊరి పేరు నుంచే మా ఇంటిపేరొచ్చింది. వికారాబాద్ జిల్లా, తాండూరు మా స్వస్థలం. నేను ఇన్‌స్టామార్ట్‌లో గ్రోత్ మేనేజర్‌గా పని చేసేదాన్ని. బాబు కోసం ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాను. మా వారు దిపేంద్ర దేబ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ వ్యాధి పర్యవసానాలను డాక్టర్ శివరంజని వివరించినప్పుడు ఒక్కసారిగా గుండె బద్దలైపోయింది. భోరున ఏడ్చేశాను. అప్పుడామె నన్ను సముదాయించి, ఔషధాన్ని సరసమైన ధరకు తెప్పించే ప్రయత్నాలు మొదలుపెడదామని ధైర్యం చెప్పారు. ఇప్పుడు బాబుకు 23 నెలలు. గత నెల రోజులుగా మాత్ర రూపంలోని ఔషధాన్ని పొడి చేసి, నీళ్లలో కరిగించి ఇస్తున్నాను. బాబులో మార్పు వచ్చింది. ప్రతి క్షణం బాబు వెంటే ఉంటాను కాబట్టి మునుపటి కంటే పరిస్థితి మెరుగు పడినట్టు కనిపెట్టగలుగుతున్నాను. బాబు ఇంతకు ముందులా తేలికగా అలసిపోవడం లేదు. వాడిలో అప్రమత్తత, ఆకలి, బరువు పెరిగాయి. మెడను కుదురుగా నిలబెట్టగలుగుతున్నాడు. బాబు పరిస్థితి గాడిలో పడడం నాకెంతో సంతోషంగా ఉంది.
అందుబాటు ధరకే దొరికేలా
మెదడుకు థైరాయిడ్ హార్మోన్ అందని జన్యు సమస్య ఇది. ఆరవ్ ద్వారా ఈ వ్యాధి నా దృష్టికి రావడంతో చికిత్స గురించిన పరిశోధన మొదలుపెట్టాను. అది ఖరీదైన మందు అనీ, కొన్ని దేశాలకే పరిమితమనీ నా పరిశోధనలో తేలింది. అమెరికాలోని అజెటెక్ ఔషధ సంస్థ ఒక బిడ్డకు ఏడాదికి 9 కోట్లకు ఔషధాన్ని విక్రయిస్తోంది. మొదట జర్మనీ నుంచి ఈ ఔషధాన్ని తెప్పించడంలో సహాయపడ్డాను. అయితే ప్రతి కుటుంబం నెలకు లక్షల రూపాయల ఖర్చును భరించడం సాధ్యపడదు కాబట్టి, ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతికాను. మీడియా సహాకరంతో యాక్సెస్ టు మెడిసిన్ ఫౌండేషన్ అనే సంస్థనూ, నెదర్లాండ్స్‌లోని ఫార్మసూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్‌నూ సంప్రతించాను. అలా నెదర్లాండ్ ఫార్మసీలో ఔషధాన్ని తయారుచేయించడానికి అవసరమైన అనుమతులన్నీ తీసుకుని, 9 కోట్ల రూపాయల ఏడాది ఖర్చును రెండున్నర లక్షలకు పరిమితం చేయగలిగాను. కానీ అందరూ అంతటి ఖర్చును భరించే స్థితిలో లేరు. కాబట్టి నిధులను పోగు చేసి, ప్రస్తుతానికి ఏడాది పాటు ఉచితంగా ఔషధాన్ని అందుకునే ఏర్పాట్లు చేయగలిగాను. ఈ నెల 30న హైదరాబాద్‌లోని ఇద్దరు చిన్నారులు ఈ ఔషధాన్ని ఉచితంగా అందుకోబోతున్నారు. వెల్లూరు సిఎంసి చిన్నారులకు ఇప్పటికే ఔషధాన్ని పంపించేశాం!
డాక్టర్ శివరంజని సంతోష్
సీనియర్ కన్సల్టెంట్ పిడియాట్రిక్స్,
మాగ్నా సెంటర్స్, హైదరాబాద్
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి